Monday, December 23, 2024

పాకిస్తాన్ దివాలా తీయనుందా?

- Advertisement -
- Advertisement -

గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు. లీటరు పాల ధర రూ. 108.71, కిలో బియ్యం రూ. 245, డజను గుడ్ల ధర రూ. 240, కోడి మాంసం కిలో రూ. 548, కిలో ఉల్లి రూ. 86, బ్రెడ్ రూ. 108 (నంబియో డాట్‌కావ్‌ు) పాకిస్తాన్ నుంచి వస్తున్న వార్తలివి. అక్కడ విద్యుత్ కొరత ఉంది.(మన గుజరాత్‌లో కూడా గత వేసవిలో గంటల కొద్దీ ఇండ్లకు, వారానికి ఒకసారి పరిశ్రమలకు కోత విధించారు) అక్టోబరులో సవరించిన ధరల ప్రకారం 50 యూనిట్లకు రూ. 2 నుంచి 700 వరకు శ్లాబుల వారీ పెరుగుతూ రూ. 20.82, అంతకు మించితే ప్రతియూనిట్‌కు రూ. 23.92 ఇవిగాక ఇతర పన్నులు అదనం.

అక్కడి ధరలతో పోల్చుకొని మన దేశంలో ధరలను చూడండి, నరేంద్ర మోడీ పాలన జనాలకు మంచి రోజులు తెచ్చిందా లేదా అని భక్తులు రెచ్చిపోతున్నారు, అడ్డు సవాళ్లు విసురుతున్నారు. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నమాట నిజం. అక్కడ పరిస్థితులన్నీ సజావుగా ఉన్నట్లు, జరుగుతున్నదంతా సరైనదే అని ఎవరూ చెప్పటం లేదు. అవసరమూ లేదు. అలాంటి దేశం గురించి ఎక్కువగా చెబుతున్నదీ, పోలుస్తున్నదీ ఎవరంటే బిజెపి నేతలు, మద్దతుదారులే. ఎందుకంటే అంతకంటే మెరుగైన దేశంతో పోల్చుకొనేందుకు వారి దగ్గర ఏమీ లేకపోవటమే. అక్కడ పెట్రోలు, డీజిలు ధరలు తక్కువ అంటే వెళ్లి అక్కడి నుంచి తెచ్చుకోవాలని ఎద్దేవా చేస్తారు. మన దేశంలో గత నెల రోజులుగా గోధుమల టోకు ధర కిలో రూ. 28.50గా ఉందని, ఇది కనీస మద్దతు ధర కంటే 40 శాతం ఎక్కువ అని జనవరి 7వ తేదీ టైవ్‌‌సుఆఫ్ ఇండియా పత్రిక పేర్కొన్నది.

ప్రైస్ ఇ డాట్‌కామ్ జనవరి 8వ తేదీ సమాచారం ప్రకారం ఆశీర్వాద్ షర్బతీ గోధుమ పిండి ధర అమెజాన్‌లో రూ. 282 (ఐదు కిలోలు) అదే కంపెనీ సుపీరియర్ ఎంపి రకం ధర రూ.175 (ఐదు కిలోలు), ఆశీర్వాద్ శుద్ధ్ద గోధుమ పిండి రకం ధర రూ.95 (రెండు కిలోలు). విడిగా ఎలాంటి బ్రాండ్ లేకుండా దొరికే పిండి ధర కిలో రూ. 40 కి అటూ ఇటూగా ఉంటున్నది. మన దగ్గర 14.5 కిలోల గాస్ బండ ధర రూ. 1,105 గా ఉంది. మరి వీటితో పోల్చినపుడు పాకిస్తాన్ కంటే మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. నిజమే కనిపించేదాన్ని కాదని ఎలా అంటాం? ఎఎన్‌ఐ వార్తా సంస్థ జనవరి 7 తేదీన పేర్కొన్న దాని ప్రకారం పాక్ పంజాబ్‌లో 15 కిలోల గోధుమ పిండి సంచి ధర రూ. 2,250 (కిలో 130 నుంచి 150 వరకు ఉంది), అదే వార్తలో మండ్ గోధుమల ధర రూ. 5,000కు తాకినట్లు కూడా పేర్కొన్నది. మండ్ అంటే 37 కిలోల 324 గ్రాములకు సమానం. ఈ లెక్కన కిలో గోధుమలకు అక్కడి రైతులు రూ.134 పొందుతున్నారు.

