సముద్రమంత విషాదాన్ని అక్షరాల్లో నింపి ‘శర సంధానం’ చేస్తూ, హిందూ మహాసముద్రంలో ‘అల్పపీడనం’ సష్టించి మూడో ప్రపంచదేశాలకి “నాలుగో ప్రపంచాన్ని” చూపించిన స్వాప్నికుడు. వింతలమారి ప్రపంచంతో అసలు ప్రపంచపు నిజాల్ని నగ్నంగా నడిబజార్లో నిలబెట్టిన తిరుగుబాటుకవి పైడి తెరేష్ బాబు. ఏ దేశ సంస్కతి లేక నాగరికతల అభివద్ధి అయినా తరాల ఆదేశ ప్రజల సామూహిక ప్రయత్నాలు – వాళ్ళ ఆలోచనాస్థాయిని బట్టే నిర్మితమవుతుంది. ఆ ప్రజల ఆలోచనల పర్యవసానంగా సాహిత్యం ఒక ప్రవాహంగా మొదలై ఆ జాతి జనుల అభివద్ధిని, ఉద్దేశ్యాలని ప్రతిబింబిస్తుంది. ఈ దేశ మూలవాసీలు అయిన అంటరాని ప్రజల గుండె గొతుకతో కవి పైడి తెరేష్ బాబు తన అల్పపీడనం(1996) కవితా సంపుటిలో ఒకచోట “అసలీ నేల మీద నీ ఆధిపత్యం ఏంటని ఎవళ్ళైనా ప్రశ్నిస్తే- ఈ దేశాన్ని మోస్తున్న మట్టిపొరల కింద పాతిపెట్టబడిన నా కోలానుకోట్ల సంతకాలను నిద్రలేపుతాను” అంటారు. ప్రముఖ రచయిత దర్శకుడు సాహిత్యకారుడు కవి పైడి తెరేష్‌బాబు నాగరికిత, సంస్కతిల మానవీయ ఆకాంక్షల్ని నిలువెల్లా పులుముకున్న వ్యక్తి.
ఒంగోలు గద్దలగుంటపాలెం మట్టి వాసనల్ని హైదరాబాదు నడిగడ్డన తెలంగాణా ఉద్యమబాటలో ఆడియో, వీడియోల శబ్ద, దశ్య కావ్యాలతో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం సాక్షిగా ప్రపంచ వ్యాప్తంగా వెదజల్లిన వ్యక్తి. కొత్తగూడెం రేడియో కేంద్రం నుండి దాసరి కిన్నెర అనే రేడియో రూపకంతో దేశమంతటా నగారా వేసి వినిపించిన దార్శనికుడు. తెరేష్ బాబు రచనలు, రచనావ్యాసంగంలోని తపన అంతా హక్కులకు దూరమైన తన అణగారిన సమాజపు ఆక్రోశం, సమాజ జనజీవన స్రవంతికి దూరమైన బడుగుబలహీనవర్గాల వేదనతో నిండి ఉంటుంది. ఆయన కవితా శీర్షికలే చాలా భిన్నంగా వక్రోక్తితో విరోధాభాసతో నిండి ఉంటాయి. అవి దుర్భరసుఖం, నూరవగొర్రె, చెవిటి పెద్దమనుషులకు శంఖం, కుక్క కరిచిన వార్త, చెంపలులేని మహాత్ముడు, ఛాగుడిస్తే ఛీ, అణచే చేతిని నరికే ఆయుధం, ములుకుతాళ్ళ చర్నాకోల, బేట్రాయి సామిదేవుడు, ఒంటిచేతి చప్పట్లు, బండిచక్రం మీద ఈగ, మట్టిబలపం, నరం మీద పుండు అనబడు ఒకే దేబిరింపు, ఇచట ఉచితముగా డొక్క చీల్చబడును, నిశాని, వాడు తిట్టొద్దంటున్నాడు. మిగతావేళ్ళకు చిటికెన వేలు వ్రాయునది.. ఇలాంటి విభిన్నమైన శైలితో ఉంటాయి.
