Thursday, January 23, 2025

మహోన్నత వ్యక్తిపై ఉదాత్త రచన

- Advertisement -
- Advertisement -

భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ఆ పదవిని చేపట్టిన తొలి తెలుగువాడన్న ఖ్యాతితో పాటు, ఐదేళ్ళ పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినవాడన్న కీర్తిని కూడా గడించాడు. ఆర్థిక రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని అస్తవ్యస్త పరిస్థితుల నుండి బయటపడేసిన సాహసిగా, ధీశాలిగా విఖ్యాతి పొందాడు. ఇందిర, రాజీవ్‌లు చేపట్టడానికి వెనుకాడిన అణ్వస్త్ర పరీక్షలకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకొని, పరీక్షించే అవకాశం మాత్రం తన తర్వాతి ప్రధాన మంత్రి వాజ్‌పేయీకి వదలిపెట్టిన ప్రధానిగా కూడా పేరు గడించాడు. నిజాయితీపరుడు, ప్రధాన మంత్రులకు విధేయుడు, జ్ఞాన సంపన్నుడు, బహు భాషావేత్త కూడా అయిన పివి కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలను విజయవంతంగా నిర్వహించిన సమర్థుడు. రాజకీయ నాయకుల్లో అరుదుగా వుండే సాహిత్య సృజన శక్తికి ప్రతీక పివి. పివి పై ఒక ఉద్గ్రంథాన్ని, అదీ జీవిత చరిత్రను రాయదలచిన ఎవరికైనా ముందుగా వుండవలసింది ఆ గొప్ప వ్యక్తి మీద అచంచలమైన గౌరవం. యుక్త వయసు నుండే రాజకీయ పరిశీలకుడుగా వుంటూ వచ్చిన ఆచార్య జి.

చెన్నకేశవ రెడ్డికి పివి వ్యక్తిత్వం మీద అసమాన గౌరవాభిమానాలున్నాయి. అందుకే 600 పుటల ‘జాతి రత్న పివి నరసింహారావు’ అన్న ఉద్గ్రంథంలో పివి విశ్వరూపాన్ని బహు కోణాల నుండి చిత్రీకరించగలిగాడు. ఇందుకు సుమారు వంద పుస్తకాలను, వివిధ పత్రికలను పరిశోధించాడు. అట్లా ఇది ఒక మహోన్నత వ్యక్తిపై ఉదాత్త రచన కాగలిగింది. చెన్నకేశవ రెడ్డి కవితా సంపుటాలు, పరిశోధనా గ్రంథాలు రచించి ఇది వరకే సర్వ సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. తన ప్రజ్ఞాచక్షువుతో వివిధ రంగాల లోతుపాతులు తెలుసుకున్న ప్రతిభాశాలిగా కూడా ఈ గ్రంథంలో అడుగడుగునా కనిపిస్తాడు. ఇక్కడే ఇంకో విషయం ప్రస్తావించడం మంచిది. ఈ జీవిత చరిత్ర ఒక నవలగా కూడా రూపొందింది. చాలా వరకు కాలక్రమాన్ని పాటించినా అవసరమైనప్పుడు వెనకా ముందులుగా కథనం చేయడం జరిగింది. నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో గాని, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రి వర్గంలో గాని పని చేసినప్పుడు చెన్న కేశవ రెడ్డి దృష్టిలో ప్రపంచానికి వెల్లడైన విషయం పివి ‘మలిన మనస్కుడు’ కాడని, పదవిని పట్టుకొని పాకులాడినవాడు కాడు. పొంగిపోవడం, కుంగిపోవడం లేదు.

నిజాయితీగా, ముక్కుసూటిగా ముందుకు సాగడమే ఆయన తత్వం. తనకంటూ ఒక వర్గాన్ని పెంచి పోషించుకోవడం అనే తప్పుడు పని ఎప్పుడూ చేయలేదని చెన్నకేశవ రెడ్డి అంటున్నాడు. పివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రెండు అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు. ఒకటి భూ సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం సాధించిన ఘట్టంలో భూస్వాములైన శాసన సభ్యులు, మంత్రులు చేసిన వికృత రాజకీయాలు పివికి వెగటు కలిగించాయని రచయిత భావిస్తున్నాడు. తెలంగాణ ముల్కీ రూల్స్ చెల్లుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పివి సమర్థించినప్పుడు ఆంధ్రా ప్రాంతంలో చెలరేగిన హింసనూ ప్రస్తావించి ఆ ప్రాంతంలో పివి విస్తృతంగా పర్యటించి తన భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాడని కూడా చెన్నకేశవ రెడ్డి తెలియజేస్తున్నాడు. అనగా సాహసంతో సమస్యను పరిష్కరించే దిశగానే ప్రయత్నించాడు తప్ప ఎక్కడా ముఖం చాటేయ లేదన్నది చెన్నకేశవ రెడ్డి అభిప్రాయం. తాను నమ్మిన విలువల ముందు పదవి తృణప్రాయమన్నది పివి అలవరచుకొన్న రాజకీయ సంస్కారంగా మనం భావించవచ్చు.

