ఆర్‌టిఐ సమాచారంలో వెల్లడి
త్రిస్సూర్: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమయిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి రూ.1,700 కోట్ల మేర బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు ఆలయ అధికారులు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆలయానికి 260 కిలోలకు పైగా బంగారం నిల్వలున్నట్లు కూడా ప్రకటించింది. ఆలయానికి విలువైన వజ్రాలు, రత్నాలతో కూడిన 263.637 కిలోల బంగారం, దాదాపు 20,000 బంగారం లాకెట్లు ఉన్నాయని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆలయ అధికారులు వెల్లడించారు.
కాగా భద్రతా కారణాల దృష్టా ఆలయ అధికారులు ఇంతకు ముందు ఈ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఇప్పుడు ఆర్‌టిఐ చట్టం కింద చేసిన అభ్యర్థనకు ఈ వివరాలు అందజేశారు. ఆలయానికి 6,605 కిలోల వెండి, 19,981 బంగారం లాకెట్లు, 5,359 వెండి లాకెట్లు కూడా ఉన్నట్లు ఆ ఆర్‌టిఐ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వెండి, బంగారు మొత్తం విలువ ఎంతో మాత్రం ఆ డాక్యుమెంట్‌లో వెల్లడించలేదు.
కాగా గత డిసెంబర్‌లో ఇదే విధంగా ఆర్‌టిఐ చట్ట కింద ఇచ్చిన సమాచారంలో ఆలయానికి రూ.1,737,04 కోట్ల బ్యాంకు డిపాజిట్లు,్ల 271.05 ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. గురువాయూర్‌కు చెందిన ప్రాపర్ చానెల్ అనే సంస్థ అధ్యక్షుడు అయిన ఎంకె హరిదాస్ ఆర్‌టిఐ చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆలయ అదికారులు ఈ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి, అలాగే భక్తుల సంక్షేమం విషయంలో దేవస్వం(ఆలయ ట్రస్టుబోర్డు) నిర్లక్షం కారణంగా తాను ఆర్‌టిఐ ద్వారా ఈ వివరాలు కోరాల్సి వచ్చిందని హరిదాస్ అంటున్నారు.