Monday, January 20, 2025

ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర

- Advertisement -
- Advertisement -

ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్‌లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్స్ కల్పించటమేకాక వాటిని రాజ్యాంగబద్ధ్దం చేసింది మాత్రం అంబేద్కర్. మరి విద్య, ఉద్యోగ రంగాల్లో బిసిలకు రిజర్వేషన్స్ కల్పించింది ఎవరు? ఇందులో అంబేద్కర్ గారి పాత్ర ఎంత? అని ప్రశ్నించుకుంటే సాంకేతికంగా లేదనే జవాబే వస్తుంది. ఈ రిజర్వేషన్స్ స్ఫూర్తి ఆయనది కావచ్చు కానీ వాటికోసం పోరాడింది పుంజాల శివశంకర్, కొండా లక్ష్మణ్, బొజ్జం నర్సింహులు,గౌతు లచ్చన్న. వీరిలో మడమ తిప్పకుండా తుదివరకు తెగించి పోరాడి సాధించింది మాత్రం పి.శివశంకరే. వెనుకబడిన తరగతులకు ప్రయోజనాల గురించి ఆలోచించటంలో తనతో భావసారూప్యత కలిగిన కొందరు మిత్రులతో కలిసి ఒకనాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గులని శివశంకర్ కలిశారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి రాజ్యాంగంలో ఏమని ఉందో బూర్గులకు వివరించారు. దాని ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించి జాబితా ఒకటి తయారు చేయించాలని కోరారు. ఇందుకు బదులిస్తూ మీ కోరిక నెరవేర్చటానికి తగు మార్గదర్శక సూత్రాలు తమవద్ద ఏవీలేవని సిఎం బూర్గుల నిస్సహాయత వ్యక్తం చేశారు.

ఆ దశలో అనగా 1953లో ఎస్‌సి, ఎస్‌టిలు కాక సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్వచించేందుకు కేంద్రం నియమించిన కలేల్కర్ కమిషన్ ఎలాంటి మార్గదర్శక సూత్రాలతో పని చేస్తున్నదో తెలుసుకుని వాటిని బూర్గుల ముందు పెట్టారు శివశంకర్. దాంతో కేంద్ర మార్గదర్శక సూత్రాలననుసరించి హైదరాబాద్ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించి ఒక జాబితాను రూపొందించింది బూర్గుల ప్రభుత్వం. 1953లో రూపొందిన ఈ జాబితా 1956 వరకు సజావుగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఈ జాబితాను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒకరు పిటిషన్ వేశారు. ప్రభుత్వ న్యాయవాదులు కేసును బలహీనంగా వాదించడంతో జాబితాను హైకోర్టు కొట్టివేసింది.1960 వరకు దానిపై కదలిక లేదు.
1960లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యా రు. వెంటనే శివశంకర్ మళ్ళీ తన మిత్రబృందం తో సంజీవయ్యను కలిసి వెనుకబడిన కులాల జాబితా వ్యవహారాన్ని ఆయన ముందుపెట్టారు. సిఎం విషయాన్ని అర్ధం చేసుకున్నారు. తాజా జాబితా తయారు చేయించి తదనుగుణమైన ఉత్తర్వులు విడుదల చేశారు. గతంలోది హైదరాబాద్ రాష్ట్ర జాబితా కాగా, నేటి జాబితా ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలతో కూడినది.

కాగా కలేల్కర్ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం 1961లో తిరస్కరించింది.పైగా రాష్ట్రాలు తమ తమ బిసిల జాబితా వర్గీకరణలను స్వయంగా తయారు చేసుకోవాలని అయితే కులాన్నిబట్టి కాక ఆర్ధిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు 1961 ఆగస్ట్ 14న లేఖ రాసింది.ఆ లేఖ 1962లో ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ముందుకు వచ్చిం ది. వెంటనే అంతకుముందు సంజీవయ్య జారీ చేసిన బిసి జాబితా ఉత్తర్వులను రద్దు చేశారు.పూర్వపు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రాలలోని బిసిల జాబితాలను అధికారులతో తెప్పించారు. రెండు జాబితాల్లో కలిపి మొత్తం 160కు పైగా బిసి కులాలున్నాయి. ఇన్ని కులాలు ఏమిటంటూ మొత్తం 90కు దాటకుండా చూడండి అంటూ అధికారులను సంజీవరెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శక సూత్రాలు ఏవీ లేకుండానే ఆర్ధిక వెనుకబాటుతనం ప్రాతిపదికన జాబితా తయారుచేసేపని ప్రారంభించారు.గతంలో ఇదేపనిపై ప్రభుత్వం చుట్టూ తిరిగి జాబితా కోసం ఆరాటపడిన శివశంకర్ సహాయ సహకారాలతో ప్రతి బిసి కులానికి సమర్ధనీయమైన కారణాలను చూపుతూ ఒక జాబితా తయారుచేశారు.ఇదే సమయం లో ఆంధ్రప్రాంత కాపుకులానికి చెందిన న్యాయవాదులను కాపులను బిసి జాబితాలో చేర్చటానికి తగిన కారణాలను తయారుచేసి ఇవ్వండని శివశంకర్ కోరారు. కానీ తమను బిసి జాబితాలో చేర్చటాన్ని వారు అవమానకరంగా భావించి అందుకు అంగీకరించలేదు.

