టెహ్రాన్ ః సమీపంలోని పొరుగు దేశం ఇరాన్‌పై పాకిస్థాన్ బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్‌లోని టెర్రరిస్టు స్థావరాలపై అత్యంత నిర్థిష్ట కీలక సైనిక దాడులను నిర్వహించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికారికంగా గురువారం మధ్యాహ్నానికి ముందే ప్రకటించింది. ఇరాన్‌లోని సియిస్టెన్ బలూచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే సమాచారం అందడంతో వీటిపై దాడికి దిగామని , తొమ్మండుగురు ఉగ్రవాదులు హతులు అయ్యారని పాకిస్థాన్ తెలిపింది. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రాతిపదికన తాము ఇరాన్‌లో మార్గ్ బార్ సర్మాచార్ అనే సంకేత పదజాలపు ఆపరేషన్‌కు పాల్పడినట్లు పాకిస్థాన్ తెలిపింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పాకిస్థాన్ కల్లోలిత ప్రాంతం బలూచిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ సుశిక్షిత సేనలు గ్రనేడ్ దాడులు, క్షిపణుల దాడులకు మెరుపు రీతిలో దిగింది.
ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం , పలువురు గాయపడటం వంటి ఘటనలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ చర్యకు ప్రతిచర్య తప్పదని పేర్కొంటూ గురువారం తెల్లవారుజామున పాకిస్థాన్ దాడులకు దిగింది. దీనిని ఇరాన్ పూర్తి స్థాయిలో ఖండించింది. తొమ్మండుగురు బలి అయ్యారని, దీనిని తాము తేలిగ్గా వదిలేసేది లేదని తేల్చిచెప్పింది. ఈ పరిణామాలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి. తమ దాడులలో చనిపోయింది కేవలం ఉగ్రవాదులే అని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అధికారిక మీడియా ఈ ఘటనలలో నలుగురు పిల్లలు సహా తొమ్మండుగురు చనిపోయినట్లు తెలిపింది. అయితే ఈ వాదనను పాక్ ఖండించింది.
తాము చేసింది మర్గ్ బార్ సర్మాచార్ ః పాక్
తాము వ్మూహత్మకంగా ఇరాన్‌పై దాడిచేసింది కేవలం ఇరాన్‌లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఉన్నారని తెలిసినందునే తాము మర్గ్ బర్ సర్మాచార్ చేపటినట్లు పాక్ సైనిక మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఇస్పార్) వెల్లడించింది. తమ ఆపరేషన్ గురించి అర్థం వివరించింది. మర్గ్‌బర్ అంటే వధ, సర్మాచార్ అంటే బలూచీ భాషలో గెరిల్లా అని అర్థం , గెరిల్లా తరహాలో శత్రువును మట్టుపెట్టడం అని పాకిస్థాన్ విభాగం తెలిపింది. తాము ఇరాన్‌లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) , బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్)లను లక్షంగా చేసుకుని తమ ఆపరేషన్ సాగించామని పాకిస్థాన్ సమర్థించుకుంది.
ఈ రెండు సంస్థల కార్యకలాపాల గురించి తమ ఇంటలిజెన్స్ వర్గాలు ఫక్కాగా అందించిన సమాచారం విశ్లేషించుకుని ఇప్పుడు ఈ దాడులకు దిగామని అధికార వర్గాలు తెలిపాయి. తాము కిల్లర్ డ్రోన్లను , రాకెట్లు, పలు రకాల ఆయుధాలను వాడినట్లు వెల్లడించారు. ఇరాన్‌లోని ఉగ్రవాద సంస్థలు తమ దేశంలో పలుసార్లు దాడులకు దిగినట్లు, వీటి గురించి తాము ఎన్నిసార్లు తెలిపినా ప్రయోజనం లేకుండా పోయిందని, పైగా ఇప్పుడు తమ దేశంలోకి ఇరాన్ ఉగ్రవాద ఏరివేత నెపంతో ఉగ్రవాద దాడికి దిగిందని పాకిస్థాన్ మండిపడింది.
ఇరాన్ ఖండన, పాక్‌దూతకు సమన్లు వివరణకు ఆదేశాలు
పాకిస్థాన్ జరిపిన దాడిపై ఇరాన్ అధికారికంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి నసీర్ కనానీ ప్రకటించారు. ఇరాన్‌లోని పాకిస్థాన్ దూతను పిలిపించినట్లు, వివరణ కోరినట్లు తెలిపారు. పాకిస్థాన్ జరిపిన దాడిలో చనిపోయిన తొమ్మండుగురు ఇరాన్ జాతీయేతరులు అని వీరిలో ఇద్దరు మగవారు, ముగ్గురు మహిళలు నలుగురు పిల్లలు ఉన్నారని వెల్లడించారు. జెహెదాన్ ప్రాంతపు రాజధాని సరవన్ సిటిలో పేలుళ్లు జరిగాయని కూడా అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వంలో పూర్తిస్థాయి కదలిక ఏర్పడింది. దావోస్‌లో ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరూల్ హక్ కాకర్ పర్యటన రద్దు చేసుకుని స్వదేశం వచ్చారు. ఉగాండలో ఉన్న విదేశాంగ మంత్రి హుటాహుటిన పాకిస్థాన్ చేరారు.