దేశంలో కొవిడ్‌తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం చేయబడ్డాయి. విపక్ష పాలిత రాష్ట్రాల్లో కాషాయ కక్ష కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో సిబ్బంది కంటే కొవిడ్ శవాలు ఎక్కువ. ఆస్పత్రుల వరండాల్లో, రోడ్ల పక్కన, ఆటోలలో, అంబులెన్సులలో, ఇళ్ళలో ఎక్కడబడితే అక్కడ కొవిడ్ రోగులు చనిపోతున్నారు. అవసరమైన వారికి మంత్రాలు చదవడానికి పూజారులు అదనపు రుసుం వసూలు చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత ఆస్పత్రులు అన్నింటిలో కొవిడ్ రోగులు ఆక్సిజన్ లేక చనిపోతున్నారు. కాని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పుష్కలంగా ఉందని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన కొరత లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వాదించారు. కొరత ఉందన్న వారిని జాతీయ భద్రత చట్టం కింద బెయిల్ లేని అరెస్టు చేస్తామని, వారి ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటించారు. ఇలాంటి దేశద్రోహుల గుర్తింపులో సాయపడమని సంఘ్ కార్యకర్తలు పాత్రికేయులను కోరారు.
ఆక్సిజన్ సరఫరా కేంద్రం చేతిలో ఉంది. అయినా అశ్రద్ధచేసింది. 162 ఆక్సిజన్ ప్లాంట్ల స్థాపనకు అభ్యర్థనలు రాగా 33కు అనుమతిచ్చింది. వాటిలో నాలుగే పూర్తయ్యాయి. విపక్షపాలిత రాష్ట్రాలకు రోగుల సంఖ్యను బట్టి గాక చావులను బట్టి ఆక్సిజన్ సరఫరా చేస్తోంది కేంద్రం, ఇది కక్షపాతం. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లలో 1% మరణాలే చూపుతున్నారు. 3 కోట్ల ప్రజలున్న ఢిల్లీలో కొవిడ్ రోగులకు 100 వెంటిలేటర్లు, 150 ఇంటెన్సివ్ కేర్లు మాత్రమే కేటాయించారు. దేశ రాజధానికి వాటా ప్రకారం 490 టన్నుల ఆక్సిజన్ అందించమని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. లేకుంటే కోర్టు ధిక్కారమవుతుందని హెచ్చరించింది. అయినా కేంద్రం లెక్క చేయలేదు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆక్సిజన్ నిలువలు నిండుకున్నాయని కేంద్రానికి విజ్ఞప్తులు పంపాయి. రోగుల దీనస్థితి చూసి వైద్యులు ఏడుస్తున్నారు. కేంద్రం పశ్చిమ బెంగాల్ నుండి 01.05.2021న 120 టన్నుల ఆక్సిజన్‌ను తరలించింది.
కేంద్రం పశ్చిమ బెంగాల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇది వరకే మాకు ఆక్సిజన్ సరఫరా ఆపేసి ఉత్తరప్రదేశ్‌కు తరలించింది. ఇది దానికి అదనం అని మమత బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో మోడీ ఎన్నికల నిర్వాకంతో కొవిడ్ పెరిగింది. పరీక్షించిన వారిలో సగం మందికి కొవిడ్ సోకిందని తేలింది. ఆక్సిజన్ కొరత పెరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కువ ఆక్సిజన్ అవసరముంటుందని వైద్యాధికారుల అంచనా. అయినా 223 టన్నులు మాత్రమే అందుతోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను మేమే వాడుకుంటామన్నా రాష్ట్ర అధికారుల విన్నపం తిరస్కరించబడింది. రాష్ట్రంలోని 2 ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 2,200 టన్నుల ఆక్సిజన్ ను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు తరలించారు.
గత ఆగస్టు నుండి దుర్గాపుర్ ఉక్కు పరిశ్రమ నుండే 6,686 టన్నుల ఆక్సిజన్‌ను వివిధ ప్రాతాలకు పంపిణి చేశారు. దుర్గాపుర్ ఉక్కు పరిశ్రమ 900 టన్నుల ఉత్పత్తిని పెంచిం ది. ఉత్పత్తిని పెంచి ఇతరులకు సరఫరా చేయండని కేంద్రం పరిశ్రమాధికారులను ఆదేశించింది. ఈ ఆక్సిజన్ తరలింపులు కక్ష పాతమే. కేరళ ఆక్సిజన్ ఉత్పత్తి 100% పెంచింది. తన అవసరాలు తీర్చుకుని తమిళనాడు, కర్ణాటకలకు ఇస్తోంది. కొవిడ్ టాస్క్ ఫోర్స్ జనవరి నుండి ఏప్రిల్ 15 వరకు సమావేశమే కాలేదు. కొత్త వైరస్ తీవ్రత, కొత్త రోగుల సంఖ్య, వారి అవసరాలు అంచనా కట్టడానికి ప్రభుత్వం కంటి తుడుపుగా నిపుణుల కమిటీని నియమించింది. అయితే వైరస్ వైవిధ్యాల ఉత్పరివర్తనలు, చేసిన పరీక్షలు, రోగులు కోలుకున్న తీరు, టీకా స్పందనలు, ప్రతిరక్షకాల (యాంటిబాడీస్) తయారీశక్తి వంటి అవసరమైన సమాచారాన్ని ఆ కమిటీకి ఇవ్వలేదు. ఆ సమాచారం అందించమని ఏప్రిల్ 30న 350 మంది శాస్త్రజ్ఞులు కేంద్రానికి లేఖ రాశారు.
