Sunday, January 19, 2025

చైనా-పాక్ సరుకు నౌక పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముంబై : చైనా నుంచి పాకిస్థాన్‌కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల ఇక్కడి నహ్వ షేవా పోర్టులో నిలిపివేసి, తమ అదుపులోకి తీసుకున్నారు. చైనా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి వెళ్లుతున్న ఈ నౌకలోని సరుకులపై అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టగా ఇందులో రెండురకాల వాడకానికి పనికి వచ్చే సరుకుంది. దీనితో పాకిస్థాన్ తన దేశ అణు, బాలిస్టిక్ మిస్సైల్స్ కార్యక్రమాలను నిర్వహించుకునే వీలుందని వెల్లడైంది. తమకు అందిన కీలక రహస్య సమాచారం మేరకు , ఇంటలిజెన్స్ వర్గాల సూచనలతో కస్టమ్స్ అధికారులు ముంబై వద్ద మాల్టా దేశపు జెండాతో ఉన్న వాణిజ్య నౌక సిఎంఎ సిజిఎం అట్టిలాను నిలిపి పరిశీలన జరిపారు. కరాచీ బాటపట్టిన ఈ నౌకలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోలు (సిఎన్‌సి) మిషిన్ ఉంది. దీనిని ఇటలీకి చెందిన ఓ సంస్థ తయారుచేసింది. ఈ కీలకమైన మెషిన్‌ను ఓ కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. కాగా ఇక్కడ దొరికిన సరుకును రక్షణ శాఖకు చెందిన పరిశోధనా సంస్థ డిఆర్‌డిఒ నిశితంగా పరీక్షించింది. ఈ క్రమంలో ఈ సరుకును పొరుగుదేశం పాకిస్థాన్‌లో అణు కార్యక్రమాల నిర్వహణకు వాడుకునే వీలుందని, ఇందుకే తీసుకువెళ్లుతున్నారని నిర్థారించారు.

కాగా చైనా నుంచి ఈ సరుకు బయలుదేరడం వల్ల చైనా పాక్‌ల నడుమ భారీ స్థాయిలోనే అణు కార్యక్రమాల వ్యవహారం లోపాయికారిగా సాగుతున్న వైనం మరోసారి స్పష్టం అయింది. పాకిస్థాన్ తన క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు , వీటికి అణుపాటవ శక్తిని సంతరింపచేసేందుకు ఈ సరుకును కీలక దశలలో వాడుకునేందుకు వీలుందని నిర్థారించారు. అణు ఆయుధాలు , క్షిపణుల తయారీ దశలలో ఈ సరుకును కీలక విభాగాలలో తీరిగ్గా వాడుకునేందుకు తరలిస్తున్నారని నిపుణులు నిర్థారించారు. సిఎన్‌సి మిషిన్ అత్యంత కీలకంగా అణు కార్యక్రమాలలో వాడకానికి పనికి వస్తుంది. ఉత్తరకొరియా దీనిని యధేచ్చగా వాడుకొంటోంది. అయితే సిఎన్‌సి మిషన్ డేంజర్ మిషిన్ అయినందున, ఇది ప్రపంచ స్థాయి భద్రతా సమతూకతను దెబ్బతీస్తున్నందున 1996 నుంచి దీనిని సంప్రదింపుల క్రమంలో వాసెనార్ అగ్రిమెంట్‌లో చేర్చారు. అంతర్జాతీయ ఆయుధాల నియంత్రణ వ్యవస్థ క్రమంలో ఈ ఒప్పందం కుదిరింది.

కొన్ని దేశాలు రహస్యంగా అణ్వాయుధ కార్యక్రమాలను చేపడుతున్నందున, ఇందుకు ఈ మిషన్ కీలకం అయినందున దీనిని పౌరులు లేదా సైనిక వాడకానికి నిషేధించారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన 42 దేశాలలో ఇండియా కూడా ఒక్క దేశంగా ఉంది. పౌర సైనిక అవసరాల ద్వంద్వ ప్రయోజనాల సరుకులు , ముడిపదార్థాలు లేదా మిషన్ల చలామణి రవాణా సంబంధిత విషయాలలో ప్రపంచ దేశాల నడుమ సమాచార వినిమయానికి కట్టుబాట్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇక్కడ అదుపులోకి తీసుకున్న ఈ భారీ స్థాయి నౌక ఈ ఒప్పందం పరిధిలోకి వస్తుంది. ఆంక్షలకు గురై అవకాశం ఉంది. పాకిస్థాన్, చైనాలు సాగిస్తున్న అణు ఇతరత్రా ఆయుధ విస్తరణ కార్యక్రమాల నివారణల పరిధిలో ఈ నౌక స్వాధీనం ఇప్పుడు అత్యంత కీలకం అయింది.

