తిరువనంతపురం : ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కేరళ సీనియర్ నేత, మాజీ ఎమ్‌ఎల్‌ఎ పీసీ జార్జిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆ తరువాత తిరువనంతపురం మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన ఇంటి నుంచి ఆదివారం పోలీసులు రోడ్డు మీదుగా తిరువనంతపురం తీసుకువచ్చి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచిన తరువాత బెయిల్ మంజూరైంది. బెయిలు పొందిన తరువాత కోర్టు బయట విలేఖరులతో జార్జి మాట్లాడుతూ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, విద్వేష ప్రసంగాలు వద్దని, ఎలాంటి వివాదాల్లో తలదూర్చరాదని మెజిస్ట్రేట్ తనకు సూచించారని చెప్పారు. దేశాన్ని ప్రేమించలేని తీవ్రవాద గ్రూపులు లేదా మతం మద్దతు గల ఓట్లు తనకు అక్కరలేదని తాను ప్రసంగించానని , ఇది తాను ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఎలా అవుతుందని జార్జి ప్రశ్నించారు. తన అరెస్టు తీవ్ర వాద ముస్లిం గ్రూపులకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అందించిన రంజాన్ బహుమతిగా వ్యాఖ్యానించారు.