దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం
ఆర్థిక దుస్థితిపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన
రెండు గోల్ఫ్‌కోర్టులు అమ్మితే రుణభారం తగ్గుతుంది
చట్టం రాజ్యాంగం గురించి ఎవరికీ పట్టదు
అంతర్గత సమస్యకు ఐఎంఎప్ ఏం చేస్తుంది?
ఇస్లామాబాద్: దివాళాతీసిన దేశంలో మనం ఇప్పుడు బతుకుతున్నామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తమ దేశ దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ దివాలా దిశలో ఉందని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయని, అయితే ఈ దివాళా పరిస్థితి దేశంలో చాలాకాలం క్రితమే ఏర్పడిందని చాలా కాలంగా దేశం ఆర్థికంగా దెబ్బతింది. దివాలా దర్వాజాలు ఎప్పుడో తెరుచుకున్నాయని, దీనికి అందరూ బాధ్యులే అని స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగం, చట్టం గురించి పట్టించుకునే వారే లేరని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
అధికార వ్యవస్థ, బ్యూరోక్రసీ, రాజకీయ నేతలు ఈ విధంగా అంతా ఈ పరిస్థితికి బాధ్యులే. దేశ దుస్థితినుంచి బయటపడటానికి దేశీయంగానే అంతర్గతంగా దారులు వెతుక్కోవల్సి ఉంటుంది. తప్పితే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇతరత్రా ఆర్థిక సంస్థలు వెనువెంటనే ఏమి చేయలేవని ఆసిఫ్ స్పష్టం చేశారు. మనం ఈ పరిస్థితిని కొనితెచ్చుకున్నామని, దీని నుంచి గట్టెక్కే బాధ్యత వెతుక్కోవల్సిన దారులు కూడా మనమే చూసుకోవల్సి ఉంటుందని తెలిపారు. అధికార పిఎంఎల్ ఎన్ ప్రముఖ నేతలలో ఒక్కరిగా ఉన్న అసిఫ్ సియాల్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. పలు విధాలుగా పాకిస్థాన్ ఎగవేతల జాబితాలో ఉంది.
అంతర్జాతీయ సంస్థలు నుంచి సాయం అందుతుందా? అనేది అనుమానమే అన్నారు. దీనికి బాధ్యులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. తమ గురించి తాము తప్పితే దేశం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండే పాలకులు, పాలనాయంత్రాంగంతోను దుస్థితి ఏర్పడిందన్నారు. పాకిస్థాన్ సమస్య పాకిస్థాన్‌దే. దీనిపై ఐఎంఎఫ్‌లు ఏమి చేయలేవని స్పష్టం చేశారు. దేశం ఎంత దిగజారుతున్న మనకు షోకులకు తక్కువ లేదని, పాలకులు అత్యంత విలాసవంతమైన రీతిలో విలువైన ప్రభుత్వ భూములలో గోల్ఫ్‌క్లబ్‌లు ఇతరత్రా వినోదాత్మక కేంద్రాలు కట్టించారు. కేవలం రెండు ఇటువంటి గోల్ఫ్‌క్లబ్‌లను విక్రయించినా ఎంతో సొమ్ము వస్తుంది. దేశ రుణభారంలో కనీసం నాలుగింట ఒక్కవంతు అయినా తగ్గుతుందని తెలిపారు. తాను 33 ఏళ్లుగా పార్లమెంటరీ రాజకీయాలలో ఉంటూ వచ్చానని, అయితే దేశ రాజకీయాలు ఎప్పుడూ దిగజారుడు తరహాలోనే ఉన్నాయని, దేశాన్ని దిగజార్చాయని విమర్శించారు.
కేవలం ఒక్క ఏడాదిగా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, అయితే ఇప్పటి ఆర్థిక దివాళాతనానికి కారణం ఇన్నేళ్ల అవకతవకల వ్యవహారాలే కారణం అన్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యయాన్ని పూర్తి స్థాయిలో తగ్గించివేయడం, దుబారాకు అడ్డుకట్టలు వంటి చర్యలు, పొదుపు నిర్ణయాలు వంటి పలు విధాలైన ఆర్థిక కార్యక్రమాలతో ఆపరేషన్ మొదలుపెడుతారని చెప్పారు. కోవిడ్, వరదలు, ధరల పెరుగుదల వంటి పలు పరిణామాలు నడుమ పాకిస్థాన్‌లో ఆర్థిక స్థితి దిగజారుతోంది. ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరింది. ఈ వారం ద్రవ్యోల్బణ స్థాయి 40 శాతానికి చేరింది. పాల ధరలు లీటర్‌కు రూ.200 దాటాయి. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆహారధాన్యాలకు కొరత ఏర్పడింది. గత కొద్ది వారాలుగా పాకిస్థాన్ దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు పలు విధాలుగా యత్నిస్తోంది.
ఐఎంఎఫ్ 7 బిలియన్ల డీల్‌పైనే ఆశలు
పలు షరతుల నడుమ అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్థాన్‌కు 7 బిలియన్ డాలర్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో దేశంలో కొత్త పన్నుల విధింపులు, పెట్రోలియం ధరల పెంపుదల వంటి చర్యలు తీసుకుంది. అయినా దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. కొత్త పన్నులతో దేశ ప్రజలు మరింతగా సతమతమవుతున్నారు. మినిబడ్జెట్ బిల్లు ద్వారా విధించిన ఈ పన్నులతో రూ.170 బిలియన్లు సమీకరించుకోవడం, ఐఎంఎఫ్ చెప్పినట్లు చేయడం వంటి చర్యలు చేపట్టారు. అయితే ఐఎంఎఫ్ డీల్ మంచిదే కానీ ఆర్థికంగా చితికిపోయి ఉన్న పాకిస్థాన్‌కు ఇది ఆలస్యపు సాయం అవుతుందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఎప్పటికప్పుడు ప్రధానితో చర్చించి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో శ్రామికవర్గాలపై పడుతున్న కొత్త పన్ను పోట్ల అంశం ఎటునుంచి ఎటు దారితీస్తుందో అనే భయాలు అక్కడి సైనిక రాజకీయవర్గాలకు ఆందోళన కల్గిస్తున్నాయి.