Sunday, December 22, 2024

అట్టుడుకుతున్న పాక్!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి జరిగిన తాత్కాలిక విఫల యత్నం ఆయన ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒక మాదిరి తిరుగుబాటు వీరుడి కాంతి వలయం ఆయన చుట్టూ ఏర్పడిందంటే అతిశయోక్తి కాబోదు. అదే సమయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పరువు మసకబారిందని అంగీకరించక తప్పదు. ప్రధానిగా వున్నప్పుడు విదేశాల నుంచి తనకు వచ్చిన ఖరీదైన బహుమతులను ఖజానా (తోషాఖానా)కు అప్పగించకుండా తన వద్ద వుంచుకొన్నాడని అటువంటి మూడు మిరుమిట్లు గొలిపే వాచీలను అమ్ముకొని 36 మిలియన్ డాలర్ల మేరకు సొమ్ము చేసుకొన్నాడనే ఆరోపణతో పెట్టిన కేసులో ఇమ్రాన్‌పై జామీనుకు అవకాశం లేని వారెంటు జారీ అయింది.

దానిపై ఆయనను అరెస్టు చేయడానికి ఇస్లామాబాద్ పోలీసులు మంగళవారం సాయంత్రం లాహోర్‌లోని ఆయన ఇంటికి వెళ్ళడం, అక్కడ భారీ ఎత్తున పోగైన ఆయన అభిమానులు, అనుయాయులు వారితో హోరాహోరీ తలపడడం జరిగాయి. ఈ ఘర్షణలు లాహోర్‌కే పరిమితం కాకుండా పాకిస్తాన్‌లోని మరి కొన్ని పట్టణాల్లో కూడా సంభవించాయని, సామాజిక మాధ్యమాల అండతో ఆందోళన బలం పుంజుకున్నదని తెలుస్తున్నది. అరెస్టును గురువారం ఉదయం 10 గం.కు వాయిదా వేయాలని లాహోర్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీసులు ఇమ్రాన్ ఇంటి వద్ద నుంచి వెనక్కు వెళ్ళిపోక తప్పలేదు. ఈ రోజు ఏమి జరుగుతుందో గాని ఇమ్రాన్ అనుయాయులు పోలీసులతో వీధి పోరాటాలకు కూడా సిద్ధపడడం పాక్‌ను భయపెడుతున్న అరాచక వ్యవస్థకు నిదర్శనమని చెప్పవచ్చు.

ఇది తీవ్ర స్థాయికి చేరితే సైన్యం నేరుగా రంగంలోకి దిగి పాలన పగ్గాలు మళ్ళీ చేపట్టే ప్రమాదముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఇమ్రాన్ దళాలు పోలీసులపై దాడికి దిగారని చావో రేవో తేల్చుకోవాలనే తెగువకు పాలడ్డారని వార్తలు చెబుతున్నాయి. అరెస్టు నుంచి తమ నేతను కాపాడుకోడానికి వారు ఆయన చుట్టూ మానవ కుడ్యం (గోడ) గా ఏర్పడ్డారని అగ్గిబరాటాలు కూడా పోలీసులపైకి విసిరారని సమాచారం. ఇస్లామాబాద్ పోలీసులు అరెస్టు పేరుతో తనను ఎత్తుకుపోయి హతమార్చాలని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్ 2018 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. 2022 వరకు ప్రధానిగా కొనసాగారు. మొదట్లో పాక్ సైన్యం మద్దతును చూరగొన్న ఇమ్రాన్ ఆ తర్వాత దానితో తీవ్రంగా విభేదించారు.

2022 ఏప్రిల్‌లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయనపై తీసుకు వచ్చిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఊహించని పరిణామాలు సంభవించాయి. ఇమ్రాన్ ఆ తీర్మానానికి తలవొగ్గకుండా పార్లమెంటును రద్దు చేశారు. సుప్రీంకోర్టు దానిని తప్పుపడుతూ తీర్పు ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మొత్తం 342 మంది పార్లమెంటు సభ్యుల్లో ప్రతిపక్షాలు 174 ఓట్లతో బొటాబొటీగా ఆధిక్యాన్ని సాధించుకొని ఇమ్రాన్‌ను గద్దె దించాయి. అమెరికా పన్నిన కుట్ర మేరకే తాను అధికారం కోల్పోయానని ఇమ్రాన్ బహిరంగంగానే ఆరోపించారు. దానిని సైన్యం ఖండించింది. వచ్చే అక్టోబర్‌లో పాకిస్తాన్ పార్లమెంటుకు ఎన్నికలు జరగవలసి వుంది. మూడుసార్లు ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ సోదరుడైన ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంత వరకు అధికారంలో కొనసాగగలుగుతారా లేదా అనే అనుమానాలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఇంత వరకు పాకిస్తాన్ ప్రధాని ఐదేళ్ళ పాటు పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్న దాఖలా లేదు.

ఇప్పట్లో ఎన్నికలు జరిగితే ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం సాధిస్తాడని, అది పాకిస్తాన్‌ను ఏక వ్యక్తి నియంతృత్వంలోకి నెట్టివేస్తుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతాయని వారంటున్నారు. దశాబ్దాల పాటు ఘోరమైన సైనిక నియంతృత్వంలో మగ్గిన పాకిస్తాన్ అతి కష్టం మీద పాక్షికమైన ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చింది. అక్కడ మొదటి సాధారణ ఎన్నికలు 1970లో జరిగాయి. పేరుకి ప్రజాస్వామ్య ప్రభుత్వాలే అయినప్పటికీ సైన్యం వెనుక సీటు డ్రైవింగ్ చేస్తూనే వున్నది. దానిని కాదని ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకొనే సాహసం ఏ ప్రభుత్వం చేయజాలదు. పాక్ సైన్యం తనను గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నదనే సూచనలు కనిపించడంతో ఇమ్రాన్ 2022లోనే తాను ప్రతిపక్షంలో వుంటే మరింత ప్రమాదకారిని అవుతానని హెచ్చరించారు. ప్రధానిగా వున్నప్పుడు కంటే వీధుల్లో వున్నప్పుడే తాను ఎక్కువ సవాలుగా మారుతానని ప్రకటించారు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ అరెస్టు ఘట్టం పోలీసులతో పిటిఐ దళాల ఘర్షణలు మరింతగా ప్రజ్వరిల్లకుండా చేసుకోడం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి సాధ్యమవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News