అల్పపీడనం కవితలో ఆయన ఒకచోట .. “కల్లుముంతలకీ, కావిడిబద్దలకీ, గానుగెద్దులకీ, చెమట కాలువలకీ, చింపిరి చర్మాలకీ, కత్తులకీ, అరెలకీ, పుసికల్లకీ, ఆనెలకీ అరెరెరెరే…/ “బాంచన్దొరా నీ కాల్మొక్తాలకి ఎంత ఒల్లు బలిసింది!/ ఎంత గడి మీరకపోతే వీళ్ళ చర్మాలు జెండాలౌతాయి/ అంటూ బడుగు బలహీనవర్గాల ప్రజల పట్ల అగ్రవర్ణ, వర్గ సమాజం చేస్తున్న దగాని, వారి పెత్తందారీ తనపు అహంకారాన్ని నాటకీయంగా తన కవిత్వం ద్వారా ప్రదర్శిస్తారు. మిగిలిన కవులకీ ప్రధానంగా దళిత కవిత్వం వ్రాసిన కవులకీ తెరేష్‌బాబుకీ ఉన్న తేడా అంతా ఆయన అమతవాణి అనే క్రిస్టియన్ సంస్థలో ప్రారంభించిన దశ్యరూపక ప్రక్రియలు తన కవిత్వంలో కూడా ప్రవేశపెట్టాడు. ఆయన కవిత్వంలో కవితల్లో పాత్రలే మాట్లాడతాయి. తెరేష్‌బాబు ఆలోచనలు అసహాయులైన సమాజానికి అక్షరాల ఆయుధాలు ఇచ్చే వేడిని నిలువెల్లా నింపుకొని ఉంటాయి. హిందూ అగ్రవర్ణ, అగ్రవర్గ సమాజం అంటరాని బడుగు బలహీనవర్గాల పట్ల ప్రదర్శిస్తున్న అసమానమైన, దుర్మార్గవైఖరికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ మహాసముద్రానికి మతనామం లేదు కానీ హిందూ పేరుతో ఒక మహాసముద్రానికి కూడా హిందూ మహాసముద్రం అనేపేరు పెట్టింది అంటూ ఒక ఆడియో కాసెట్ని హిందూ మహాసముద్రం పేరుతో తెరేష్ బాబు 1996లో తీసుకొచ్చారు.
ఆడియో కాసెట్ని పుస్తకరూపంలో 2010 నవంబర్‌లో తీసుకురావడం జరిగింది. అందులో ఆయన.. “చూడమ్మా శివరంజనీ/శ్రుతిపక్వంగా శ్రవణ సుభగంగా/ శ్రుతుల్ని ధ్వంసం చేయడమే నా పని”/ అంటూ సాంప్రదాయక సరిగమపదనిసల సంగీతాన్ని ధ్వంసం చేసేందుకు పక్కా ప్రణాళికని రచించారు. మరోచోట ఆయన.. అంటారు.
ఇప్పుడు నేను ‘హిందూ మహాసముద్రం” అనే విషాదగీతాన్ని ఆనందంగా మొదలు పెడుతున్నాను”హిందూమతం వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరిస్తుంది. మహాకవి జాషువా “చీమలకు పంచదార పాములకి పాలు పోసే ఈ సమాజం మనిషిని మాత్రం కనీసం ఒక ప్రాణిగా చూడటం లేదన్నట్లుగానే తెరేష్ బాబు తన కవితలో ఒకచోట/“మట్టి గట్లయిన చోట నీళ్ళుంటాయి/ మనిషి గట్లయినచోట నెత్తురుంటుంది” అంటారు. సముద్రాన్ని ఒక మతంగా, ఉద్యమంగా భావిస్తూ,“సముద్రం ప్రవహించదు కానీ ప్రవహించగలననే బుకాయిస్తుంది” అంటారు. ఆయన తన ఆలోచనల్ని హిందూమతం వరకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రకాల ఉద్యమాల్లో పోరాటాల్లో జరిగే అన్యాయాల్ని ప్రశ్నిస్తూ “సముద్రం నవ్వటం ప్రారంభిస్తుంది. ఆ నవ్వులో అభ్యుదయం/ ఆ నవ్వులో సోషలిజం/ ఆ నవ్వులో విప్లవం విప్లవం విప్లవం” అంటారు. (హిందూమహాసముద్రం) ఎంత బరితెగించకపోతే వీళ్ళ చేతులు గొంతుకలౌతాయి” నేడు దేశంలో ఇంతవరకు జరిగిన వర్గపోరాట నినాదాల కమ్యూనిస్టు ఉద్యమం తనని తా ను ఆత్మ విమర్శలోకి నెట్టుకొని జరిగిన