స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన పివిని కేంద్రం ఎన్నో గెలుపు మెట్లు ఎక్కించింది. హోం శాఖ, ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ వంటి ముఖ్యమైన శాఖలను సమర్థంగా నిర్వహించి ప్రధాన మంత్రి తర్వాతి స్థానంలో నెంబర్ 2 గా కొనసాగుతూ వచ్చాడు. ఆయన పరిపక్వతతో తన ప్రధాన మంత్రులకు సరైన సలహాలను ఇస్తూ వచ్చాడు. తనను సంప్రదించకుండా ప్రధాన మంత్రులు తీసుకొన్న నిర్ణయాల వల్ల వాళ్ళే మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. సిక్కు తీవ్రవాదులను స్వర్ణ దేవాలయం నుంచి తొలగించడానికి తీసుకున్న చర్య ఇందిగా గాంధీకి ప్రాణాంతకమైంది. అపరిపక్వతతో శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపడం వల్ల ఎల్‌టిటిఇ ప్రతీకార చర్య రాజీవ్ గాంధీకి ప్రాణాంతకమైంది. ఈ రెండు సందర్భాలలోనే కాదు, ఎమెర్జెన్సీ సందర్భంలో కూడా ఆయా ప్రధాన మంత్రుల నిర్ణయాలను పివి హర్షించలేదన్నది చెన్నకేశవ రెడ్డి అభిప్రాయం. రాజీవ్ తదనంతరం సోనియా అభ్యర్థన మేరకు పివి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు. అక్కడి నుండి ప్రధాన మంత్రి పదవి కూతవేటు దూరంలో వుంటుంది.

అర్జున్ సింగ్, శరద్ పవార్ వంటి నాయకులు ప్రధాని పదవి కోసం ఎత్తులు వేశారు. అయితే పివిపై ఎత్తు ముందు వారు నిలువలేకపోయారు. నిజాయితీ, సమర్థత, పార్లమెంటరీ అనుభవం కలిసి రావడం వల్ల సోనియా గాంధీ పివి వైపు మొగ్గు చూపారు. పివి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు, పదవి నుండి దిగి పోయే వరకు ఎవరూ ఊహించని చాణక్యాన్ని ప్రదర్శించాడని చెన్నకేశవ రెడ్డి భావన.భారత దేశం ఆర్థికంగా ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్ళను పరిష్కరించడానికి పాత మార్గాలు పని చేయవని గ్రహించిన పివి ఆర్థిక మంత్రిగా అర్థశాస్త్ర నిపుణుడైన మన్మోహన్ సింగ్‌ను నియమించాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి, ప్రపంచ బ్యాంకు నుండి, విదేశాల నుండి అప్పు పుట్టని దుస్థితి ఏర్పడింది. దీని వల్ల దేశం గౌరవం మసకబారింది. నిలువ వున్న బంగారం తాకట్టు పెట్టక తప్పలేదు. రూపాయి విలువ తగ్గించడం వంటి దిద్దుబాటు చర్యలు తప్పలేదు. ప్రభుత్వ రంగం పాత్రను తగ్గించి, ప్రైవేటు రంగం పాత్రను పెంచవలసి వచ్చింది. ‘సరళీకరణ’ అన్న కొత్త ఆర్థిక విధానానికి పెద్ద పీట వేశాడు.

ఆర్థిక మంత్రి తన తొలి బడ్జెట్‌లో ఈ ఆర్థిక నీతిని స్పష్టంగా వెల్లడించాడు. ప్రతిపక్షాలు ఇది పేదలను నిరు పేదలను చేసే బడ్జెట్‌గా పెదవి విరిస్తే, ఆర్థిక రంగ నిపుణులు మాత్రం ప్రశంసించారంటున్నాడు చెన్నకేశవ రెడ్డి. క్రమంగా మంచి ఫలితాలు రావడం మొదలైంది. నిజానికి పివి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం. తన ఐదేళ్ళ కాలంలో మూడు అవిశ్వాసాలు ఎదుర్కొన్నా ప్రభుత్వం సాధించిన విజయాల ఆధారంగానే వాటిని పివి నెగ్గ గలిగాడన్న చెన్నకేశవ రెడ్డి అభిప్రాయం సరైనదే. తనది మైనారిటీ ప్రభుత్వం అన్న భావన పివి తనలోకి రానీయ లేదు. సత్యసంధతతో, సమయ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాడన్నది చెన్నకేశవ రెడ్డి అభిప్రాయం.ప్రతి ప్రధానికి ఏదో ఒక అగ్ని పరీక్ష తప్పదు. పివి ఎదుర్కొన్న జటిల సమస్య బాబ్రీ మసీదు కూల్చివేత. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో వున్న బిజెపి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, జాతీయ నాయకుడు అద్వానీ, సంతులు, సాధువులు, పీఠాధిపతులు బాబ్రీ కూల్చివేత జరుగదని హామీ ఇచ్చారు. ఆ రాష్ట్ర గవర్నర్ కూడా తొందరపడి రాష్ట్రపతి పాలన విధించకూడదని అన్నాడు. దీంతో పివి నిశ్చింతగా వున్నాడు.

