Wednesday, January 22, 2025

‘న్యూస్ క్లిక్’పై కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఆన్‌లైన్ పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’ అమెరికా శ్రీమంతుడు నెవిల్లే రాయ్ సింఘం నుంచి నిధులు అందాయని, అందువల్ల ఈ పోర్టల్‌పై కఠిన చర్య తీసుకోవాలని 250 మందికి ప్రముఖ పౌరులు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఈ లేఖలు రాసిన వారిలో మాజీ న్యాయమూర్తులు , మాజీ రాయబారులు కూడా ఉన్నారు. చైనాలో తయారవుతున్న తప్పుడు వార్తలు, కుతంత్రాల ద్వారా భారతీయ పన్ను చెల్లింపుదారులు మోసగింపబడుతున్నారని ఈ లేఖపై సంతకం చేసిన వారు ఆరోపిస్తూ చైనానుంచి పరోక్షంగా నిధులు అందుకుంటున్న ‘ఫ్రీప్రెస్’ మన ప్రజాస్వామ్యాన్ని సవాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ‘భారత వ్యతిరేక ప్రచారంలో పూర్తి వాస్తవాలు తెలుసుకోవడానికి తక్షణమే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని ఆదేశించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. న్యూస్‌క్లిక్‌లో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి తప్పుడు కథనం రావడం, ప్రతిపక్షాలు ఆ అజెండాను అందుకోవడం కాకతాళీయం కాదని ఇప్పుడు స్పష్టమవుతోంది’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

విదేశీ శక్తుల ప్రోద్బలంతో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్న, మన ప్రజాస్వామ్య ప్రక్రియలలో జోక్యం చేసుకోవడానికి యత్నిస్తున్న లాంటి శక్తులను మనం కట్టడి చేయాల్సిన అవసరం లేదా అనే ప్రశ్న తలెత్తుతుందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. చైనా ప్రభుత్వ మీడియాతో సన్నిహితంగా పని చేసే సింఘంనుంచి నిధులు అందుకొంటున్న గ్లోబల్ నెట్‌వర్క్‌లో న్యూస్‌క్లిక్ ఓ భాగమంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించడంతో ఇది మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గతంలో న్యూస్ క్లిక్ కార్యాలయం, ఈ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ నివాసాలపైన ఇడి దాడులు కూడా జరిగాయి. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో తెలంగాణ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కె శ్రీధర్ రావు, 13 మంది హైకోర్టు మాజీ జడ్జిలు, కేంద్ర మాజీ హోం కార్యదర్శి ఎల్‌సి గోయల్, మాజీ రా చీఫ్ సంజీవ్ త్రిపాఠీ, మాజీ ఎన్‌ఐఎ డైరెక్టర్ యోగేశ్ చందర్ మోడీ, 12 మంది మాజీ రాయబారులు, 13 మంది మాజీ డిజిపిలు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News