ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటనకు వాణిజ్య విమానంలో స్వంత ఖర్చులతోనే వెళ్తారని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఆయన ప్రభుత్వ వ్యయం తోనే తన 16 మంది కుటుంబ సభ్యులతోపాటు పెద్దపరివారంతో సౌదీ అరేబియాకు వెళ్తారని వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నాయకులు చేసిన ఆరోపణలకు పాక్ సమాచార మంత్రి మరియం ఔరంగజేబ్ స్పందిస్తూ ప్రస్తుత ప్రధాని సౌదీ అరేబియా పర్యటనకు సంబంధించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యనించారు.ఈ వారం తరువాత కమర్షియల్ ఫ్లైట్ లోనే ప్రధాని తన స్వంత ఖర్చులతో సౌదీ అరేబియాకు వెళ్తారని వివరించారు.2008 నుంచి 2018 వరకు తాను పంజాబ్ సిఎంగా పాలించిన సమయంలో కూడా ఆయన తన స్వంత ఖర్చుతోనే కమర్షియల్ ఫ్లైట్‌లో ప్రయాణించారని ఉదహరించారు. పాక్ ప్రధాని షరీఫ్ గురువారం తొలిసారి సౌదీ అరేబియాకు పర్యటనకు వెళ్తున్నారు. సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. ఉమ్రా యాత్ర సందర్భంగా మక్కాకు కూడా ఆయన వెళ్లనున్నారు.