లేదంటే ఆసుపత్రుల గుర్తింపు రద్దు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు ఉన్న ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో తప్పనిసరిగా ఆక్సిజన్ ఫ్లాంట్లు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాణ వాయువు ఫ్లాంట్ల ఏర్పాటు కోసం నెల రోజుల గడువు ఇచ్చింది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల కెపాసిటీకి తగిన మొత్తంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించింది. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయని ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. ఆగస్టు 31వ తేదీలోగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని పేర్కొంది. 200 బెడ్స్ వరకు ఉన్న ఆసుపత్రుల్లో 500 ఎల్‌పిఎం, 200 నుంచి 500 బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో 1000 ఎల్‌పిఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో 2000 ఎల్‌పిఎం కెపాసిటీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.