న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ పథకం రచించినట్టు నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లను జరపాలని కుట్ర పన్నినట్టు వెల్లడించాయి. ఈమేరకు ఐఎస్‌ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్టు , ఇలాంటి ఉగ్ర కార్యకలాపాల కోసం భారత్ లోని పాక్ స్లీపర్ సెల్స్‌కు భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇన్నోవా వాహనంలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను పలు రాష్ట్రాలకు తరలిస్తోన్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు ఆర్‌డీఎక్స్ కంటైనర్లు, ఒక తుపాకీ, 31 రౌండ్ల లైవ్ క్యాటరిడ్జ్‌లతోపాటు రూ. 1.30 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ నుంచి డ్రోన్ ద్వారా ఈ ఆయుధాలు వచ్చినట్టు నిందితులు విచారణలో చెప్పినట్టు సమాచారం.
భారత్‌లో రైల్వే ట్రాక్‌లు పేల్చేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -