ఆక్సిజన్ అత్యవసరాలను తీర్చడానికి 500 ఎల్‌పిఎమ్ ఆక్సిజన్ ప్లాంట్
ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్ : లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో 500 ఎల్‌పిఎమ్ (లీటర్స్ పర్ మినిట్) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గజానన్ మాల్య ఆసుపత్రి మొత్తం కలియతిరిగారు. అక్కడ రోగులకు అందజేస్తున్న చికిత్సతో పాటు అందుబాటులో ఉన్న వసతుల గురించి ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌ను జిఎం అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితులలో ఎంతో ఉపయోగమైన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన హైదరాబాద్ డివిజన్, సెంట్రల్ ఆసుపత్రి అధికారులను, సిబ్బందిని జిఎం ప్రత్యేకంగా అభినందించారు.
లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి ఈ ఆక్సిజన్ అత్యవసరాలను తీర్చడానికి ప్రస్తుతమున్న 13 కెఎల్ సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకర్‌కు అదనంగా నూతన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డా.ప్రసన్న కుమార్, హైదరాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రాయన్, లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా.సి.కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
350 పడకల ఇన్ పేషంట్ వసతి
లాలాగూడ్ సెంట్రల్ ఆసుపత్రి దక్షిణ మధ్య రైల్వేలో ప్రధానమైన ఆసుపత్రి. రైల్వే సిబ్బంది, రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య అవసరాలను తీర్చడంలో ఇది కీలకమయ్యింది. ఈ ఆసుపత్రిలో ఔట్ పేషంట్ సదుపాయమే కాకుండా 350 పడకల ఇన్ పేషంట్ వసతి కూడా ఉంది. ఇక్కడ ప్రధానంగా కార్డియాలజీ, జనరల్ మెడిసెన్, జనరల్ సర్జరీ, ఓబిజి, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, లాప్రోస్కోపిక్ సర్జరీలు, న్యూరో సర్జరీ, 24 గంటల డయాలసిస్‌తో పాటు యూరాలజీ వంటి పలు అంశాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స అందజేస్తున్నారు.
కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేకించి 263 మెడికల్, పారామెడికల్ సిబ్బంది
లాలాగూడ్ సెంట్రల్ ఆసుపత్రిలో రైల్వే లబ్ధిదారుల ప్రయోజనార్థం కోవిడ్ చికిత్స కోసం పూర్తి స్థాయిలో ఇన్ పేషంట్ వైద్యం ప్రారంభించారు. దీనికోసం 250 పడకలను ఏర్పాటు చేశారు. వీటిలో 70 పడకలను హెచ్‌ఎఫ్‌ఎన్‌ఓ, బిఐపిఏపి, వెంటిలేటర్ వసతితో ఇంటెన్సివ్ కేర్ చికిత్సకు కేటాయించారు. ఇక్కడ నేటి వరకు 4,400 మందికిపైగా రోగులకు చికిత్స అందజేయగా అందరూ కోలుకున్నారు. కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేకించి 263 మెడికల్, పారామెడికల్ సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం ఇక్కడ 13 కెఎల్ సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకర్ అందుబాటులో ఉంది. దీన్ని ప్రతిరోజు రీఫిల్ చేస్తుంటారు. ఇప్పుడు అదనపు అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన 500 ఎల్‌పిఎమ్ ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్‌ను జనరల్ మేనేజర్ ప్రారంభించారు.