పిసిబి అధ్యయనంలో వెల్లడి
బయోరెమిడియేషన్ విధానంతో సత్ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగింది. పలు రకాల చేపలు, వృక్ష, జంతువుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ మోతాదు పెరిగినట్టు కాలుష్యనియంత్రణ మండలి (పిసిబి) తాజా అధ్యయనంలో తేలింది. పర్యావరణహిత బయోరెమిడియేషన్ విధానం, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర జలాలు స్వచ్ఛంగా మారడంతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ఆక్సిజన్ శాతం పెరిగిందని పిసిబి తెలిపింది. ప్రధానంగా కరిగిన ప్రాణవాయువు మోతాదు ప్రతి లీటర్ సాగర జలాల్లో 4 మిల్లీ గ్రాములుగా నమోదైనట్లు స్పష్టమైంది. సాగర్‌లో కాలుష్య మోతాదు తగ్గడంతోనే ఆక్సిజన్ శాతం పెరిగినట్లు ఈ అధ్యయనం పేర్కొంది.
బయో రెమిడియేషన్‌తో సత్ఫలితాలు
సాగర జలాల స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు చేపట్టిన పర్యావరణ హిత బయోరెమిడియేషన్ విధానం సత్ఫలితాన్నిస్తోందని అధికారులు తెలిపారు. ఈ విధానంలో బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుంది. ఏడాదిగా ఈ విధానం అమలుతో హుస్సేన్‌సాగర్ నలుమూలల్లోనూ ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది. సుమారు 70 శాతం ఈ విధానం విజయవంతమైంది. గతంలో సాగర్ జలాల్లో ఆక్సిజన్ మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టిన కారణంగానే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
పిసిబి ప్రమాణాల మేరకు బిఓడి 3 మిల్లీగ్రాములు…
సాగర జలాల్లో ఆక్సిజన్ మోతాదు పెరగడం ఊరటనిచ్చినా.. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బిఓడి) మోతాదు ప్రతి లీటర్ సాగర జలాల్లో 22 మిల్లీగ్రాములుగా నమోదైనట్లు పిసిబి నివేదికలో తేలింది. పిసిబి ప్రమాణాల మేరకు బిఓడి 3 మిల్లీగ్రాములుగా ఉండాలి. కాగా ఇటీవల వర్షాలకు కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చి సాగర్‌లో చేరిన జలాల్లో పారిశ్రామిక కాలుష్య ఆనవాళ్లుండడంతో బిఓడి మోతాదు పెరిగినట్లు పిసిబి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.