తగాదా అనంతరం ఘటన
ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
కరాచీ : పాకిస్తాన్‌లోని రేవు నగరం కరాచీలో మంగళవారం ఒక తగాదా అనంతరం ఒక స్థానిక భద్రత గార్డు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చైనా జాతీయులు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. సింధ్ రాష్ట్రంలోని కరాచీలో ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఆ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భద్రత గార్డు తన పై అధికారులపై కాల్పులు జరపడానికి దారి తీసిన సంఘటనను తాము దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అజహర్ మహేశర్ తెలియజేశారు.
భద్రత గార్డుతో వాగ్వాదం అనంతరం కాల్పుల్లో ఇద్దరు చైనా జాతీయులు గాయపడ్డారు. ఆ గార్డును ప్రస్తుతం అరెస్టు చేయడమైంది’ అని ఆయన తెలిపారు. క్షతగాత్రులు ఇద్దరినీ ఆసుపత్రికి వెంటనే తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న భద్రత గార్డును అరెస్టు చేయాలని సింధ్ హోమ్ శాఖ మంత్రి జియావుల్ హసన్ లాంజర్ అధికారులను ఆదేశించారు.