న్యూస్ డెస్క్: పాకిస్తాన్‌లో మొట్టమొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ నిధులతో నడిచే ఇస్లామాబాద్ లోని ఖ్వాయిద్ అజామ్ యూనివర్సిటీ విద్యార్థులు తమ క్యాంపస్‌లో జూన్ 12న రంగుల పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. యూనివర్సిటీకి చెందిన రాజకీయేతర సాంస్కృతిక సంస్థ మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూనివర్సిటీ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. విద్యార్థులు ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవడం నెటిజన్ల మనసులను గెలుచుకుంది. పాకిస్తాన్‌లో అత్యంత భారీ హోలీ ఉత్సవాలు అంటూ ఖ్వాయిద్ ఆజామ్ యూవర్సిటీ, ఇస్లామాబాద్ అంటూ శీర్షిక పెట్టింది. కాగా..ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
యూనివర్సిటీ క్యాంపస్‌లో హోలీ వేడుకలు జరుపుకున్న విద్యార్థులనందరినీ ఇండియా పంపెయ్యాలంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మూడు నెలల తర్వాత ఇప్పుడు హోలీ వేడుకలు ఏమిటంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. అయితే, విద్యార్థులకు అభినందనలు కూడా నెటిజన్ల నుంచి భారీగానే లభించాయి. అన్ని మతాలను, అన్ని సంస్కృతులను గౌరవించడమే అసలైన ప్రజాస్వామ్యమని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. యూనివర్సిటీ పాలకుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సాసృ్ంకతి ఉత్సవాన్ని యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించడానికి వీల్లేదని, హోలీ ఉత్సవాలు నిర్వహించిన సంబంధిత నిర్వాహకులు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవలసిందేనంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం విద్యార్థుల సంఘానికి నోటీసు జారీచేసింది. ఈ నోటీసుపై ఖ్వాయిద్ అజామ్ యూనివర్సిటీ అడ్మిషన్ సెల్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఘాటుగా ప్రకటన విడుదల చేసింది.
సాంస్కృతిక భిన్నత్వం తమ యూనివర్సిటీ ప్రత్యేకతని, మొత్తం ఉపఖండంలోనే భావప్రకటనా స్వేచ్ఛ ఉన్న విశ్వవిద్యాలయాలు రెండు ఉన్నాయని, ఒకటి భారత్‌లో రెండవది తమ యూనివర్సిటీ అని ఆ ప్రకటనలో తెలిపింది. సాంస్కృతికప్రదర్శనలపై దాడికి, వాటి నిషేధానికి ప్రయత్నించడం విద్యార్థుల్లో ఆగ్రహానికి, విద్వేషానికి దారితీయగలదని హెచ్చరించింది. తమపై పోలీసులతోకాని, దళాలతోకాని దాడి జరపడానికి ప్రయత్నించడం ఖండనీయమని పేర్కొంది. సంస్కృతి పేరిట నృత్యం చేయడం మతం పేరిట చంపడం కన్నా మంచిదేనంటూ విద్యార్థి విభాగం స్పష్టం చేసింది.
Holi celebrations in Quaid-I-Azam University Islamabad Pakistan 🍁
Biggest holi celebration in Pakistan 💓 pic.twitter.com/xdBXwYEglt— QAU News (@NewsQau) June 13, 2023