Monday, December 23, 2024

సాంస్కృతిక ఉద్యమం నుండి పద్మశ్రీ వరకు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సాహిత్యానికి సాంస్కృతిక ఉద్యమానికి జనగామ పుట్టినిల్లు. జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ రావడంతో మరోసారి ఈ ప్రాంతం తెరపైకి వచ్చింది. ఎందరో మహోన్నతమైన వ్యక్తులు సాహిత్య, సాంస్కృతిక ఉద్యమంలో జీవిత కాలం కృషి చేసి తద్వారా ఈ ప్రాంతానికి ఎంతగానో పేరు తెచ్చారు. బొమ్మర పోతన, పాలుకూరి సోమనాథుడు, వాల్మీకి సాహితీ ప్రముఖులు ఈ నేలపై పుట్టిన బిడ్డలే కావడం తెలిసిందే. ఆ మాటకు వస్తే ఆధునిక కవులు, కళకారులు ఎందరో జనగామ నేల నుండే పురుడుపోసుకున్నవారు కావడం విశేషం. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2024 సంవత్సరానికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో పద్మ పురస్కారాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది కూడా.

తాజాగా తెలుగు వారిలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సినీ నటుడు కొణిదెల చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్ ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా, వీరిలో ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. కాగా తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీలు వచ్చాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ రావడం విశేషం.

జనగామ జిల్లా వాసులు ఎందరో…
గడ్డం సమ్మయ్యతో పాటు అందే శ్రీ, చుక్క సత్తయ్య , అంబాల మల్లగౌడ్, జివైగిరి, కడకంచి పాపయ్య, సాంబరాజు యాదగిరి, కన్నా పరశు రాములు తమ తమ రంగాల్లో విశేష కృషి చేశారు, ఇంకా చేస్తున్నారు. ఆధునిక సాంస్కృతిక సాహిత్య కళలను వెలుగులోకి తేవడంలో మూడున్నర దశాబ్దాల క్రీతం జనగామలో సాంస్కృతిక ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ముఖ్యంగా మరుగున పడ్డ సాంస్కృతిక కళారూపాలను వెలుగులోకి తేవడంలో ఎందరో కృషి చేశారు. అందులో ప్రముఖులు ఇంద్రసేనా రెడ్డి , అంబాల మల్ల గౌడ్, జివై గిరి, కన్నా పరశురాములు, కడకంచి పాపయ్య, సాంబరాజు యాదగిరి, చుక్క సత్తయ్య మొదలగు వారు విశేషమైన కృషి చేశారు. ముఖ్యంగా జనగామ ప్రాంతంలో జ్యోతిర్మిమై లలితకళ సమితి ఏర్పాటు చేసి మరుగునపడిన తెలంగాణ కళాకారులను, కళారూపాలను వెలుగులోకి తేవడంలో విశేషమైన కృషి చేశారు. ముఖ్యంగా కోలాటం, డప్పు నృత్యం, ఒగ్గు కథ, చిందు బాగోతం, డోలు విన్యాసం, పల్లే సుద్దులు చిరుతల రామాయణం ఇలాంటి నృత్య రూపాలను కళారూపాలను వెలుగులోకి తేవడంలో జ్యోతిర్మిమై లలిత కళ సమితి కృషి ఎంతో గొప్పది.

ఈ కళాకారులను హైదరాబాద్ రవీంద్ర భారతిలోనూ, అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఈ సంస్థ ద్వారానే పరిచయం చేశారు. కాగా ఉమ్మడి వరంగల్ అప్పటి కలెక్టర్ బిపి ఆచార్య ఈ కళా సంస్థకు ఎంతో ప్రాధాన్యత, తోడ్పాటు అందించడం విశేషం. ఈ కళాకారులను ప్రోత్సాహించడంతో డోలు, డప్పు ఇతర అనేక కళారూపాలు ఊరుఊరునా విస్తరించాయి. ముఖ్యంగా అప్పట్లో సంపూర్ణ మద్యపాన నిషేధం, అక్షరాస్యత ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మొదలైన వాటిలో కీలకంగా పని చేశారు. గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్బంలో డోలు, డప్పు, కోలాటం మొదలైన కళాకారులను, కళారూపాలను మొదట దేశ విదేశాల్లో పరిచయం చేయడంద్వారా జనగామ సాంస్కృతిక ఉద్యమ నేపథ్యాన్నీ ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవడం చారిత్రక సందర్భం అని పలువురు విశ్లేషించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనగామ సాంస్కృతిక ఉద్యమం నుండి పద్మశ్రీ అవార్డు రాక వరకు యక్షగానంలో గత మూడున్నర దశాబ్దాలుగా గడ్డం సమ్మయ్య చేసిన సాంస్కృతిక ప్రయాణం విశేషమైనదేనంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News