అవిశ్వాసంలో ఓడితే రాజీనామా చేయాలని సలహా
ఇస్లామాబాద్: నేషనల్ అసెంబ్లీలో పాక్ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సైన్యంపైనే గంపెడన్ని ఆశలు పెట్టుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఒక వేళ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తే సాయం చేయాలని ఇమ్రాన్ ఖాన్ కోరగా అందుకు ఆర్మీ చీఫ్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శనివారం ఆర్మీ చీఫ్‌జనరల్ ఖమర్ జావేద్ బాజ్వాతో ఐఎస్‌ఐ చీఫ్ భేటీ అయ్యారు. అంతేకాదు ఈ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్‌కు ఆర్మీ చీఫ్ రాజీనామా చేయమనే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అవిశ్వాసంలో గనుక ఓడితే ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్‌ది ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశం తర్వాత రాజీనామా చేయాల్సిందిగా ఇమ్రాన్‌ఖాన్‌తో ఆర్మీ చీఫ్ బాజ్వా చెప్పినట్లు సమాచారం.
ఇమ్రాన్ తరఫు రాయబారిగా ఐఎస్‌ఐ చీఫ్ నదీమ్ అంజుమ్ జరిపిన భేటీలో ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బాజ్వాతో పాటుగా ముగ్గురు సీనియర్ లెఫ్టెనెంట్ జనరల్స్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు బాజ్వాతో పాటుగా మిగిలిన ఆర్మీ అధికారులు కూడా ఇమ్రాన్‌ఖాన్‌కు దిగిపొమ్మనే సలహా ఇచ్చినట్లు తెలిసింది. పదవీ గండాన్ని తప్పించుకునేందుకు ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి ఆస్కారం ఇవ్వకూడదని నలుగురు ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌కు దారులన్నీ మూసుకుపోయాయి. ఇమ్రాన్ సొంతపార్టీ పాకిస్థాన్ తెహ్రీక్‌ఇ ఇన్సాఫ్‌కు చెందిన 24 మంది ఎంపిలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీసుకువచ్చే అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.