న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం నాడు ఏకకాలంలో జరిపిన దాడుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) నేతృత్వంలోని బహుళ-ఏజెన్సీ ఆపరేషన్ 11 రాష్ట్రాల్లో 106 మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్టు చేసింది. అత్యధికంగా కేరళలో (22) అరెస్టులు జరిగాయి. కాగా మహారాష్ట్ర(20), కర్ణాటక (20), తమిళనాడు (10), అస్సాం (9), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (5), మధ్యప్రదేశ్ (4) , పుదుచ్చేరి(3), ఢిల్లీ (3), రాజస్థాన్ (2)లో కూడా అరెస్టులు చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇది “ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దర్యాప్తు ప్రక్రియ”. అరెస్టయిన కార్యకర్తల వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), 11 రాష్ట్రాల పోలీసు బలగాలు ఇప్పటివరకు ఈ అరెస్టులు చేశాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలను నిర్వహించడం, నిషేధిత సంస్థల్లో చేరేందుకు వ్యక్తులను ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తుల ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
2006లో ఏర్పాటైన పిఎఫ్ఐ భారతదేశంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసం నయా-సామాజిక ఉద్యమం కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఇది రాడికల్ ఇస్లాంను ప్రోత్సహిస్తున్నట్లు చట్ట అమలు సంస్థలు తరచూ ఆరోపిస్తున్నాయి. దేశంలో పౌరసత్వ (సవరణ) చట్ట వ్యతిరేక నిరసనలు, 2020 ఢిల్లీ అల్లర్లు, హత్రాస్‌లో (ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లా) ఓ దళిత మహిళను అత్యాచారం చేసి చంపివేసినగ ఘటనపై నిరసనలు, మరికొన్ని ఇతర ఘటనలపై వారి “ఆర్థిక సంబంధాల”పై ఈడి దర్యాప్తు చేస్తోంది.