మన తెలంగాణ/హైదరాబాద్: సురభి నాటక కళాకారుడు నాగేశ్వరరావు అలియాస్ సురభి బాబ్జి(76) గురువారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం పరిస్థితి విషమించడంతో మరణించారు. నాటక రంగంలో తొలి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న కళాకారుడిగా సురభి బాబ్జికి మంచి గుర్తింపు ఉంది. పేరు నాగేశ్వరరావు అయినా సురభి నాటక కళతో ఆయన పేరు సురభి బాబ్జిగా మారిపోయింది.
సిఎం కెసిఆర్ సంతాపం
ప్రముఖ రంగస్థల నటుడు, కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ సురభి (రేకందార్) నాగేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సంగీత, నాటకరంగానికి శతాబ్ధానికి పైగా సురభి సంస్థ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమైనవని సిఎం కెసిఆర్ కొనియాడారు. తెలుగు వారికి సుపరిచితమైన సురభి సంస్థ వారసుడుగా, నాటక రంగానికి నాగేశ్వర్ రావు చేసిన సాంస్కృతిక సేవ గొప్పదన్నారు. నాగేశ్వర్ రావు మరణం సురభి సంస్థకే కాకుండా, యావత్తు నాటకరంగానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Padma Shri Surabhi Babji passed away