కానీ శివశంకర్‌ను నాటి శ్రీకాకుళం జిల్లాపరిషత్ చైర్మన్ గొర్లె శ్రీరాములు నాయుడు కలిసి తమ తూర్పు కాపులను బిసిల్లో చేర్చండని కోరారు. ఆమేరకు ఆ కాపుల చరిత్ర గణాంకాలు పేర్కొంటూ వారిని కూడా బిసి జాబితాలో చేర్చారు. ప్రభుత్వానికి జాబితా సమర్పించారు. ఆమేరకు 1963 జూన్ 21న జిఒ నెంబర్ 1886 విడుదలయింది. దీన్ని అదే ఏడాది సెప్టెంబర్‌లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పుతో తన సిఎం పదవికి రాజీనామా చేయటానికి ముందు సంజీవరెడ్డి అసలు బిసి కులాల జాబితానే రద్దు చేస్తూ 1964 ఫిబ్రవరి 3న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక దుర్ఘటన. కొత్త ముఖ్యమంత్రిగా బ్రహ్మానందరెడ్డి వచ్చారు.నాటి విద్యుత్ బోర్డ్ చైర్మన్ జెవి నరసింగరావు ద్వారా సిఎంను శివశంకర్ కలిశారు. ఎప్పటిలాగానే బిసికులాల జాబితా తయారీ ఆవశ్యకతను అప్పటివరకు జరిగిన ప్రయత్నాలను సిఎంకు వివరించారు. ఓపిగ్గా విన్న సిఎం జాబితా తయారీ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘానికి సహకరించేందుకు అనధికారికంగా శివశంకర్‌నూ ఆహ్వానించారు.అన్ని కోణాలనుండి చర్చించి 112 కులాలతో జాబితా రూపొందించారు.

ఈ మేరకు 1966 జులై 29 న జిఒ నెంబర్ 1880 (విద్య)ను ప్రభుత్వం జారీ చేసింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేసారు. జగన్మోహన్ రెడ్డి సారాథ్యంలోని ధర్మాసనం గతంలో చెప్పిన కారణాలతోనే మళ్ళీ జిఒను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అదీ హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఏదైతేనేం కథ మళ్ళీ మొదటికొచ్చింది. అప్పటికి మంత్రి అయిన జెవి నరసింగరావు ద్వారా మళ్ళీ సిఎం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు శివశంకర్.అలా తిరగ్గా తిరగ్గా రెండేళ్లకు 1968 ఏప్రిల్ 12నాడు కొత్త కమిషన్‌ను నియమిస్తూ జిఒ 870 జారీ చేసింది ప్రభుత్వం. ఈ జిఒలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినవర్గాల జాబితా తయారు చేయటం విద్య, ఆర్ధిక పరంగా వాళ్ల అభివృద్ధికి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉపకార వేతనాలలోనూ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు విషయాలలో ప్రభుత్వానికి నిర్దిష్టమైన సిఫార్సులు చేయటం ఈ కమిషన్ లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొన్నది. కమిషన్ చైర్మన్‌గా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మనోహర్ ప్రసాద్‌ను నియమించింది. కానీ ఈ పదవికి 1968 లో ఆయన రాజీనామా చేసారు. దీంతో ఆ స్థానంలో పదవీ విరమణ చేసిన ప్రభుత్వాధికారి అనంతరామన్‌ను 1969 అక్టోబర్ 29న నియమించారు.

