Saturday, November 2, 2024

కర్నాటకలో 140కి పైగా స్థానాల్లో గెలుపు మాదే: డికె శివకుమార్ ధీమా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఈనెల 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 140కి పైగా స్థానలను గెలుచుకుని అధికారం చేపట్టడం ఖాయమని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపిసిసి)అధ్యక్షుడు డికె శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన శనివారం స్పష్టం చేశారు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం ఖాయమని, 1978 తరహాలోనే 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈ గెలుపు నాంది కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉమ్మడి పౌర స్మృతి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ల వంటి అంశాలను ప్రస్తావించడం పట్ల ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి బిజెపి దివాళాకోరుతనానికి ఇదే నిదర్శనమని ఆయన విమర్శించారు. కర్నాటక పట్ల బిజెపికి ఎటువంటి అజెండా కాని దార్శనికత కాని లేవని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రభావం పనిచేయదని శివకుమార్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తమకే దక్కుతుందని కెపిసిసి అధ్యక్షుడిగా శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలు జరుగుతున్నట్లు వస్తున్న పత్రికా కథనాలలో ఏమాత్రం నిజం లేదని, ఇవన్నీ మీడియా సృష్టేనని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News