కాని జరగకూడని దుర్ఘటన జరిగిపోయింది. కాని తనవారు, ప్రతిపక్షాలు పివి వైపే వేలెత్తి చూపారు. తాను నమ్మక ద్రోహానికి గురయ్యానని పివి వివరించాడు. ఈ సందర్భంలో పివిని సమర్థిస్తూ పివి భగవద్గీతను ఎంత బాగా చదివారో ఖురానును కూడా అంత బాగా చదివిన జ్ఞాని. ఆయన సన్నిహిత మిత్రులందరూ ఆయనను సెక్యులర్ అని భావిస్తారు’ అంటూ పివిని సమర్థిస్తూ చెన్నకేశవ రెడ్డి వెల్లడించిన అభిప్రాయం ఎంతో సముచితంగా వుంది. ఈ దురదృష్టకరమైన ఘట్టం పివికి మనోవేదనను మిగిల్చినా, ఆ తర్వాత ఆయన ఒక ఉక్కు మనిషిగా చకచకా రాజకీయ పాలనా సంబంధమైన అనేక నిర్ణయాలు తీసుకొన్నాడు. ఒక ఉక్కు మనిషిగా దేశాన్ని మునుముందుకే నడిపించాడు. 1996 పార్లమెంటు ఎన్నికలలో రెండు స్థానాల నుండి గెలుపొందాడు. బిజెపి అధికారంలోకి వచ్చింది. కొన్ని కోర్టు కేసులు ఎదుర్కొని పులుగడిగిన ముత్యంగా నిరూపితుడయ్యాడు.వేయి పడగలకు పివి ‘సహస్రఫణ్ ’ పేరిట చేసిన అనువాదం, ఆప్టే మరాఠీ నవలకు ‘అబలా జీవితం’ పేరుతో చేసిన అనువాదం ప్రసిద్ధి చెందాయి.

గొల్ల రామవ్వ కథ, మంగయ్య అదృష్టం నవలిక స్వతంత్ర రచనలు. ‘బ్లూ సిల్క్ సారీ’ అన్న కథను ఆంగ్లంలో రాశాడు. వీటన్నింటిని గూర్చి చెన్నకేశవ రెడ్డి విపులంగా పరామర్శించారు. అన్నింటికంటే గొప్ప రచన పివి ఆంగ్లంలో రాసిన ‘ది ఇన్‌సైడర్’. దీన్ని ప్రముఖ జర్నలిస్టు కల్లూరి భాస్కరం తెలుగులోకి మూల విధేయంగా అనువదించారు. ఈ నవలను పివి ఆత్మకథాత్మక నవల అనవచ్చు. క్లిష్టమైన శిల్ప మర్యాదలున్న ఈ నవలను లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించగలగడం చెన్నకేశవ రెడ్డికి సాహిత్య విమర్శ మీద వున్న పట్టుకు నిదర్శనం. మొత్తం మీద ‘జాతి రత్న పివి నరసింహారావు’ రచన ఏకకాలంలో చరిత్రను, జీవిత చరిత్రను, రాజకీయాలను, సమాజాన్ని చదివిన సంతృప్తిని పాఠకుడికి కలిగిస్తుంది. సందర్భోచిత ఔచిత్యం పాటిస్తూ, అదనపు సమాచారాన్నిస్తూ, వాస్తవ ఘటనలకు, సన్నివేశాలకు కాల్పనిక లక్షణాలను జోడిస్తూ ఒక చిరస్థాయిగా నిలిచే అసమాన రచనను అందించినందుకు చెన్నకేశవ రెడ్డి అభినందనీయుడు. జీవిత చరిత్ర విభాగాన్ని ఈ రచన సుసంపన్నం చేసిందని చెప్పవచ్చు. ‘జాతి రత్న..’ను ప్రచురించిన తెలుగు అకాడెమీ సంచాలకులకు ధన్యవాదాలు చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News