అనంతరామన్ కమిషన్ సమగ్ర అధ్యయనం చేశాక 93 కులాలు సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడినాయని నిర్ణయించింది. వీరిని ఎ, బి, సి, డిలుగా వర్గీకరించింది. తగిన సిఫారసులతో 1970 జూన్ 20న ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫారసులను అంగీకరించింది. వర్గీకరణను ఆమోదించింది. ఆ మేరకు 1970 సెప్టెంబర్ 23న జిఒ నెం. 1793 (విద్య) విడుదల చేసింది. శివశంకర్‌ను ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది. ఈ కమిషన్ సిఫారసులను కోర్టుల్లో ఎవరన్నా సవాల్ చేస్తే అవి వీగిపోకుండా గెలిపించేలా మీ అనుభవంతో మీరే చూడాలి. ఈసారి కూడా వీగిపోతే ఇక ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ ఈ ప్రయత్నం చేయదు అని శివశంకర్‌కు సిఎం బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పారు. అనుకున్నట్లే మెడికల్ కాలేజీల్లో సీట్లు రాని కొందరు ఈ జిఒను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశారు. దాంతో ఈ జిఒ చెల్లదంటూ 1971 మే 13న హైకోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటికే అప్పీళ్లతో విసుగొచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న శివశంకర్ అభ్యర్ధనకు స్పందించలేదు. ఎన్ని రకాలుగా చెప్పినా ప్రభుత్వం స్పందించకపోయేసరికి అప్పీల్‌కు ప్రభుత్వం అంగీకరించకపోతే నాకీ ప్రభుత్వ న్యాయవాది పదవి అక్కరలేదు.

రాజీనామా చేస్తా. బిసిల తరపున నేనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తా అని శివశంకర్ స్పష్టం చేసేసరికి అప్పీల్‌కు ప్రభుత్వం అంగీకరించింది.ప్రభుత్వం తరపున రెండు సెట్ల పిటిషన్‌లు వేశారు. 1 ఎస్‌వి గుప్తా, పి. శివశంకర్, పిపి రావు (కేసు సిఎ నెంబర్ 901/1971) 2 పి. శివశంకర్, పిపి రావు (కేసు సిఎ నెంబర్ 902, 903/1971). ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1953 నుండి ఇప్పటివరకు బిసి కులాల జాబితా చరిత్రనంతా క్రమపద్ధ్దతిలో శివశంకర్ వివరించారు. ఇక అడగటానికి ఏమీ లేదు అనే దశ దాకా శివశంకర్ తన మేధస్సునంతా కూడగట్టి వాదించారు.చివరకు ‘ఎపి ప్రభుత్వం ప్రకటించిన జాబి తా సరైనదే. ఈ జాబితా ప్రకారం రిజర్వేషన్‌లను ప్రభుత్వం అమలు చేయవచ్చు’ అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1970 సెప్టెంబర్ 23 నాటి జిఒ 1793 చెల్లుబాటు అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి యుఎస్‌వి బలరామ్ తదితరులకు మధ్య నడిచిన కేసులో 1972 జనవరి 28 న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1953 నుండి 1972 వరకు దాదాపు రెండు దశాబ్దాలపాటు దూరమైన న్యాయం బిసిలకు దక్కింది. శివశంకర్ గెలిచిన ఈ కేసువల్లే బిసి జాబితా రిజర్వేషన్‌లు అమల్లొకొచ్చాయి. బిసి కులాల జాబితా తయారీకి జరిగిన కృషిలో కోర్టు పోరాటాలలో అడుగడుగునా కనిపించింది, వినిపించింది శివశంకర్‌గారే.

మండల్ కమిషన్ నివేదిక చెల్లుబాటులోనూ శివ శంకర్ పాత్ర
1979 ఆరంభంలో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సారాథ్యంలోని కేంద్రప్రభుత్వం వెనుకబడిన కులాల రెండవ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి బీహార్ నుండి జనతా పార్టీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికైన బిందెశ్వరి ప్రసాద్ మండల్‌ను చైర్మన్‌గా నియమించింది. ఈ అంశంపై మొదటి కమిషన్‌ను కేంద్రం 1953లో నియమించింది. దీనికి కాకా కలేల్కర్ చైర్మన్. ఈ కమిషన్ 1955లో కేంద్రానికి తన నివేదిక సమర్పించింది. కేంద్రం 1961లో ఈ నివేదికను తిరస్కరించింది.ఇది జరిగిన 18 ఏళ్లకు రెండవదిగా మండల్ కమిషన్ ఏర్పాటైంది.1979 చివరినాటికి నివేదిక సమర్పించాలని కేంద్రప్రభుత్వం గడువు విధించింది. అదే ఏడాది మార్చి 21 నుండి కమిషన్ పని ప్రారంభించింది.ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న చరణ్ సింగ్ ఈ కమిషన్ పదవీకాలాన్ని 1980 మార్చి 31 వరకు పొడిగించారు.

