17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన పిటీవీ యాజమాన్యం
ప్రధాని షరీఫ్ పర్యటన కవరేజిలో విఫలమైనందుకు చర్య
ఇస్లామాబాద్: పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజ్ ఇవ్వనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టీవీ( పిటీవీ)17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. కొత్తగా ప్రధానిగా ఎన్నికైన షరీఫ్ ఏప్రిల్ 24న లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు, రంజాన్ బజార్‌లను సందర్శించారు. అయితే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్(ఎఫ్‌టిపి) ద్వారా సంబంధిత వీడియో ఫుటేజిలను అప్‌లోడ్ చేయడానికి అవసరమైన అధునాతన ల్యాప్‌టాప్ అందుబాటులో లేనందున పిటీవీ బృందం సరైన కవరేజ్ అందించలేకపోయిందని ఓ వార్తాసంస్థ తెలిపింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం.. రిపోర్టర్లు, ప్రొడ్యూసర్లతో కూడిన బృందం ప్రధానమంత్రి కవరేజికి బాధ్యత వహిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్, సకాలంలో వీడియో ఫుటేజీల అప్‌లోడ్ కోసం వారి వద్ద అధునాతన ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లు ఉంటాయి. అయితే పిటీవీ లాహోర్ కేంద్రంలోని సిబ్బంది వద్ద అధునాతన ల్యాప్‌టాప్ లేకపోయింది.
పిఎం పర్యటన సందర్భంగా తమకు అధునాతన ల్యాప్‌టాప్ కావాలని అక్కడి సిబ్బంది చానెల్ ప్రధాన కార్యాలయాన్ని కోరారు. అంతకు ముందు ఏప్రిల్ 18న కూడా ఈ మేరకు ఓ లేఖ రాశారు.‘ లాహోర్ కేంద్రం ల్యాప్‌టాప్ ఎడిటింగ్ సదుపాయం లేదు. కాబట్టి ఓ ల్యాప్‌టాప్‌ను అద్దెకు తీసుకున్నాం. కానీ సొంత ల్యాప్‌టాప్ అత్యవసరం’ అని అందులో పేర్కొన్నారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా మరోసారి అద్దెకు తీసుకోవాలని సూచించింది. దీంతో వారు ఓ అధికారి వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ను తీసుకున్నారు. ప్రధాని కార్యక్రమం కవరేజి తర్వాత ఫుటేజిని ఎఫ్‌టిపి ద్వారా ప్రధాన కార్యాలయానికి పంపడానికి ప్రయత్నించగా దానిలో బ్యాటరీ అయిపోయింది. ఫలితంగా పిటీవీ స్పాట్ దృశ్యాలను ప్రసారం చేయలేకపోయింది. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం..వివిఐపి కవరేజ్ డిప్యూటీ కంట్రోలర్ ఇమ్రాన్ బషీర్ ఖాన్ సహా 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఇంజనీర్లు, కెమెరామన్‌లనూ తొలగించింది. అయితే కొంతమందిని కాపాడడం కోసం తమను బలిపశువులను చేశారని సస్పెన్షన్‌కు గురయిన ఉద్యోగులు ఆరోపించారు.