న్యూఢిల్లీ: ప్రకృతి అందాల నడుమ అత్యంత సౌందర్యంగా ఉండే పహల్‌గామ్‌లో ఈ నెల 22వ తేదీన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పర్యాటకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదలకు వ్యతిరేకంగా అందరిని ఒక తాటిపైకి తెచ్చింది. ఉగ్రవాదులను, వారిని భారత్‌పైకి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసును భారత భద్రత బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్పగించింది. ఘటన జరిగిన సమయంలో ఉగ్రవాదులను చూసిన పర్యటకులను పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్థున్నట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు.
పహల్‌గామ్‌లోకి ప్రవేశించే, బయటకు వెళ్లే మార్గాలను ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలు చేస్తున్నట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. ఘటనస్థలంలో తీసుకున్న ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.