Sunday, April 13, 2025

6 వేల మందిని రికార్డుల్లో చంపేసిన ట్రంప్ సర్కార్

- Advertisement -
- Advertisement -

అమెరికాలో నివసిస్తున్న ఆరు వేల మంది వలసదారులను ట్రంప్ ప్రభుత్వం రికార్డుల్లో చంపేసింది. వారంతా జీవించి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రికార్డుల్లో మరణించినట్లు అప్‌డేట్ చేశారు. దీనితో వారి సోషల్ సెక్యూరిటీ నంబర్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నంబర్ తప్పనిసరి. అమెరికా పౌరులతో పాటు తాత్కాలికంగా ఆశ్రయం కోసం వచ్చినవారికీ ప్రభుత్వం ఈ నంబర్ కేటాయిస్తుంది. ఈ సోషల్ సెక్యూరిటీ నంబర్ లేదంటే వారి జీవించి ఉన్నా కూడా మరణించినట్లుగానే పరిగణిస్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనాలూ పొందే అవకాశం వారికి ఉండదు. అంతే కాదు, ఉద్యోగం కానీ, ఏదైనా చిన్నపాటి పని కానీ చేసుకునే వీలు ఉండదు. వలసదారులు తమంతట తామే అమెరికాను విడిచి వెళ్లిపోయేలా చేసేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పొమ్మనలేక పొగ బెట్టినట్లు అనేది తెలుగు సామెత. కానీ, ట్రంప సర్కార్ మాత్రం పొమ్మనే పొగ పెట్టినట్లు ఇలా రికార్డుల్లో వలసదారులను చంపేసింది. బైడెన్ సర్కార్ అమలు చేసిన పలు కార్యక్రమాల ద్వారా సుమారు 90 వేల మంది వలసదారులు అమెరికాలో అడుగు పెట్టారని అధికారులు తెలియజేశారు. వారందరూ తాత్కాలిక ఆశ్రయం కోరి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. అయితే, గడువు ముగిసినప్పటికీ వారు స్వదేశానికి తిరిగి వెళ్లలేదని, అమెరికాలోనే ఉంటున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారందరినీ వెతికి పట్టుకుని వెనుకకు పంపడం శ్రమతో కూడుకున్నదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రికార్డుల్లో వారు చనిపోయినట్లు నమోదు చేస్తే సోషల్ సెక్యూరిటీ నంబర్ రద్దు అయి వారు తమ అంతట తామే అమెరికాను వీడుతారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆరు వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్లుగా నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News