చరిత్ర కులం పాత్రని గుర్తించడంలో జరిగిన పొరపాటుని నెమరేసుకొని తిరిగి హిందూత్వంపై జరపాల్సిన పోరాటాన్ని దళిత శక్తులతో నిర్మిస్తున్న దశలో తెరేష్‌బాబు కవిత్వం చాలా అవసర మైనదిగా మనం భావించాలి. తెరేష్ బాబు కాలక్షేపపు మానసికోల్లాసపు కవిత్వం వ్రాయలేదు. ఆయన రచనలకు ఒక లక్ష్యం ఉంది. పైడి తెరేష్‌బాబు హక్కులకు దూరమైన అంటరాని సమాజంలో జన్మించాడు. ఆయన రచనలన్నీ జీవితపు కఠోర వాస్తవాలతో నిండి ఉంటాయి. “ఆయన సముద్రం ఉన్నది. /వాయుగుండాల్ని పుట్టించి! భూమ్మీదకి విసరడానికే సముద్రం ఉన్నది/ జీవిత సౌందర్యాన్ని ధ్వంసం చేసి సముద్ర శాఖల్ని తెరవడానికే/ ఎక్కడైనా ఒక అల్పపీడనం పుట్టిందంటే దాని వెనకో సముద్ర హస్తం ఉందని మనం అర్థం చేసుకోవాలి” అంటారు. (హిందూమహాసముద్రం) తుఫాన్ నేపథ్యంలో ఈ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న మతం, కులం అంటరానితనాన్ని మనం కొత్తగా అర్ధంచేసుకోవాల్సి ఉంటుంది. అంటరాని బడుగు బలహీన వర్గాల గురించి వ్రాయకుండా ప్రేమ, గాలి, చెట్టూ, పుట్టా అంటూ రాస్తున్న సంప్రదాయ కవుల గురించి వ్రాస్తూ ఆయన. ఇలా అంటాడు./ “అయ్యా సముద్ర దేవరా/ నిన్నటిదాకా కవిత్వాన్ని బతికించడం కోసం చచ్చావ్. /ఇవాళ నువ్వు బతకడం కోసం కవిత్వాన్ని చంపుతున్నావ్ /
అనుకరించు అనుసజించు /అంతా సొంతమేనని బుకాయించు అంత గొప్ప కవివి/ దళితుల జోలి నీకెందుకులే పాపం/ శరీరం మ్మీదపడు శిరోజం! ఉరోజం! నాభీ! నడుమూ/ రతీ! అధరం అద్భుత కవితా వస్తువులు కదూ../ (హిందూమహాసముద్రం) “సాహిత్యం సష్టిస్తూ అనవసర కవితావస్తువుతో అవార్డులకోసం అనేకపాట్లు పడుతూ అసలు సిసలు మట్టి మనుషుల కోసం మాట్లాడని ఒట్టి మనుషుల గురించి లోపలి, బైటి మిత్రుల శత్రుల గురించి అనేక పోరాటాలు చేసారు తెరేష్‌బాబు. తెరేష్ బాబు హిందూమతంతో పాటు అన్ని మతాల్ని వాటి మూఢనమ్మకాల్ని ప్రశ్నిస్తూ/ ఎందుకయ్యా ఏసు ప్రభువా/ ఇరవై శతాబ్దాలు గడిచినా ఇంకా లోకపాపం మోస్తానవంటావ్ / ఎవడి కరెన్సీ భారం వాడు మొయ్య గలిగినప్పుడు/ ఎవడి సిలువభారం వాడు మొయ్యడానికేం” అంటాడు. తెరేష్ బాబు అంతరంగంలో అంబేడ్కరిజపు చైతన్యం నిలువెల్లా తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే ఆయన ఒకచోట..“సముద్రానుకూల సాహిత్యాన్ని పేజీలకొద్దీ విసరవచ్చు/ అరుణ్ శౌరీల్ని పోషించనూ వచ్చు/ అంబేడ్కర్ వ్యతిరేకతను పెంచనూ వచ్చు” (హిందూమహాసముద్రం)