పత్రాల పరిశీలనలో చైనా కంపెనీ పేరు
ఇక్కడి నౌకలోని సరుకుల బిల్లులు , లోడింగ్ అన్‌లోడింగ్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో ప్రత్యేకంగా షాంఘై జెఎక్స్‌ఇ గ్లోబల్ లాజిస్టిక్స్ కో లిమిటెడ్ పేరు ఉంది. అక్కడి నుంచి లోడింగ్ అయిన సరుకు ఇందులోని ఈ సిఎన్‌సి మిషిన్ కరాచీలోని సియాల్‌కోట్ పాకిస్థాన్ వింగ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చేరాల్సి ఉంది. కాగా షిప్పింగ్ బాధ్యతలు తీసుకుంది తయియూన్ మైనింగ్ ఇంపోర్టు అండ్ ఎక్స్‌పోర్టు సంస్థ. ఇక సరుకు చేరాల్సిన సంస్థ పాకిస్థాన్‌లోని కాస్మోస్ ఇంజనీరింగ్ సంస్థ . ఇక ఈ నౌకలోని సరుకు బరువు 22,180 కిలోల వరకూ ఉందని నిర్థారించారు. చైనా నుంచి పాకిస్థాన్‌కు ఈ విధమైన ద్వంద్వ వాడకపు పదార్థాలతో కూడిన నౌకలను భారతీయ రేవు కేంద్రాల వద్ద అధికారులు స్వాధీనం చేయడం , పూర్తి స్థాయిలో తనిఖీలకు దిగడం ఇదే తొలిసారి కాదు.

పాక్ కాస్మోస్‌కు చాలా కథ ఉంది
పాకిస్థాన్‌కు చెందిన కాస్మోస్ ఇంజనీరింగ్ సంస్థ పేరుకు ఇంజనీరింగ్ సంస్థనే కానీ. దీని వెనుకాతల చాలా కథ ఉంది. పాకిస్థాన్‌కు ఇది కీలక రక్షణ సరఫరాదారుగా ఉంది. దీని వ్యవహారాలపై 2022 మార్చి 12 నుంచి నిశితంగా మన భద్రతా సంస్థలు ఆరాతీస్తున్నాయి. 2022 మార్చి 12న ఇటలీ తయారీ థర్మోఎలక్ట్రికల్ పరికరాలతో రవాణా అయిన ఈ నౌక పాకిస్థాన్‌లోని నహావా షెవా పోర్టుకు వెళ్లుతూ ఉన్న దశలో అడ్డగింతకు గురైంది. పాకిస్థాన్ తమపై ఉన్న ఆంక్షలను పలు విధాలుగా తప్పించుకుంటూ కొన్ని ప్రమాదకరమైన సరుకులను ఎక్కువగా చైనా నుంచి రప్పించుకొంటోందని ఇంటలిజెన్స్ వర్గాలు నిర్థారించాయి. ఈ క్రమంలోనే చాలాకాలంగా సముద్ర మార్గంలో ప్రత్యేకించి పాకిస్థాన్ వైపు సాగే నౌకల అటకాయింపులు, సరుకుల తనిఖీలు చేపడుతూ వస్తున్నారు. పాకిస్థాన్ అణు కార్యక్రమాలు, క్షిపణి వ్యవస్థల వృద్ధికి చైనా భారీ స్థాయిలోనే సహకరిస్తున్నదనే విషయం 2020లో అప్పుడు జరిగిన నౌక పట్టివేత దశలో నిర్థారణ అయింది. అప్పుడు ఇండస్ట్రియల్ ఆటోక్లోవ్‌ను స్వాధీనపర్చుకున్నారు. దీనిని ప్రత్యేకించి మిస్సైల్స్ తయారీకి వాడుతారు. చైనా నౌక ద్వారా ఈ సరుకు పాకిస్థాన్‌కు రవాణా అవుతూ ఉండగా పట్టుకున్నారు. పలు రకాల పనిముట్లు, కేవలం ఇంజనీరింగ్ పనులకు వాడుకునే యంత్రాలు పదార్థాల పేరిట చైనా నుంచి సరుకులు భారీ స్థాయిలోనే పాకిస్థాన్‌కు చేరుకుంటున్నాయని పలు ఉదంతాల నడుమ స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News