Wednesday, January 22, 2025

పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం..

- Advertisement -
- Advertisement -

గిరిజన కళలకు గొప్ప గౌరవం
పద్మశ్రీ పురస్కారం కళల గొప్పతనానికి నిదర్శనం
పద్మశ్రీ రామచంద్రయ్యకు ఘన సత్కారం
రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
మనతెలంగాణ/ హైదరాబాద్: గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కృషి జరుగుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం నగరంలోని గిరిజన మ్యూజియంలో కోయజాతి ఆణిముత్యం, జానపద కళాకారులు, డోలి వాయిద్యకారులు పద్మశ్రీ రామచంద్రయ్యను ఎంపి మాలోతు కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చోంగ్తు, అధికారులు కలిసి మంత్రి ఘనంగా సత్కరించారు. ఆయనకు పట్టు వస్త్రాలతో పాటు శాలువా కప్పి, లక్ష రూపాయల నగదు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ మేడారం జాతరలో సమ్మక్క – సారలమ్మల చరిత్రను డోలి వాయిద్యంలో చెప్పే రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం ఈ ప్రభుత్వానికి ఆదివాసీ కళల పట్ల ఉన్న చిత్తశుద్ది, అంకితభావానికి నిదర్శనమన్నారు. గతేడాది గుస్సాడి కనకరాజును, ఈ ఏడాది రామచంద్రయ్యలను పద్మశ్రీలకు ప్రతిపాదించడం ద్వారా గిరిజన కళల గొప్పతనాన్ని, ఆవశ్యకతను చాటి చెప్పారన్నారు. ఆదివాసీ కోయబిడ్డ ఎక్కడో పుట్టి, కళకు గొప్పసేవ చేసి భారత పురస్కారం పద్మశ్రీ పొందారు. కోయ చరిత్రలు చెబుతూ తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పద్మ పురస్కారాలకు ప్రతిపాదించడం ఈ కళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పద్మశ్రీ పురస్కారాలు గొప్ప వారికే కాదు మారుమూల గిరిజనులకు కూడా వస్తాయి అని చెప్పడానికి ఈ ఆదివాసీ ఆణిముత్యాలు నిదర్శనమన్నారు.

సిఎం కెసిఆర్ స్వయంగా కళాకారులు కావడంతో ఈ రాష్ట్రంలో కళాకారులకు అత్యంత గౌరవం దక్కుతుందన్నారు. గిరిజన సంస్కృతి, కళలు అంతరించకుండా గిరిజన సంక్షేమ శాఖ ఎనలేని కృషి చేస్తోందన్నారు. జోడేఘాట్లో కొమురం భీమ్ మ్యూజియం, మేడారంలో ఆదివాసీ మ్యూజియం కట్టి వారి కళలు, చరిత్రను భావితరాలకు తెలియ చేస్తున్నాం. ఆదివాసీల నాగోబా జాతర మొదలైంది. నేను స్వయంగా సందర్శించి, ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇస్తామని మంత్రి తెలిపారు.ఇప్పటికే రూ.5 కోట కేటాయించాం.. జాతర నిర్వహణకు ఏటా రూ.20 లక్షలు ఇస్తున్నాం. సేవాలాల్ మహరాజ్ జయంతి, కుమురం భీమ్ జయంతి, వర్ధంతి, జంగుబాయ్ జాతర, నాగోబా జాతర వంటివి గొప్పగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. హైదరాబాద్‌లో నిర్మించిన గిరిజన, ఆదివాసీ ఆత్మ గౌరవ భవనాలు త్వరలో ప్రారంభిస్తాం. పద్మశ్రీ రామచంద్రయ్య కుటుంబానికి వారి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు, వారి పిల్లలను గిరిజన శాఖ ద్వారా సముచితంగా ఆదుకుంటాం. తొందరలోనే రామచంద్రయ్యను సిఎం కెసిఆర్‌తో కలిపించే ప్రయత్నం చేస్తున్నాం. కార్యక్రమంలో పద్మశ్రీ రామచంద్రయ్య కొడుకు బాబురావు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ, కళ్యాణ్ రెడ్డి, సీతారాంనాయక్, శంకర్‌రావు, లక్ష్మీప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చాలా సంతోషంగా ఉంది: పద్మశ్రీ రామచంద్రయ్య
నేను ఎక్కడో కోయజాతిలో పుట్టాను. ప్రతిసారి మేడారం జాతరలో అమ్మవార్ల చరిత్రను చెబుతాను. ఈసారి కూడా ముందు మేడారం జాతరకు వెళ్లాలని ఉంది.ఈ అవార్డు రావడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ నన్ను సన్మానం చేస్తున్నారు.నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను, నా కుటుంబాన్ని, నా కోయ జాతిని మంచిగా చూసుకోవాలని సిఎం కెసిఆర్‌కు పదివేల నమస్కారాలు.

గిరిజన, ఆదివాసీలకు దక్కిన గౌరవం: కవిత, ఎంపి
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన, ఆదివాసీల ఆణిముత్యాల పేర్లు కేంద్రానికి సిఫారసు చేస్తుంది. ఇలాంటి వారి గురించి సిఫారసు చేయడం చాలా గొప్ప విషయం. మొగిలయ్య కూడా చాలా కష్టపడ్డారు.బీమ్లానాయక్ సినిమాలో పాటపాడడం ద్వారా అవార్డు వచ్చిందని కొందరు అనుకుంటున్నారు. కానీ ఆయన కొన్నేండ్లుగా చాలా కష్టపడుతున్నారు. పద్మశ్రీ రామచంద్రయ్య మేడారం చరిత్ర ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు. ఆయనకు నేడు ఈ గుర్తింపు రావడం నిజంగా ఆయన సేవలకు అందిన తగిన గౌరవం. ఇలాంటి గొప్ప కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 10 వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది. త్వరలోనే రామచంద్రయ్యకు కూడా ఈ పెన్షన్ వస్తుంది.

మా సంస్కృతిని కాపాడే గొప్ప ప్రయత్నం: రేగా కాంతారావు, ప్రభుత్వ విప్

పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకు మరోసారి అభినందనలు. రాష్ట్రం ఏర్పడిన తరవాత కనుమరుగు అయ్యే కళలు, జాతులను గుర్తించి పద్మశ్రీ వంటి వాటితో గుర్తించడం గొప్ప విషయం. మా సంస్కృతి దోపిడికి గురి అవుతున్న సమయంలో కాపాడే గొప్ప నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది.పాఠశాలల్లో ఇటువంటి కళలను ప్రోత్సహిస్తాం అనడం నిజంగా గొప్ప విషయం.ఈ జాతులు, కళలను భవిష్యత్ తరాలకు తీసుకెళ్లడంలో గిరిజన సంక్షేమశాఖ పాత్ర అత్యంత ముఖ్యమైంది.మేడారం జాతరలో రామచంద్రయ్య ప్రతి సారి ఆ చరిత్ర చెబుతుంటారు. కాబట్టి ఈ కళను, జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

డోలి కళను విద్యార్థులకు నేర్పిస్తాం: క్రిస్టినా జడ్ చొంగ్తూ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్
ఈ కళను ప్రోత్సహించేందుకు గిరిజన శాఖ కొన్నేళ్ల నుంచి పని చేస్తోంది. రామచంద్రయ్యకు పద్మశ్రీ వంటి గొప్ప పురస్కారం రావడంత్లో ఈ కళను మరింత పటిష్టం చేసేందుకు అవకాశం లభిస్తుంది. డోలి కళను గురుకులాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తాం.

Padmasri Ramachandraiah meets Satyavathi Rathod

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News