Sunday, December 22, 2024

రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడం బాధించింది:జగదీప్ ధన్‌కర్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలు తనను బాధించాయని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌అన్నారు. అలా చేస్తున్న వారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. మంగళవారంహర్యానాలోని రోహ్టక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ పది పదిహేనేళ్ల క్రితం చెదలు పట్టిన అధికార కారిడార్లను ఇప్పుడు శుభ్రం చేయడం జరుగుతోందన్నారు. అంబేద్కర స్ఫూర్తి పొందాలని ఆయన విద్యార్థులకు పిలుపునిస్తూ, ఇది చాలా ముఖ్యమని, ఎందుకంటే మనలో అతి కొద్ది మంది దాన్ని పాటించడం లేదని అన్నారు.‘ ఇది మన హృదయాలను బాధిస్తోంది. భారతీయతను నమ్మే ఎవరైనా సరే దేశమంతా తిరుగుతూనో లేదా బయటికి వెళ్లో మన దేశం గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడగలుగుతారు? మన రాజ్యాంగ వ్యవస్థలను ఎలా దెబ్బతీస్తారు?’ అని ధన్‌కర్ ప్రశ్నించారు.

మొదటగా , చివరగా భారతీయులుగానే ఉండాలని, భారతీయులుగా కాక మరే విధంగాను ఉండరాదని అంబేద్కర్ మాటలను పాటించాలని ఆయన అన్నారు. దేశంలో లంచగొండితనం గురించి మాట్లాడుతూ, పది పదిహేనేళ్ల క్రితం పరిపాలనా కారిడార్లకు పవర్ బ్రోకర్ల కారణంగా చీడపట్టిందని, దాన్ని ఇప్పుడు శుద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. పరిపాలనలో ఇప్పుడు నిజాయితీ, జవాబుదారీతనం, పారదర్శకత చెరిగిపోని భాగాలుగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. భారత దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా పురోగతి చెందుతోందని, దీన్ని ఎవరు కూడా ఆపలేరని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ వాతావరణాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హన్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హర్యానా మంత్రి మూల్‌చంద్ శర్మ, మహర్షి దయానంద్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజ్‌బిర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News