Tuesday, February 25, 2025

‘బంగ్లా’లో పాక్, చైనా పాగా

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పతనం నేపథ్యంలో రాజకీయ సంక్షోభంతో ధైర్యం తెచ్చుకున్న ఇస్లామిస్ట్ తీవ్రవాదులు భారత్‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక ప్రచారం సాగించారు. వారు హిందు సమాజంపై దాడులకు కూడా తెగబడ్డారు. హిందు జాతీయవాద ప్రభుత్వం పట్ల భారతీయ ప్రధాన స్రవంతి మీడియా విధేయత కారణంగా హిందు సమాజంపై దాడుల వార్తలు అనేక సందర్భాల్లో భారతీయ మీడియాలో అతిశయోక్తులతో కూడుకున్నా, భారత్‌లో మాదిరి ఆ దేశంలో అవి సంభవించాయన్నది వాస్తవం. భారత్‌లో ముస్లింలపై దాడులను వార్తలకు తగినవిగా ఈ మీడియా వర్గం ఒప్పుకోదు.

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ కల్లోలిత దేశంలో మైనారిటీ వర్గాలపై దాడులను ఖండించారు. ఆయన వాటిని ‘హీనమైనవి’గా అభివర్ణించారు. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు అందరినీ కాపాడవలసిందిగా యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత విజ్ఞప్తి కొత్త ప్రభుత్వం కింద మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయనేందుకు నిదర్శనం. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి ఐఎస్‌ఐ, జమాత్‌ఎ ఇస్లామి సారథ్యం వహించే అవకాశం ఉండడంతో భారత్‌కు ఒక దుశ్శకునం ఎదురవుతోంది: పశ్చిమ రంగంలో కేవలం విరోధి పొరుగు దేశం పాకిస్తాన్, ఉత్తరాన చైనాతో వ్యవహరించడమే కాకుండా, తూర్పు రంగంలో ఆవిర్భవిస్తున్న మరొక వ్యతిరేక భావన దేశం బంగ్లాదేశ్‌తో కూడా పరిస్థితులను చక్కదిద్దుకోవలసిన స్థితి వస్తోంది.

భద్రత ప్రభావాలు తీవ్రమైనవే. ఈశాన్య సరిహద్దులో పాకిస్తాన్‌తో అనుబంధం ఉన్న బంగ్లాదేశ్ అస్థిరతకు కొత్త మార్గం తెరవగలదు, భారత ఈశాన్య ప్రాంతంలోని సున్నితమైన రాష్ట్రాల్లోకి సీమాంతర ఉగ్రవాదానికి, అక్రమ ఆయుధాల రవాణాకు, తీవ్రవాద శక్తుల చొరబాటుకు అవకాశం కలుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలతో భారత ప్రధాన భూభాగాన్ని కలిపే ‘చికెన్స్ నెక్’ గా తరచు ప్రస్తావిస్తుండే, వ్యూహాత్మక సిలిగురి నడవా (కారిడార్) నానాటికీ దుర్బలం కాగలదు. ఈ పరిస్థితి మన సైనిక, నిఘా వనరులను విభజించవలసిన స్థితిని తీసుకువస్తుంది, పశ్చిమ, ఉత్తరరంగాల్లో భద్రత యంత్రాంగం ఇప్పటికే సవాళ్ల భారాన్ని ఎదుర్కొంటున్న సమయంలో వాటిని బలహీనపరుస్తుంది.

భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది, తన సరిహద్దులను దుర్భేద్యం చేస్తూ, దౌత్యమార్గాలను పునశ్శక్తిమంతం చేయవలసి ఉంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో ధైర్యం తెచ్చుకున్న ఇస్లామిస్ట్ వర్గాల దన్ను ఉన్న ప్రభుత్వంతో దీర్ఘ కాలిక వ్యూహాత్మక పోటీకి సన్నద్ధం కావలసి ఉంటుంది. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఎన్నడూ లేవు, అలసత్వం హానికరం. విభిన్న మీడియాలో ప్రచురితమైన వార్త ప్రకారం, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) సంస్థ నుంచి ఒక ప్రతినిధి వర్గం ఇటీవల బంగ్లాదేశ్‌ను సందర్శించింది. అది ఢాకా ఇస్లామాబాద్ మధ్య సైనిక దళాల మధ్య సంబంధాల స్థాయిని అకస్మాత్తుగా పెంచడం అవుతుంది.

రెండు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల మార్పునకు సూచిక నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన బృందంలో గతంలో బీజింగ్‌లో పాకిస్తాన్ రక్షణ విభాగ దౌత్యాధికారిగా సేవలు అందించిన మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్ ఒక సభ్యుడు. బంగ్లాదేశ్ సాయుధ దళాల డివిజన్ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌ఎం కమ్రుల్ హసన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బంగ్లాదేశీ ప్రతినిధివర్గం జనవరి 13, 18 తేదీల మధ్య పాకిస్తాన్‌కు వెళ్లి, రావల్పిండిలో అగ్రశ్రేణి సైనిక నాయకత్వంతో భేటీ అయి వారం కూడా కాకుండానే ఐఎస్‌ఐ బృందం పర్యటన చోటు చేసుకుంది.బంగ్లాదేశ్ పరిశీలకుల సమాచారం ప్రకారం, ఐఎస్‌ఐ సీనియర్ అధికారి ఒకరు ఢాకాను 2009లో సందర్శించినట్లు చివరిసారిగా బహిరంగంగా గుర్తించారు.

