Monday, October 21, 2024

యాదాద్రి ఆలయంలో రీల్స్…. అడ్డంగా బుక్కైన పాడి కౌశిక్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మరో వివాదం…
యాదాద్రి ఆలయంలో రీల్స్.. నెట్టింట వైరల్‌గా వీడియోస్
భక్తుల ఆగ్రహం.. అడ్డంగా బుక్కైన పాడి కౌశిక్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ వివాదాలు తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. మొన్నటి దాక అరెకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారిన విషయం విదితమే. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం చక్కబడినట్టు కనిపించగా ఇది మరువకముందే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఇలవేల్పుగా ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ క్షేత్రంలో రీల్స్ తీసుకున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

కౌశిక్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్ చేసిన వీడియోలు ఆయన పంచుకోవడం వివాదానికి దారి తీశాయి. యాదాద్రి క్షేత్రంలో ఇలాంటివి తప్పు అని భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఆలయ సంప్రదాయాలు, నియమ, నిబంధనలకు విరుద్దంగా ఎంఎల్‌ఎ హోదాలో ఉన్న కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? అనేది తెలుసుకుందాం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కౌశిక్ రెడ్డి తన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వివాదానికి దారి తీసింది. పాడి కౌశిక్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దీంట్లో తన సతీమణి శాలిని పుట్టిన రోజు సందర్భంగా పోస్టు చేసిన వీడియో వివాదానికి తెరతీసింది. ఆ వీడియోలో తన సతీమణి శాలినితో కలిసి యాదాద్రి ఆలయంలో తిరుగుతున్నారు.

అంతేకాకుండా అక్టోబర్ 3వ తేదీన తన కుమార్తె శ్రీనిక జన్మదినం సందర్భంగా ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కూడా యాదాద్రి క్షేత్రం వద్ద తీసినవే. ఆలయ మాఢ వీధుల్లో తిరుగుతూ తన కుమార్తె శ్రీనికతో కౌశిక్ రెడ్డి రీల్స్ చేయించారు. ఒక ఎంఎల్‌ఎగా బాధ్యతాయుత పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి, ఆలయ క్షేత్రంలో ఇలా రీల్స్ చేయడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తే కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్ కోసమే ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. వాళ్లు రీల్స్ చేసేటప్పుడు భక్తులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం వివాదం రేపిన ఈ రీల్స్‌పై ఆలయ పాలక మండలి స్పందించలేదు. ఈ విషయంపై ఆలయ ఈవో భాస్కర్‌రావును వివరణ కోరగా ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో చిత్రీకరణ కోసం అనుమతి కోరగా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బయటి ప్రాంగణంలో తీసుకోవచ్చని తెలియజేశానన్నారు.

పక్క రాష్ట్రం ఎపిలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల వైసిపి ఎంఎల్‌సి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు రీల్స్ చేయడం వివాదస్పదమైంది. కొద్దిరోజుల క్రితం దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపై తిరుమల మాఢ వీధుల్లో రీల్స్ చేయడం వివాదానికి దారితీసింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వారు పబిల్క్ న్యూసెన్స్ చేశారని టిటిడి విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్‌ఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలపై కేసు నమోదు చేసి, విచారణ నోటీస్ లు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో యాదగిరి కొండపై రీల్స్ చేసిన ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డిపై దేవస్థానం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News