Monday, December 23, 2024

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

ఆరు పాయింట్ల కోత విధించిన ఐసిసి

దుబాయి: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి ఇంటాబయట విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో కోలుకోలేని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమితో ఇప్పటికే షాక్‌లో ఉన్న పాక్‌కు ఐసిసి మరో ఝలక్ ఇచ్చింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటను పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో ఐసిసి పాకిస్థాన్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఐసిసి ఆరు పాయింట్ల కోతను విధించింది. అంతేగాక మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది.

బంగ్లాదేశ్ కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా మూడు పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో బంగ్లా టీమ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా రూపంలో చెల్లించక తప్పలేదు. ఇదిలావుంటే స్లో ఓవర్‌రేట్ కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లకు ఐసిసి పాయింట్ల కోత విధించడంతో రెండు జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఐదో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ ఎనిమిదో స్థానానికి దిగజారింది. కాగా, తొలి టెస్టులో బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. పాక్‌పై టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం.

షకిబ్‌కు జరిమానా

పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో షకిబ్ చాలా దురుసుగా ప్రవర్తించాడు. రిజ్వాన్‌ను కొట్టేందుకు వెళ్లిన షకిబ్‌పై ఐసిసి చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. అంతేగాక ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ లెవన్ 1ను ఉల్లంఘించినందుకు ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చింది. కాగా, రిజ్వాన్‌పైకి షకిబ్ బంతిని విసిరాడు. దీంతో అతనిపై ఐసిసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News