అప్పుడు పారా మిలిటరీ బలగమైన బంగ్లాదేశ్ రైఫిల్స్‌లో తిరుగుబాటు అణచివేతలో స్థానిక అధికారులకు సాయం చేసేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఒక అధికారిని పంపింది. 1900, 2000 దశకాల్లో భారత ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద వర్గాలకు దన్నుగా బంగ్లాదేశీ భూభాగాన్ని ఉపయోగించుకోవడంలో ఐఎస్‌ఐ పాత్ర గురించిన జ్ఞాపకాలు న్యూఢిల్లీలోని అధికార వర్గాలకు ఉన్నాయి. పూర్వపు షేక్ హసీనా ప్రభుత్వం కింద ఐఎస్‌ఐ, బంగ్లాదేశీ సంస్థలు, ముఖ్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటలిజెన్స్ (డిజిఎఫ్‌ఐ) మధ్య సంబంధాలు నిలచిపోయాయి. 1971 విమోచన పోరాటంలో పాకిస్తాన్‌తో కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలపై పలువురిని హసీనా ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసింది కూడా.

అది ఇస్లామాబాద్‌కు ఆగ్రహం కలిగించింది. బంగ్లాదేశ్‌లో చికెన్స్ నెక్ సమీపంలోని, భారత సరిహద్దు సమీపాన అత్యంత సున్నిత ప్రాంతాలను పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ అధికారులు సందర్శించారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ‘ఒక నిర్దిష్ట దేశం (పాకిస్తాన్)కు సంబంధించి ఉగ్రవాద ప్రధాన కేంద్రం అనే పదం వాడాను. ఇప్పుడు ఆ దేశ ప్రజలు, వారు ఏదైనా ఇతర ప్రదేశానికి వెళ్లినట్లయితే, ఆ దేశం మన పొరుగున ఉన్నదయితే, నాకు సంబంధించినంత వరకు, దాని గురించి నేను ఆందోళన చెందవలసి ఉంటుంది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు తమ భూభాగాన్ని వారు ఉపయోగించుకోలేరు. దానికి సంబంధించినంత వరకు అదే జరగాలి’ అని ఆయన పేర్కొన్నారు.

అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో సంబంధాలను నిర్వచించవచ్చునని జనరల్ ద్వివేది అన్నారు. బంగ్లాదేశ్ మరింత విస్పష్ట విదేశాంగ విధానాన్ని అనుసరించవచ్చు, భారత్‌తో ఆర్థికపరమైన ఆధారాన్ని సమతౌల్యం చేసుకుంటూనే, భద్రత, ప్రాంతీయ సుస్థిరతపై సహకారాన్ని కొనసాగిస్తూనే పాకిస్తాన్‌తో సంబంధాలను అది పటిష్ఠం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్ బంగ్లాదేశ్‌ను సందర్శించారనే వార్తల నేపథ్యంలో సమీపంలోని బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం పెరుగుతున్న సూచనలను భారత్ నిశితంగా పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఇటీవల వెల్లడించారు.

పాకిస్తాన్ 2025 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడాన్ని ప్రారంభిస్తుందని డిసెంబర్ ద్వితీయార్ధంలో భారతీయ మీడియాలో వచ్చిన వార్తల దృష్టా ఆయన ఆ ప్రకటన చేశారు. 1971 విమోచన పోరాటం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి దారి తీసిన తరువాత రెండు దేశాల మధ్య సైనిక శిక్షణ ఒప్పందాన్ని అది సూచిస్తోంది. బంగ్లాదేశ్ ఆ వార్తలను తోసిపుచ్చగా, ఆ పరిణామాలు ఢాకాలో కొత్త మధ్యంతర ప్రభుత్వానికి, న్యూఢిల్లీకి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తున్నాయి. ఢాకాలో ఆ ప్రభుత్వం విదేశాంగ విధానానికి సంబంధించి మరింత సమతౌల్య దృక్పథాన్ని కోరుకుంటోంది.

