Thursday, January 9, 2025

హాలీవుడ్ తారల హాహాకారాలు

- Advertisement -
- Advertisement -

లాస్‌ఏంజెలెస్‌లోని పసిఫిక్ పాలీసాడ్స్ ప్రాంతంలో
కోరలుసాచిన కార్చిచ్చు హాలీవుడ్‌హిల్స్,
బెవర్లీహిల్స్‌ను చుట్టుముడుతున్న మంటలు
ఇప్పటికే ఇళ్లు కోల్పోయిన పలువురు హాలీవుడ్
నటులు కాలిబూడిదైన మార్క్ హామిల్, టామ్
హాంక్స్, రీస్ వెదర్ స్పూన్, బెన్ అఫ్లిక్స్, స్పెన్సర్
ప్రాట్, హెడీ మోంటాగ్ గృహాలు స్టీఫెన్ స్పిల్‌బర్గ్ సహా పలువురిని ఖాళీ చేయించిన అధికారులు

అమెరికాలో కుబేరులకు ఆవాసాలైన మూడు నగరాల్లో ఒకటైన లాస్‌ఏంజెలెస్ సిటీ లోని అత్యంత ఖరీదైన ప్రదేశాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తమ సామగ్రి , వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తరలివెళ్లారు. ఒకవైపు వీధుల్లో పొగ కమ్మేయగా, మరోవైపు ఒక్కసారిగా జనం రోడ్ల పైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఇక్కడ కొండలపై ఉన్న రహదారులు ఇరుగ్గా ఉంటాయి. దీనికి తోడు గాలులు ఎక్కువగా వీచడంతో మంటలు తొందరగా వ్యాపిస్తున్నాయి.

రాత్రివేళల్లో ఇక్కడ గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ స్పందిస్తూ “చాలా నిర్మాణాలు కాలిపోయాయి. మరికొన్ని చోట్ల కూడా కార్చిచ్చులు పుట్టొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ” అని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 13,000 నిర్మాణాలకు కార్చిచ్చు ముప్పున్నట్టు లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక అధికారి క్రెస్టీన్ క్రావ్లీ చెప్పారు. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్‌ఫెర్నాండో కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి ఫైర్ అలర్ట్ లెవల్స్‌ను పెంచారు. దాదాపు 62, 000 మంది ప్రజలు కొన్నిగంటలుగా విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు , బుల్డోజర్లను అధికారులు రప్పించారు.

ఇళ్లు కోల్పోయిన హాలీవుడ్ స్టార్స్…
హాలీవుడ్ స్టార్లు టామ్‌హాంక్స్, రీస్ విథర్సూన్, స్పెన్సర్ ప్రాట్, హెడీ మోంటాగ్ వంటి నటుల ఇళ్లు అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. మరికొందరి ఇళ్లు కూడా అగ్నికీలలకు సమీపంలో ఉన్నట్టు తెలుస్తోంది.
స్పందించిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇక్కడి కార్చిచ్చుపై స్పందించారు. తరచూ అప్‌డేట్లు తెలుసుకొంటున్నట్టు వెల్లడించారు. అక్కడి ప్రజలకు అవసరమైన అన్ని రకాల సాయాలను శ్వేతసౌధం చేస్తుందన్నారు. స్థానిక అధికారులతో తన బృందం టచ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఫైర్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ గ్రాంట్‌ను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News