తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రాత్రి అమ్మవారు మహారాణీ అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.
వాహనసేవల్లో తిరుమల శ పెద్ద జీయర్ స్వామి, చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఇఒ జె.శ్యామలరావు, జెఇఒ వీరబ్రహ్మం, ఆలయ డీప్యూటీ ఇఒ గోవింద రాజన్ పాల్గొన్నారు.