కానీ ఆ ఎన్నికల్లో మండల్ ఓడిపోయి బీహార్‌లోనే ఉండిపోయారు.ఇందిరమ్మ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి అయిన శివశంకర్ మండల్ ను ఢిల్లీకి పిలిపించారు. ఆయన ఢిల్లీకి రాగానే కమిషన్ పని ఎంతవరకు వచ్చిందని శివశంకర్ అడిగారు. మరో రెండు మాసాలు కమిషన్ కాలాన్ని పొడిగించితే మొత్తం పని పూర్తవుతుందని మండల్ చెప్పారు.శివశంకర్ చొరవతో కమిషన్ కాలాన్ని ఇందిరాగాంధీ రెండుసార్లు పొడిగించారు. మొదట 1980 సెప్టెంబర్ 30 వరకు ఆ తరువాత అదే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించారు. చివరికి గడువు చివరి రోజు 1980 డిసెంబర్ 31న ఇందిరాగాంది సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి మండల్ కమిషన్ తన నివేదిక సమర్పించింది. నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌చేశాయి. అలా చేయాలంటే కమిషన్ సిఫారసులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో కూడా రాయాలి. కానీ ప్రభుత్వంలో అత్యున్నత నిర్ణయాధికార వేదిక అయిన రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ కమిషన్ నివేదికను అంగీకరించరాదని తీర్మానించింది. దీంతో ఈ నివేదికను అమలు వల్ల కలిగే పరిణామాలను అమలు ఫలితాలను అధ్యయనం చేయటానికి అధికార కమిటీకి అదనంగా ఒక కాబినెట్ కమిటీ నియమించాలని ప్రధాని ఇందిర నిర్ణయించారు.

కొత్త కాబినెట్ కమిటీ ఏర్పాటైంది. పివి నర్సింహారావు చైర్మన్. కమిటీ సభ్యులలో శివశంకర్‌నూ ఒకరిగా నియమించారు.1981 ప్రారంభంలో ఏర్పాటైన ఈ కమిటీ 1989 వరకూ ఉన్నా ఒక్కసారి కూడా కమిటీ సమావేశాన్ని పివి ఏర్పాటు చేయలేదు. కాలక్రమంలో విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. వెంటనే మండల్ కమిషన్ సిఫారసులను ఆయన దృష్టికి అప్పటి రాజ్యసభ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న శివశంకర్ తీసుకెళ్లారు. ప్రధాని విపి సింగ్ సానుకూలంగా స్పందించారు. సిఫారసుల అమలుకు అవసరమైన లాంఛనాలను పూర్తిచేయటానికి ప్రభుత్వం ఒక కమిటీనీ వేసింది. ఈ కమిటీ తయారుచేసిన ముసాయిదాను ఒకసారి అధ్యయనం చేసి ఎక్కడెక్కడ సరిచేయాలో అవి కూడా చేసి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా శివశంకర్‌ను ప్రధాని విపి సింగ్ కోరారు. కమిషన్ నివేదిక చారిత్రిక ప్రాధాన్యత స్ఫూర్తి దాని విలువ తెలిసిన వ్యక్తిగా ఈ సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ నిస్తున్నట్లు శివశంకర్‌కు ప్రధాని తెలిపారు.

దేశవ్యాప్తంగా బిసి లకు దక్కనున్న ప్రయోజనాలను దిద్దితీర్చే ఈఅవకాశాన్ని శివశంకర్ వదిలిపెట్టలేదు.కమిషన్ ముసాయిదాను తయారుచేశారు. దాన్ని యథాతథంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ అలాగే ఆమోదించింది. ఆనందాన్ని తట్టుకోలేకపోయిన కేంద్రప్రభుత్వ న్యాయవాదులు శివశంకర్ వద్దకు వచ్చి హర్షాతిరేకంతో ఆలింగనం చేసుకున్నారు. అభినందనలతో ముంచెత్తారు. ముసాయిదా ప్రశ్నించడానికి వీలులేని రీతిలో ఉందని అందువల్ల ఆమోదం సులువైపోయిందని వారు ఆనందంగా చెప్పా రు. కానీ ఈ ప్రక్రియలో శివశంకర్ పాత్ర ఉండటం కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు. మండల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వ ఆమోదం పొందాక కోపం తో మూడు మాసాలపాటు తనతో రాజీవ్ గాంధీ మాట్లాడలేదని కానీ ఆ నివేదిక అమలు తనకు అవధుల్లేని సంతృప్తిని కలిగించిందని శివశంకర్ చెప్పుకున్నారు.

కెఎస్‌ఎన్ ప్రసాద్
9492522089

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News