మోడీ సర్కార్ స్పందించ లేదు. ద్వితీయ తరంగ కరోనా కట్టడికి కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఈ ఏడాది జనవరిలో ఏడుగురు నిపుణులతో ‘నేషనల్ కొవిడ్19 సూపర్ మోడల్ కమిటీని నియమించింది. ఐఐటి హైదరాబాద్ ఆచార్యులు ఎం.విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్ ఆచార్యులు ఎం.అగర్వాల్, వెల్లూరు క్రైస్తవ వైద్య కళాశాల వైరాలజి ఆచార్యులు గగన్ దీప్ కాంగ్ తదితరులు సభ్యులు. ఈ కమిటీ రాబోయే విపత్తు గురించి మార్చి 9 న కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. అశ్రద్ధ చేస్తే మే నెల ప్రారంభానికి కొవిడ్ రోగుల రోజువారీ సంఖ్య 3.8 నుండి 4.4 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఈ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. ఫలితం తెలుస్తోంది.
అమెరికా, ఐరోపాలు ద్వితీయ తరంగ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్నాయి. ఆ సందర్భంలో విశ్వ విత్త వేదిక (డబ్ల్యుఇఎఫ్) అంతర్జాల సభలో మాట్లాడుతూ మోడీ వారికి సానుభూతి తెలపలేదు. సహాయ హస్తాన్ని అందించ లేదు. పైగా నేను కరోనాను పూర్తిగా ఓడించానని డబ్బా కొట్టుకున్నారు. నేడు పాకిస్తాన్ తో సహా ప్రపంచ దేశాలన్నీ మనకు సానుభూతి తెలిపాయి. సాయం చేస్తున్నాయి. మోడీ ప్రతిపక్ష దుర్లక్ష్యం, అహంకారం, తప్పులు దేశ సర్వ నాశనానికి కారణం. నిరంకుశ పాలన దేశప్రతిష్ఠను బురదలో ముంచింది. మోడీ వ్యక్తిగత ‘పరపతి’ పెంచుకున్నారు. రాజనీతిజ్ఞులను అవమానించారు. అత్యంత శక్తివంత రాజకీయునిగా ‘స్వీయప్రతిష్ఠ’ చేసుకున్నారు. ఆ రాజకీయ కాంతి మసిబారింది. అన్నిటికీ ఆయన పాలన శైలి కారణం. మంత్రుల, అధికారుల నైపుణ్యత కంటే ఆయనకు విధేయతే ముఖ్యం. ఆయన చుట్టూ ఔననే వాళ్ళే. నిజం చెప్పడానికి బెదిరేవాళ్లే.
మోడీ విమర్శకు ప్రతి విమర్శ చేస్తారు. సలహాలిస్తే ఎగతాళి చేస్తారు. మోడీకి ప్రజారోగ్యం పట్టలేదు. మనిషికి ఏడాదికి కేవలం రూ.7 వేలు కేటాయించారు. ఆయన అస్తవ్యస్త నిర్ణయాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. వాటిల్లో కొవిడ్ నిర్లక్ష్యం ఒకటి. ఆస్పత్రుల్లో వెంటీలేటర్ల, ఐ.సి.యు., ఆక్సిజన్ల మంచాలు లేవు. 7 కోట్ల టీకా డోసులు విదేశాలకు ఎగుమతి చేసి 5 కోట్ల డోసులు దేశీయ వినియోగానికి ఉంచుకున్నారు. నేడు మనకు టీకాలు లేవు. స్మశానాల్లో రోజూ వేల శవాలు కాలుతున్నాయి. ఎడతెరిపిలేని చితుల పొగలతో ఆకాశాలు బూడిద రంగుకు మారాయి. ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాప్తికి ప్రతిపక్షాలను నిందించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కోవిడ్ రోగులు, మరణాలు ఎక్కువ. దీనికి ఎవరిని నిందించాలి?
భారత దేశ అంతర్రాష్ట్రీయ అంటురోగాల నియంత్రణ కేంద్రం బాధ్యతని వైద్యుడైన వర్ధన్ మరిచారు. కేంద్రం పర్యవేక్షక పాత్రను విస్మరిస్తే అనుచర పాత్ర కలిగిన రాష్ట్రాలదేమి తప్పు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు మరిచి పరస్పర నిందలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్- భారత సీరం సంస్థ (ఎస్.ఐ.ఐ.)ల అంగీకారం ప్రకారం ఎస్.ఐ.ఐ. 92 దేశాలకు టీకాలు సరఫరా చేయాలి. కంపెనీల టీకాల తయారీ పరిమితి పెంచటమే పరిష్కారం. ఆ బాధ్యత మోడీ సర్కారుదే. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి తప్ప అందరికీ టీకాలు అక్కర లేదని ప్రభుత్వం ప్రకటించింది. మే ఒకటి నాటికి 140 కోట్ల జనాభాలో 1.9% మందికే పూర్తి టీకాలు వేశారు. హిందూత్వ శక్తులు మోడీ అభివృద్ధి నాయకుడని ప్రచారం చేస్తున్నాయి. హిందుత్వీకరించబడ్డ ప్రజలు దాన్ని నమ్ముతున్నారు. ఎన్నికలకు మూడేళ్ళ గడువుంది. మోడీకి కుర్చీలో కొనసాగాలన్న యావ ఉంది. నందిపందులను తారుమారు చేసే కుయుక్తులు ఉన్నాయి. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది. ప్రతిపక్షాలు ఒకతాటిపై నడిచే అవకాశం లేదు.