ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ (100) కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొదుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని దోమలగూడలోని గగన్ మహల్‌కు కుటుంబసభ్యులు తరలించారు. జగదీష్ మిట్టల్ మృతి పట్ల రాజకీయ నాయకులు, టాలీవుడ్ ప్రముఖులు, కళాకారులతో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగదీష్ మిట్టల్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి సంతాపం
ప్రముఖ కళాకారుడు జగదీష్ మిట్టల్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రముఖ కళాకారుడు, కళా సంపాదకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ మరణం పట్ల సిఎం రేవంత్ తీవ్ర సంతాపం తెలియజేశారు. అలాగే భారతీయ కళలు, వారసత్వాన్ని పరిరక్షించడానికి, వాటిని ప్రోత్సహించడానికి జగదీష్ మిట్టల్ చేసిన అపారమైన కృషి అమూల్య మయ్యిందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ద్వారా వారు అందించిన వారసత్వం తరతరాల కళాకారులు, కళాభిమానులు, చరిత్రకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని సిఎం తెలిపారు. ఇక జగదీష్ మిట్టల్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సిఎం రేవంత్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జగదీష్ మిట్టల్ మృతి చాలా బాధాకరం: మంత్రి కొండా సురేఖ
ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ మృతి చాలా బాధాకరమని మంత్రి కొండా సురేఖ సంతాపం తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టు పెట్టారు. తెలంగాణ కళలను పరిరక్షించడానికి ప్రోత్సహించడానికి జగదీష్ మిట్టల్ చేసిన కృషి ఎనలేనిదని ఆమె కొనియాడారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ద్వారా వారు అందించిన వారసత్వం తరతరాల కళాకారులు, కళాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని అన్నారు.
కళాప్రపంచానికి స్ఫూర్తి ప్రతీకగా జగదీష్ మిట్టల్ : ఫిల్మ్ మేకర్ బి.నర్సింగ్‌రావు
పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ గారి మరణం పట్ల ఫిల్మ్ మేకర్ బి.నర్సింగ్‌రావు సంతాపం తెలిపారు. కళ ఎప్పటికీ చెరగదు, అది కళాభిమానుల హృదయాల్లో, హైదరాబాద్ చరిత్రలో చిరస్మరణీయం గా నిలిచి ఉంటుందన్నారు. 100 సంవత్సరాల పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ ప్రాచీన కళాభిమానిగా, నిబద్ధత కలిగిన హైదరాబాద్ వాసిగా ఖ్యాతి గాంచారన్నారు. ఆయన తన సహచరురాలు కమల మిట్టల్ తో కలిసి దేశీయ కళా సంపదను సేకరించడంలో అపూర్వ కృషి చేశారన్నారు. కమల మిట్టల్ దశాబ్దం క్రితం తుది శ్వాస విడిచినా, వారి కలలు సాకారం చేసిన జగదీశ్ కమల మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్‌లో వీరి సేకరణ,
సుమారు 2,000 కళాఖండాలుగా రూపుదాల్చిందన్నారు. ఇది భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల వారి అభిరుచి, కృషికి ప్రతీకగా నిలిచి, హైదరాబాద్‌కి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. కళాకారునిగా, పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ తో తన సంబంధం ఎంతో ఆత్మీయమైనది, మధురమైనది, చిరస్మరణీయమైనదన్నారు. ఆయన ఎందరో కళాకారులకు మార్గదర్శకుడిగా, మెంటర్ గా, కళా ప్రపంచానికి స్ఫూర్తి గా ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఈ విషాద సందర్భంలో ఆ మహానుభావునికి తన హృదయపూర్వక నివాళులు అర్పించారు.