Monday, November 18, 2024

గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి

- Advertisement -
- Advertisement -

రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో రానున్న సంవత్సరాలలో కనీసం వెయ్యి నవ తరం వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రకటించారు. గంటకు 250 కిలో మీటర్ల వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి జరుగుతోందని మంత్రి వెల్లడించారు. మంత్రి పిటిఐ వీడియోస్‌కు ఇంటర్వూ ఇస్తూ, వందే భారత్ రైళ్ల ఎగుమతికి ప్రయత్నాలను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించిందని తెలియజేశారు. తొలి రైలు ఎగుమతి వచ్చే ఐదు సంవత్సరాలలో జరగగలదని ఆయన సూచించారు.

గడచిన పది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ తీసుకున్న పరివర్తన చర్యల గురించి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వే రంగంలో చోటు చేసుకున్న గణనీయమైన సాంకేతిక మార్పులలో కొన్ని ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (చీనాబ్ వంతెన), తొలి నదీ గర్భ నీటి సొరంగ మార్గం (కోల్‌కతా మెట్రో కోసం) అని తెలియజేశారు. ప్రస్తు బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా ముంబయి, ఠాణె మధ్య భారత్ తొలి సాగర గర్భ సొరంగ మార్గం నిర్మాణం ప్రారంభం గురించి కూడా మంత్రి మాట్లాడారు. అటువంటి టెక్నాలజీలు ఉన్న దేశాలు ప్రపంచంలో ఐడు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు.

ముంబయి, ఠాణె మధ్య 21 కిలో మీటర్ల నిడివి ప్రతిపాదిత సొరంగ మార్గం సముద్రంలో 9.7 కిలో మీటర్ల దూరం, సాగర గర్భం కింద 54 మీటర్ల దూరం మేర సాగుతుందని ఆయన వివరించారు. రైల్వేల చార్జీల వ్యవస్థ, సాధారణ ప్రజాలకు రైల్వే సేవల గురించి కూడా వైష్ణవ్ మాట్లాడారు. ‘మేము ఏటా దాదాపు 700కోట్ల మందిని, రోజూ 2.5 కోట్ల మందిని తీసుకువెళుతున్నాం. చార్జీల పద్ధతి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని తీసుకువెళ్లడానికి రూ. 100 చార్జీ ఉంటే మేము రూ. 45 వసూలు చేస్తుంటాం. అంటే సగటున రైల్వేల్లో ప్రయాణించే ప్రతి వ్యక్తికి 55 శాతం రాయితీ ఇస్తున్నామన్న మాట’ అని మంత్రి తెలిపారు.

రైల్వేల వార్షిక వ్యయం గురించి కూడా మంత్రి వైష్ణవ్ వివరించారు. పింఛన్లు, జీతాలు, ఇంధన బిల్లు, లీజ్ వడ్డీ చెల్లింపులు వరుసగా రూ. 55 వేల కోట్లు, రూ. 97 వేల కోట్లు, రూ. 40 వేల కోట్లు, రూ. 32 వేల కోట్లు అని ఆయన చెప్పారు. నిర్వహణపై మరి రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం వ్యయం దాదాపు రూ. 2.40 లక్షల కోట్లు అవుతుందని మంత్రి తెలియజేశారు. ‘మేము ఈ ఖర్చులు అన్నిటినీ ప్రధాని మార్గదర్శకత్వంలో బృందం తీవ్ర కృషి చేస్తుండడమే ఇందుకు కారణం’ అని వైష్ణవ్ తెలిపారు. ‘పది సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఎంతో భిన్నమైనవి. ప్రతి రైలులో బయో టాయిలెట్ ఉంటున్నది’ అని మంత్రి చెప్పారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో వందే భారత్ వంటి రైళ్లు యువత అమిత ఆదరణను చూరగొంటున్నాయని ఆయన తెలిపారు.

‘ప్రతి వారం ఒక వందే భారత్ రైలు సర్వీసు ప్రారంభం అవుతోంది. రానున్న కొన్ని ఏళ్లలో కనీసం 400 నుంచి 500 వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నాం’ అని వైష్ణవ్ తెలియజేశారు. రైలు మార్గాల విస్తరణ గురించి మంత్రి ప్రస్తావిస్తూ, ‘నిరుడు 5200 కిలో మీటర్ల కొత్త మార్గం వేశాం. ఈ ఏడాది 5500 కిలో మీటర్ల కొత్త మార్గం వేస్తాం. ఇది ఏటా దేశానికి స్విట్జర్లాండ్‌ను చేర్చడం వంటిది. అంతటి వేగంతో పని సాగుతోంది’ అని మంత్రి చెప్పారు. ప్రయాణికుల భద్రత చర్యలను వైష్ణవ్ వివరిస్తూ, గడచిన పది సంవత్సరాలలో ప్రయాణికుల భద్రతపై రూ.1.27 లక్షల కోట్లకు పైగా వెచ్చించినట్లు, ఏటా 7000 కిలో మీటర్ల పాత రైలు మార్గాలను మారుస్తున్నట్లు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News