Wednesday, January 15, 2025

క్షమాపణలు కాంగ్రెస్ ఎన్ని తరాలకు చెప్పాలో

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నా తల్లిని చంపి బిడ్డను బతికించారు అని పార్లమెంట్‌లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పదేపదే చెబుతుంటే, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన పన్నెండు వందల మంది అమరులకు క్షమాపణలు చెప్పారు. ఉద్యమాలు అన్నప్పుడు ఇలాంటి మరణాలు సహజం అని చెప్పుకొచ్చారు. పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికైనా క్షమాపణలు చెప్పారు మంచిదే. కానీ ఎన్నితరాల తెలంగాణ యువతకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలో కాంగ్రెస్ నాయకులకు తెలియకపోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ వ్యతిరేక ఉద్యమం, 1952 లోనే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలప వద్దు అని సాగిన ఉద్యమం, 1969 లో ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం విఫలం కావడంతో ఆ వెంటనే వచ్చిన నక్సల్స్ ఉద్యమంలో వేలాది మంది యువత అడవిబాట పట్టి ఎన్‌కౌంటర్‌లో అసువులు బాశారు. తన పాట వల్ల దాదాపు పది వేల మంది అడవి బాట పట్టారు అని గద్దర్ రాసుకున్నారు. ఈ లెక్కన ఎంత మంది యువత అడవుల పాలయ్యారో తెలుస్తుంది.

ఆ తరువాత మలి దశ తెలంగాణ ఉద్యమంలో 12 వందల మంది అమరులయ్యారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేయకపోతే తెలంగాణ యువత పాలిట ఈ శాపాలు ఉండేవా? కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం, సోనియా గాంధీ నాయకత్వంలో యుపిఎ లేకపోయి వుంటే తెలంగాణ సాకారం అయి ఉండేది కాదు. ఇవి వాస్తవం. పదేళ్లయినా తెలంగాణ మీద విషం చిమ్మే మోడీ తెలంగాణ ఏర్పడగానే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. అలాంటి మోడీ హయాంలో తెలంగాణ వచ్చేదని ఎవరూ అనుకోలేరు. తెలంగాణ తెచ్చాము అని చెప్పుకొనే హక్కు తెరాస (బిఆర్‌యస్) కు ఉన్నట్టే తెలంగాణ ఇచ్చాము అని చెప్పుకొనే హక్కు కాంగ్రెస్‌కు ఉంటుంది. అంతేకాదు పచ్చగా వున్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేసి అగ్నిగుండంగా మార్చిన బాధ్యత కూడా కాంగ్రెస్‌దే.. నాగార్జునసాగర్, శ్రీ శైలం ప్రాజెక్ట్‌లు కట్టింది మేమే అని చెప్పుకొనే హక్కు కచ్చితంగా కాంగ్రెస్‌కు వుంది. అదే విధంగా తెలంగాణ అంటేనే కరువు, పేదరికంతో జీవనం సాగించడానికి కూడా కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాగు పడితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది.

అదే సంపాదన శక్తి ఉన్న ఓ కుటుంబ సభ్యుడు అకాల మృతి చెందితే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుంది. ఆ కుటుంబం పేదరికం వైపు వెళుతుంది. తెలంగాణలో రెండు మూడు తరాల యువత ఉపాధి లేక, అవకాశాలు లేక అడవుల బాట పట్టి అర్ధాంతరంగా అసువులు బాసినప్పుడు ఆ ప్రభావం మొత్తం తెలంగాణపై వుంటుంది. మరి దీనికి కాంగ్రెస్‌ది బాధ్యత కాదా? ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో మూడు పంటలు పండుతూ పచ్చగా పల్లెలు కళకళలాడినప్పుడు తెలంగాణ పల్లెల్లో ఎన్‌కౌంటర్ పేరుతో యువత రక్తంపారితే దానికి అప్పటి కాంగ్రెస్ పాలన కారణం కాదా? బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన యువత వేలాది మంది తమ కుటుంబ ప్రేమకు దూరమయ్యారు. బతుకుతెరువు తప్ప అక్కడ సంపాదించిందేమీ లేదు. ఎత్తులో ఉన్న తెలంగాణలో నీళ్లు రావు, పంటలు పండవు అని నమ్మించారు.మరి ఈ పదేళ్లలో తెలంగాణలో పంటలు ఎలా పండుతున్నాయి. ఆంధ్ర కన్నా ఎక్కువ వరి ధాన్యాల ఉత్పత్తి తెలంగాణలో ఎలా సాధ్యం అయింది. దేశంలో అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో జరిగింది అంటే నీళ్లు తమ ధర్మాన్ని మార్చుకున్నాయా? ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఇప్పుడు నీరు పల్లంలోకి ప్రవహించడానికి బదులు ఎత్తులోకి ప్రవహిస్తున్నాయా? ప్రకృతి ఎప్పుడూ తన ధర్మాన్ని తప్పదు.

