Monday, January 20, 2025

కివీస్‌పై పాకిస్థాన్ విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. శనివారం బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించారు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఫకర్ జమాన్ వీరి విహారం..
అయితే మరో ఓపెనర్ ఫకర్ జమాన్ అసాధారణ బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ అండతో జమాన్ పరుగుల వరద పారించాడు. న్యూజిలాండ్ బౌలర్లను హడలెత్తించిన జమాన్ వరుస సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. అతన్ని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అసాధారణ రీతిలో చెలరేగిన ఫకర్ జమాన్ 63 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన పాకిస్థాన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇదిలావుంటే పాక్ స్కోరు 21.3 ఓవర్లలో 160/1 ఉన్నప్పుడు తొలిసారి వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ లక్ష్యాన్ని 342 పరుగులుగా నిర్ధారించారు. తిరిగి ఆట ప్రారంభమైన తర్వాత ఫకర్ తన జోరును కొనసాగించాడు. బాబర్ కూడా దూకుడును ప్రదర్శించాడు.

25.3 ఓవర్లలో పాకిస్థాన్ స్కోరు 200/1 ఉన్నప్పుడు తిరిగి వర్షం ప్రారంభమైంది. దీంతో ఆట ముందుకు సాగలేదు.ఆట నిలిపి వేసే సమయానికి ఫకర్ జమాన్ 81 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 126 పరుగులు, బాబర్ ఆజమ్ 63 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. వర్షం తగ్గక పోవడంతో మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్లకు 401 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (108) మరో శతకం సాధించాడు. కెప్టెన్ విలియమ్సన్ (95) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఫిలిప్స్ (41), చాప్‌న్ (39) కూడా ధాటిగా ఆడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News