మెటియాబ్రజ్ స్థానం నుంచి ఓవైసీ తొలిర్యాలీ ప్రారంభం
హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మైనారిటీల ఆధిపత్యం ఉన్న మెటియాబ్రజ్ ప్రాంతంలో ఈ నెల 25న ర్యాలీ తీయనున్నారు. గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో ఓవైపీ పశ్చిమబెంగాల్ ఎన్నికలపై దృష్టి సారించారు. ఇటీవల ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్)తో పొత్తులపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధినేత తొలి ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఏఐఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి జమీరుల్ హసన్ తెలిపారు. మెటియాబ్రజ్ స్థానంలో మైనారిటీల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోకి ఈ నియోజకవర్గం వస్తుండగా, ముఖ్యమంత్రి, టిఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ప్రచారం కోసం పార్టీ పోస్టర్లు సిద్ధం చేసింది. ‘ఆవాజ్ ఉతనేకే వక్త్ ఆ చుకా హైన్’ (మీ గొంతు పెంచే సమయం ఆసన్నమైంది) నినాదంతో జనం ముందుకు వచ్చింది. అయితే ఓవైసీ ర్యాలీపై పాలక టిఎంసి విమర్శలు చేసింది. ఏఐఎంఐఎం పార్టీ బిజెపి కోసమే పని చేస్తుంది తప్ప మరొకటి కాదని వారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా బెంగాలీ మాట్లాడేవారని, ఓవైసీకి వారి మద్ధతు ఉండదని టిఎంసి నేత సౌగతా రాయ్ అని పేర్కొన్నారు. బెంగాల్‌లో ముస్లింలు మమతా బెనర్జీకి అండగా నిలుస్తారన్నారు. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌కు ఏప్రిల్-, మేలో జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.