పుట్టుకతోనే తెరేష్ బాబు ఒంగోలులోని దళితవాడలో చైతన్యపు ఉగ్గుపాలు తాగాడు. కనుకనే ఆయన 1985లోనే తన ప్రశ్నల ఆయుధాలతో దాశరథిగారి ముందుమాటతో ‘శర సంధా నం’ అనే కవితా సంపుటిని వెలువరించారు. ఏ సమాజంలో అయి నా ఒక రచయిత పుట్టాలంటే అతనికి సంవేదనశీలత గ్రహణశక్తి సజనాత్మకత ఖచ్చితంగా ఉండాలి. దళిత సమాజపు వేదనలని తెరేష్‌బాబు స్వయంగా 10ఏళ్ళ వయసు నుండే అనుభవించాడు. అందుకని ఆయనకి బాధితుల పట్ల అనంతమైన ప్రేమ ఉండేది. అందుకే ఆయన ఒకచోట సజ్జలగూడెం మహదేవమ్మ అనే దేవదాసిపై అత్యాచారానికి ప్రతిస్పందిస్తూ కుక్క కరిచిన కవితలో “నేనిప్పుడు వేదంలా ఘోషిస్తున్న రోజుల్లో సీసంలా ప్రవహించిన గోదారవరి వర్ణని కీర్తించను/ జీవ నదుల్ని తలదన్నే ఒక మహాదుఃఖ కథ గురించి మాట్లాడదలచుకున్నాను/ అవును సజ్జలగూడెం మహదేవమ్మ గురించి/ మాట్లాడుతున్నాను. నది నీళ్ళయిన చోట నాగరికులు ఉన్నట్టు చరిత్ర లెక్కలు కట్టిందే మరి నదినెత్తుటి కన్నీళ్ళయినచోట ఏ గాడిద కొడుకులున్నట్లు లెక్క అంటారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో గ్రామాలు, పొలాలు బీడుబారి పట్టణాలవైపు పరిగెడుతున్న దశలో తెరేష్ బాబు “నేను నా వింతలమారి ప్రపంచాన్ని” జులై 2009లో ప్రచురించాడు. అందులో ఆయన ఒకచోట../
“భయం బాంధవ్యానికి పునా ది అయినంతకాలం/ యుద్ధం స్పహ వైరస్లా వ్యాపిస్తూనే ఉంటుంది. యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం/ సైనిక దాడికన్నా సాంస్కతిక దాడి ప్రమాదకరం” అంటాడు. శతాబ్దాలుగా అణచివేయబడిన అంటరాని పల్లెల నెత్తుటి కేకలకి ఘనత వహించిన మన దేశచరిత్ర తనలో చోటు కల్పించలేదు. నాగరికత, సంస్కతిల నిర్మాణంలో పాటుపడ్డారన్న అంటరాని, బడుగుబలహీన వర్గాల ప్రజల చరిత్ర నమోదు కాలేదు. భారతదేశ సమైక్యత ముసుగులో దేశం తనలో కలిపేసుకున్న అనేక దళిత, ఆదివాసీల సంస్కతుల్ని ఉన్నత, పండితవర్గాల చరిత్రగా చెప్పుకోబడడంకన్నా అమానవీయం ఏముందని కవి పైడి తరేష్ బాబు అంటారు. ఆయన ఒకచోట వాడు తిట్టొద్దంటున్నాడు, తిట్టు కవిత్వం కాదంటున్నాడు, రండ్రండి దళిత కవుల మందరం బహన్నల వేషాలు కట్టుకుందాం. (అల్పపీడనం) అలాంటి గొప్ప వ్యక్తిని ఇంత త్వరగా కోల్పోవడం చాలా బాధాకరం.
(సెప్టెంబర్ 29, 2014న పైడి తెరేష్ బాబు కన్నుమూశారు)
డా. జి.వి.రత్నాకర్