భారత్‌తో తన సంబంధాలకు ప్రతీకగా చైనాతో సన్నిహిత సంబంధాన్ని కూడా బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం నెలకొల్పుకుంటున్నది. వంద పైచిలుకు దేశాల్లో మెగా ప్రాజెక్టులను అమలు జరిపిన చైనీస్ నిర్మాణ, ఇంజనీరింగ్ భారీ సంస్థ అధికారులు ఇప్పటికే లాల్‌మోనిర్హాట్, రంగ్‌పూర్, కురిగ్రామ్, బొగుర, జోయ్‌పుర్‌హాట్, గైబంధా వంటి జిల్లాల్లో క్షేత్ర పర్యటనలను ప్రారంభించినట్లు బంగ్లాదేశ్‌లో వర్గాలు వెల్లడించాయి. తీస్తా నదీ జలాలు బంగాళా ఖాతంలో కలిసే ముందు బంగ్లాదేశ్‌లో ఆ జిల్లాల మీదుగా ప్రవహిస్తాయి. ‘ఆ ప్రాజెక్టు కింద రెండు బాధ్యతలు పూర్తి చేసేందుకు చైనాకు రెండు సంవత్సరాల వ్యవధి ఇవ్వడానికి మేము అంగీకరించాం’ అని యూనస్‌కు పర్యావరణ సలహాదారు సయ్యదా రిజ్వానా హసన్ చెప్పినట్లు ‘ది డైలీ స్టార్’ తెలియజేసింది.

కరకట్టల సృష్టి, మరమ్మతు, డ్రెడ్జింగ్, భూమిని తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడం, వరదల అవకాశాలను తగ్గించడం వంటి పనుల కోసం సమగ్ర నదీ నిర్వహణ ప్రణాళికకు సంబంధించి చైనాతో బంగ్లాదేశ్ చర్చలు జరుపుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి అభ్యంతరాల కారణంగా భారత్‌తో నదీ జలాల పంపకం ఒప్పందానికి యత్నాలు 2016లో నిలచిపోయినందున బంగ్లాదేశ్ ఆ చర్చలు సాగిస్తోంది. పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం పవర్ చైనాతో నిబద్ధతలేని ఒప్పందంపై కూడా సంతకాలు జరిగాయి.

అయితే, ఆ ఒప్పందంపై ముందుకు ఏ పనులూ సాగలేదు. భారత ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే 20 22 కి.మీ భూమి సిలిగురి కారిడార్‌గా కూడా పేరొందిన వ్యూహాత్మకంగా ముఖ్యమైన చికెన్స్ నెక్ సమీపంలో ప్రాజెక్టులో చైనీస్ ప్రమేయంపై న్యూఢిల్లీ ఆందోళనల గురించి ఢాకాకు అవగాహన ఉండడం అందుకు కారణం. నిరుడు న్యూఢిల్లీలో హసీనా పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీస్తా నదీ జలాల పరిరక్షణ, నిర్వహణ కోసం ఒక సాంకేతిక బృందాన్ని పంపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించడం బంగ్లాదేశ్ దౌత్యపరమైన సందిగ్ధతను పెంచింది. క్షీణిస్తున్న విదేశీమారక ద్రవ్య నిల్వల సమస్యతో యూనస్ ప్రభుత్వం సతమతమవుతూ, ప్రపంచ బ్యాంకును, ఐఎంఎఫ్‌ను ఆశ్రయించవలసి వచ్చిన సమయంలో ఆ ప్రాజెక్టుకు సాధ్యమైనంతగా సాయం చేస్తామని బంగ్లాదేశ్‌కు చైనా తిరిగి హామీ ఇచ్చింది.

తీస్తా నది తీరం పొడుగునా నివసిస్తున్న వేలాది మంది ప్రజల ప్రయోజనం, సంక్షేమం కోసం తీస్తా నదీ జలాల నిర్వహణ ప్రాజెక్టును ‘సాధ్యమైనంత త్వరలో’ అమలు చేయాలని నొక్కిచెబుతూనే బీజింగ్ ఆ ప్రాజెక్టుపై యూనస్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబారి యావో వెన్ ఇటీవల తెలియజేశారు. తీస్తా నదీ జలాల విషయంలో ఏవైనా పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా యూనస్ ప్రభుత్వంపై దేశీయంగా రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో చైనా దౌత్యవేత్త ఆ ప్రతిపాదన తీసుకువచ్చారు.

నిరుడు ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తరువాత దేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) తీస్తా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని కోరుతూ లాల్‌మోనిర్హాట్, నీల్ఫమరి, రంగ్‌పూర్, కురిగ్రామ్, గైబంధా జిల్లాల్లో తీస్తా నదీ తీరాల్లో 48 గంటల పాటు నిరవధిక కార్యక్రమాలు నిర్వహించింది. బంగ్లాదేశ్‌పై చైనా, పాకిస్తాన్ నుంచి వస్తున్న ఒత్తిడుల దృష్టా భారత్ తన ఈశాన్య భూభాగం భద్రత, సమగ్రతకు సమగ్రవ్యూహంతో ముందుకు సాగవలసి ఉంటుంది. దేశం లోపల రాజకీయ మద్దతు కూడగట్టుకోవడానికి హిందు జాతీయవాద సెంటిమెంట్‌ను ప్రోది చేయడానికి బంగ్లాదేశ్‌లోని పరిస్థితిని ఉపయోగించుకోరాదు. అది భారత్‌కు బెడిసికొడుతుంది.ఎందుకంటే తూర్పు రంగంలో ప్రతికూల పొరుగు దేశాన్ని భారత్ సృష్టించుకోజాలదు.                                                 – గీతార్థ పాఠక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News