8 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు రూ.100లు,
16 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు రూ.200లు
30 నిమిషాలు దాటితే రూ.500లను వసూలు చేస్తాం
పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేస్తే నామమాత్రపు ఫీజునే వసూలు చేస్తున్నాం
దక్షిణమధ్య రైల్వే అధికారుల వివరణ
మనతెలంగాణ/హైదరాబాద్: ఒక ప్రయాణికుడి నుంచి పార్కింగ్ ఫీజు పేరిట 31 నిమిషాలకు రూ.500ల చార్జీని వసూలు చేయడం అవాస్తవమని దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో రెండురకాలుగా పార్కింగ్ రేట్లు ఉంటాయని వాటిని ముందుగా ప్రయాణికులు తెలుసుకోవాలని పేర్కొంది. సాధారణ పార్కింగ్ చార్జీలతో పాటు నెలవారీ పార్కింగ్ చార్జీలనే వసూలు చేస్తామని, దీంతోపాటు పార్కింగ్ లేనిచోట ఓవర్ స్టే (వాహనాలు నిలిపితే) దానికి మాత్రమే అధిక చార్జీలు ఉంటాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
చార్జీలు జిఎస్టీతో సహా వసూలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓవర్‌స్టే పార్కింగ్ చార్జీలు జిఎస్టీతో సహా వసూలు చేస్తామని అందులో భాగంగా ఆ ప్రయాణికుడి నుంచి రూ.500లను వసూలు చేశామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఎక్కువ సమయం అక్కడ పార్కింగ్ చేసినందుకే ఈ చార్జీని వసూలు చేశామని పేర్కొంది. మాములుగా అయితే ఓవర్ స్టే పార్కింగ్ 8 నిమిషాల వరకు ఉచితం ఉంటుందని, 8 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు రూ.100లని, 16 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు రూ.200లని, 30 నిమిషాలు దాటితే రూ.500లను చెల్లించాల్సి ఉంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. కొన్ని పార్కింగ్ స్థలాలు స్టేషన్ పరిధిలో ఉన్నాయని అక్కడ పార్కింగ్ చేస్తే సాధారణ లేదా నెలవారీ ఫీజులు నామమాత్రంగా ఉంటాయని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కారు లేదా జీపును పార్క్ చేస్తే మొదటి 2 గంటలకు రూ.50లు
ఎంపిక చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో కారు లేదా జీపును పార్క్ చేస్తే మొదటి 2 గంటలకు రూ.50, దాని తరువాత ప్రతి గంటకు అదనంగా రూ.25లను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్రవాహనాలకు మొదటి రెండుగంటలకు రూ.15లు, దాని తరువాత ప్రతి గంటకు రూ.10లు లేదా (24 గంటలకు రూ.180లు) వసూలు చేస్తారు. సైకిల్‌కు రూ.06లను వసూలు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.