Tuesday, January 7, 2025

అణచివేత మీ విధానమైతే.. ఎదిరించడం మా నైజం:పాడి కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం అని హుజూరాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన వైఫల్యాలను ఆధారాలతో సహా ఎండగట్టిన హరీశ్ రావును భయపెట్టే ప్రయత్నం చేయడం కక్షపూరిత చర్య అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అణచివేత మీ విధానం అయితే, ఎదిరించడం మా నైజం అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిర్బంధాలు, ఆంక్షలు, కంచెలు కాంగ్రెస్ పరిపాలనలో నిత్య కృత్యమయ్యాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తాటాకు చప్పులకు బిఆర్‌ఎస్ భయపడదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం.. ఖబర్దార్ అని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని అన్నారు.

మీ దొంగ హామీలను నిలదీయడమే మేం చేసిన తప్పా : ఎంఎల్‌ఎ సంజయ్
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్ రావుపై సిఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కోరుట్ల ఎంఎల్‌ఎ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించి వందల కేసులు పెట్టిన భయపడకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు హరీశ్ రావు అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు హరీశ్‌రావు భయపడరని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రెండు అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే, అది మీ అవివేకమే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. సిఎం గొప్పగా చెప్పుకుంటున్న ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దొంగ హామీలను, ఎగవేతలను నిలదీయడమే తాము చేసిన తప్పా అని అడిగారు. మీరు ఎన్ని వందల కేసులు పెట్టినా, మీ ఎగవేతలను ప్రశ్నిస్తూనే ఉంటామని.. ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని సిఎం రేవంత్‌రెడ్డికి స్పష్టం చేశారు.

హరీష్ రావుపై కేసు అప్రజాస్వామికం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావుపై పోలీసులు అక్రమ కేసు పెట్టడం అప్రజాస్వామికం అని జనగామ ఎంఎల్‌ఎ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఏడాది కాలం పూర్తి అయినా క్రమంలో తెలంగాణ ప్రజలకు ఏం చేయలేకపోయాడని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న హరీశ్‌రావుపై కావాలనే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి కక్షపూరిత చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో అకృత్యాలు నిత్య కృత్యమయ్యాయని, రేవంత్ సర్కారు కేసులకు,

బెదిరింపులకు బిఆర్‌ఎస్ నాయకులెవరూ భయపడరని స్పష్టం చేశారు. పది, పదిహేనేళ్లు ప్రజా క్షేత్రంలో ఉంటూ పోరాడిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది అని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటామని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. హరీష్ రావు కాలిగోటికి సరిపోని వ్యక్తి.. సిద్దిపేటకు చెందిన చోటామోటా కాంగ్రెస్ నాయకుడితో ప్రభుత్వం అక్రమ కేసు పెట్టించిందని ఆరోపించారు.కేసులు, పోరాటాలు బిఆర్‌ఎస్ నాయకులకు కొత్తకాదని, ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

సవాళ్ళు విసురుతున్నారని, సంకెళ్ళు వేద్దామని అనుకుంటున్నారా..? : ఏనుగుల రాకేష్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమ వీరుడు, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నానని బిఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకా ఈ దిక్కుమాలిన కేసులా..? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సవాళ్ళు విసురుతున్నారని, సంకెళ్ళు వేద్దామని అనుకుంటున్నారా..? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనను ఎప్పటికప్పుడు కడిగి పారేస్తుండని కారాగారంలో పెడుదామని అనుకుంటున్నారా..? జనాల ముందు మీ తప్పులను ఎండగడుతుండు కాబట్టి జైలులో వెయ్యాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. సంకెళ్లు వేస్తే సలాం చేసే వ్యక్తి కాదు ఆయన, భీకర స్వరాన్ని వినిపించే శక్తి అని వ్యాఖ్యానించారు. కారాగారాలకు కంగుతినే వ్యక్తి కాదు, మీ కాంగ్రెస్ కోటలను కబలించే శక్తి… జైలులో పెడితే జనికే వ్యక్తి కాదు, జంగు సైరన్ మోగే శక్తి..తెలంగాణ కోసం త్యాగాలకు సిద్దపడిన వ్యక్తి మీ తాటాకు చప్పుళ్ళకు భయపడుతాడు అనుకోవడం మీ మూర్ఖత్వమే అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News