Saturday, January 25, 2025

ముందు ఈ మూడు పనులు చేయండి…. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 78 వ సర్వప్రతినిధి సమావేశాల్లో మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు మనదేశం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ కాకర్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై భారత్ స్పందిస్తూ నిరాధార ఆరోపణలు , తప్పడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. మానవ హక్కుల విషయంలో తన దారుణమైన రికార్డు నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఈ కుయుక్తులని అందరికీ తెలుసు.

జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు భారత్ లోని అంతర్భాగాలని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అక్కడి విషయాలు మా అంతర్గతం. మా విషయాలపై మాట్లాడడానికి పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కులేదు. దక్షిణాసియాలో శాంతియుత పరిస్థితుల కోసం పాక్ మూడు పనులు చేయాల్సి ఉంది. ఒకటి… సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు. ఉగ్రకార్యకలాపాలను నిలిపి వేయాలి. రెండు తన దురాక్రమణలో ఉన్న భారత భూభాగాలను వెంటనే ఖాళీ చేయాలి. మూడు… పాకిస్థాన్‌లో మైనార్టీల హక్కుల ఉల్లంఘనను అరికట్టాలి అని గట్టిగా బదులిచ్చింది. అంతకు ముందు అన్వర్ కాకర్ మాట్లాడుతూ భారత్‌తో పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య శాంతికి కశ్మీర్ కీలకమంటూ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ఉన్నచోట చర్చలకు తావులేదని భారత్ ప్రభుత్వం పాక్‌కు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇక ఈ సర్వప్రతినిధి సమావేశాలకు భారత్ తరఫున ప్రధాని మోడీ స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరవుతారు. ఆయన సెప్టెంబర్ 26 న ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News