నీరు దిగువకే ప్రవహిస్తుంది. ఆ ధర్మాన్ని గుర్తిస్తూనే ఎగువ ప్రాంతాలకు నీటిని మళ్లించవచ్చు. అయితే దానికి మనసు ఉండాలి, ప్రణాళిక ఉండాలి. తెలంగాణను ప్రేమించేవాడికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. ప్రేమించే గుణం వున్నా ఉమ్మడి రాష్ట్రంలో అది సాధ్యం కాలేదు. సాధ్యం చేసేంత బలమైన నాయకత్వం తెలంగాణ తరపున ఉమ్మడి రాష్ట్రంలో లేకుండే. ఆంధ్ర నాయకత్వం కిందే పని చేయాల్సిన స్థితిలో దృఢంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అది సాధ్యమైంది. పదేళ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ ఇంతగా అభివృద్ధి సాధించింది అంటే ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంత కోల్పోయిందో లెక్కలు వేయగలరా? సంపద రూపంలోనే కాదు ఎంతో మంది యువత ప్రాణాలను తెలంగాణ కోల్పోయింది. వారి ప్రాణాలకు ఎవరు లెక్క కడతారు? ఏ విధంగా లెక్క కడతారు. హైదరాబాద్ రాష్ట్రం తన మానాన తాను బతుకుతుంటే ఆంధ్రాలో కలిపిన పాపం కాంగ్రెస్‌ది కాదా? తెలంగాణ ఉద్యమ కాలంలో విడిపోతే మేము బాగుపడతాం అని తెలంగాణ వాదులు వాదిస్తే, విడిపోతే చీకటిమయం అని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారి వాదన. తెలంగాణ అనుకూల, వ్యతిరేక వర్గాల ఇద్దరి వాదన ఒక ఆంచనా మాత్రమే. బాగుపడతాం అని చెప్పిన వారికి, చెడిపోతారు అని చెప్పిన వారికి ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అవి అంచనాలు మాత్రమే.

కానీ ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి చూస్తుంటే హైదరాబాద్ రాష్ట్రం అలానే ఉండి ఉంటే 60 ఏళ్లలో ఎంతో కోల్పోయాం, హైదరాబాద్ రాష్ట్రంగా మొదటి నుంచి ఉండి ఉంటే ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించి ఉండేవాళ్ళం అనిపించడం సహజం. ఓ సారి ఏదో సమాచారం కోసం 1916 నాటి గోల్కొండ పత్రికను ఇంటర్ నెట్‌లో చూస్తుంటే నుమాయిష్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వార్త కనిపించింది. అవి మొదటి ప్రపంచ యుద్ధం నాటి రోజులు.
నుమాయిష్ (పారిశ్రామిక ప్రదర్శన)ప్రారంభిస్తూ అప్పటి ప్రధాని ఉపన్యాసం అది. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడి నష్టపోయాం.ఇక మనం హైదరాబాద్‌లో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాలి. మన ఉత్పత్తులు మనం వాడాలి, పరిశ్రమలపై దృష్టి పెట్టాలి అని ప్రధాని ఉపన్యాసం. (అప్పుడు హైదరాబాద్ సంస్థానం ఒక దేశం. సొంత విమానాశ్రయం, రైల్వే, కరెన్స్ ఉండేది) హైదరాబాద్‌లో పారిశ్రామిక సంస్కృతీ అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రనాయకులు వచ్చిన తరువాత మొదలయింది అనేది కొందరి ప్రచారం. హైదరాబాద్‌లో పారిశ్రామిక సంస్కృతికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపిన తరువాత తెలంగాణ ఎంత నష్టపోయింది అనేది ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూస్తే అర్ధం అవుతుంది. వ్యవసాయం, ఐటి అన్ని రంగాల్లో అభివృద్ధి కంటి ముందు కనిపిస్తోంది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకు, ఏర్పడే సమయంలో కూడా హైదరాబాద్ నుంచి దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో లక్ష రూపాయలకు ఎకరం లభించేది. 96 లో హైటెక్ సిటీ వద్ద కూడా లక్ష రూపాయలకు ఎకరం. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పుడు 50 కిలోమీటర్ల వరకు రెండు కోట్లకు ఎకరం. పదేళ్లలోనే ఇంత సంపన్న రాష్ట్రంగా మారితే హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలపకుండా అలానే వుంచి వుంటే ఎంత అభివృద్ధి సాధించి ఉండేది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పుణ్యం కోరుతున్నప్పు డు, ఆంధ్రాలో కలిపిన పాపం కూడా కాంగ్రెస్‌కే వస్తుంది. 12 వందల మంది అమరులకే కాదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపి తమ జీవితాలను దుర్భరంగా మార్చిన మూడు నాలుగు తరాల తెలంగాణ యువతకు, కడుపుకోత మిగిల్చిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News