Monday, December 23, 2024

రాజస్థాన్‌లో 68 శాతం పోలింగ్..

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలో శనివారం 68 శాతంపైగా పోలింగ్ జరిగింది. మొత్తం 200 స్థానాలకు గాను 199 సీట్లలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ఆరంభమైంది. శ్రీగంగానగర్ జిల్లాలోని కరన్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందడంతో పోలింగ్ వాయిదా పడింది. ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకూ మొత్తం మీద 69 శాతాన్ని మించి పోలింగ్ జరగడంతో పోలింగ్ ప్రక్రియ ముగిసే ఆరు గంటల నాటికి ఇది రికార్డు స్థాయికి చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. రాజస్థాన్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ ప్రధాన పోటీ కేవలం బిజెపి , కాంగ్రెస్ మధ్యనే నెలకొని ఉంది . ఇరుపక్షాలు అధికారంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం దాదాపు 51000 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతం అని, అయితే ఇద్దరు వ్యక్తులు పోలింగ్ దశలో గుండెపోటుతో మృతి చెందారని అధికారులు తెలిపారు.

పాలీలో ఓ పోలింగ్ ఏజెంటు, ఉదయ్‌పూర్‌లో ఓ వృద్ధుడు హఠాత్తుగా చనిపోయినట్లు వెల్లడించారు. దాదాపుగా ఉదయం నుంచే పలు ప్రాంతాలలో ఓటర్లు బారితీరి తమ హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. రాష్ట్రంలో మొత్తం మీద దాదాపు 5.29 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. బరిలో మొత్తం 1862 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి నిలిచారు. కాంగ్రెస్, బిజెపిల మధ్య పవర్ దోబూచులాట సాగే రాజస్థాన్‌లో ఇప్పుడు ఫలితం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచారం సాగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల సమరానికి రాజస్థాన్ తీర్పు ప్రధాన ప్రాతిపదిక అవుతుందని కాంగ్రెస్, బిజెపి భావిస్తున్నాయి. ఈసారి ఏ ఇతర పార్టీ కూడా రెండు ప్రధాన పార్టీల ప్రాబల్యాన్ని ప్రభావితం చేయలేకపొయ్యాయి. యువకులు, పెద్దలు మందుగా ఓట్లు వేయడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. తాను తెల్లవారుతూనే లేచి ఓటేసేందుకు రెడీ అయినట్లు, పనిలో పనిగా తన స్నేహితులను అలర్ట్ చేసినట్లు కాలేజీ విద్యార్థి జైయశ్వాల్ తెలిపారు.

తొలుత ఓటేసిన వారిలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాష్ చౌదరి, మాజీ సిఎం వసుంధరా రాజే , సచిన్ పైలట్ ఉన్నారు.గెహ్లోట్ , షెకావత్ తమ ఓటును జోధ్‌పూర్‌లో వినియోగించుకున్నారు. కాగా కైలాష్ చౌదరి బలోత్రాలో, రాజే జలావర్, పైలట్ జైపూర్‌లో ఓటుకు దిగారు. కాంగ్రెస్, బిజెపి తరువాత ఆప్ కొన్ని స్థానాలలో తన ప్రభావం చూపుతోంది. కాగా అసద్దుదిన్ ఒవైసీ సారధ్యపు ఆలిండియా మజ్లిస్ ఉ ఇత్తేహాదుల్ ముస్లీమీన్ ( ఎంఐఎం) కూడా బరిలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News