రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కందులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై రూ.400 బోనస్ ఇవ్వాలని కోరుతూ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కందుల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 400 రూపాయలు బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు ఆరు లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో భాగంగా కందులకు మద్దతు ధరకు అదనంగా 400 రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించారని గుర్తు చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బహిరంగ మార్కెట్ లో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కందులకు మద్దతు ధర రూ.7,550 ఉంది, కానీ బహిరంగ మార్కెట్‌లో రూ.6,500 నుండి రూ.6,800 మించి క్వింటాలుకు చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, దాంతో ప్రతి క్వింటాలు పైన మద్దతు ధరతో పోలిస్తే రైతులు రూ.800 రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కంది రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి వారి గోస తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు మద్దతు ధర అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.