న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని అనుబంధ కోర్టులలో 1.18 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని శుక్రవారం లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ సుప్రీంకోర్టులో 84,045 కేసులు పెండింగ్‌లో ఉండగా వివిధ హైకోర్టులలో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
పెండింగ్ కేసులు అత్యధికంగా జిల్లా, అనుబంధ కోర్టులలోనే ఉన్నాయని, మొత్తం 4,53,51, 913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. కేసులు పెండింగ్‌లో ఉడడానికి అనేక కారణాలు ఉన్నాయని, మౌలిక సౌకర్యాల లేమి, అనుబంధ కోర్టు సిబ్బంది కొరత, సాక్ష్యాధారాలలో సంక్లిష్టత, బార్, దర్యాప్తు సంస్థలు, సాక్షులు, కక్షిదారుల సహకారం లేకపోవడం వంటివి కారణాలలో కొన్నని ఆయన చెప్పారు. నిబంధనలు, విధానాలు సక్రమంగా పాటించకపోవడం కూడా పెండింగ్ కేసుల కారణమని ఆయన తెఇపారు. కేసుల పరిష్కారానికి కోర్టులకు నిర్దిష్ట కాల వ్యవధి లేకపోవడం, వాయిదాలు తరచు వేయడం, కేసుల విచారణపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటివి కూడా కారణాలని ఆయన తెలిపారు.