టైవ్‌‌సుఆఫ్ ఇండియా పత్రిక పేర్కొన్న ప్రకారం అదే మన రైతులు పొందుతున్నది రూ.28.50 మాత్రమే! ఇది ఘోరం అని అనిపించటం లేదూ! పాక్ రైతులు అంత మొత్తం పొందుతుండగా మన రైతులకు ఎందుకు ఇవ్వటం లేదు? మన రైతుల్ని పాకిస్తాన్ వెళ్లి అమ్ముకోమంటారా? ఒక డాలరుకు మన కరెన్సీ రూపాయి విలువ జనవరి 8వ తేదీన రూ.82.27 ఉంది. పాకిస్తానీ రూపాయి విలువ రూ.227.25గా ఉంది. మన ఒక రూపాయి 2.76 పాక్ రూపాయలకు సమానం. మన దేశ బహిరంగ మార్కెట్ నుంచి పాకిస్తాన్ ఒక క్వింటాలు గోధుమలను దిగుమతి చేసుకుంటే వారు చెల్లించాల్సిన మొత్తం రూ.7,866 అవుతుంది. (మన బహిరంగ మార్కెట్ ధర కిలోకు రూ. 28.50, దాన్ని పాక్ కరెన్సీలోకి మారిస్తే రూ.78.66, ఆ లెక్కన క్వింటాలు ధర రూ.7,866. కానీ పాక్ రైతులకు కిలోకు రూ.134 వంతున 13,400 దక్కుతున్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది. పాక్‌లో గ్యాస్ కిలో ధర రూ.216. మన దేశంలో రూ.76.20. గ్యాస్‌ను మనమూ దిగుమతి చేసుకోవాలి, పాకిస్తాన్ కూడా దిగుమతి చేసుకోవాల్సిందే.

అందువలన తక్కువగా ఉన్న పాక్ కరెన్సీ విలువను చూపి అక్కడ ఎంతో ఎక్కువగా ఉన్నట్లు చిత్రించటాన్ని ఏమనాలి? రెండు కరెన్సీల పేర్లూ రూపాయి కావటంతో మభ్య పెట్టేందుకు వీలు కలుగుతోంది. గ్లోబల్ ప్రైస్ డాట్‌కావ్‌ు ప్రతి దేశంలో ఉన్న స్థానిక కరెన్సీలో ఉన్న పెట్రోలు, డీజిలు ధరలను డాలర్లలోకి మార్చి ధరల తీరు తెన్నులను వారానికి ఒకసారి ప్రచురిస్తుంది. దాని ప్రకారం పెట్రోలు, (బ్రాకెట్లలో డీజిలు) ధరలు డాలర్లలో జనవరి 2వ తేదీన ఇలా ఉన్నాయి. పాకిస్తాన్ 0.947(1.005), భూటాన్ 0.990( 0.947), మయన్మార్ 1.046(1.156) చైనా 1.178(1.051), బంగ్లాదేశ్ 1.221(1.024), భారత్ 1.260 (1.130), నేపాల్ 1.344 (1.324), శ్రీలంక 1.396(1.108) ఉంది.

ఇప్పటికీ మన దేశంలో పాకిస్తాన్ కంటే చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో లీటరు పెట్రోలు ధర 0.893, డీజిలు ధర 1.199 డాలర్లుగా ఉంది. ప్రతి దేశం ఎగుమతులు చేస్తుందా లేదా అన్నది ఒక అంశమైతే, దానికి అనేక అంశాలు తోడు కావాలి. సాధారణంగా ఎగుమతులు చేసే దేశాల కరెన్సీ విలువ తక్కువగా ఉంటేనే అది అంతర్జాతీయ మార్కెట్లో తన సరకులను అమ్ముకోగలుగుతుంది అని చెబుతారు. ఇది ఒక అంశం తప్ప అదొక్కటే చాలదు, జపాన్ ఎన్ విలువ ఒక డాలరుకు 132 కాగా, చైనా యువాన్ విలువ 6.84 ఉంది. జపాన్ కరెన్సీ విలువ తక్కువగా ఉన్నా, చైనాతో పోలిస్తే వేతనాలు ఎక్కువ గనుక ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. అందువలన ఒకే వస్తువును చైనా తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తున్నది. మన దేశంలో వేతనాలు, కరెన్సీ విలువ తక్కువ ఉన్నప్పటికీ సరైన విధానం, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం లేక ఎగుమతులు చేయలేని స్థితి.

మన దేశంలో తక్కువ ఆదాయం వచ్చే వారు పెరిగిన ధరలతో ఎలా ఇబ్బందులు పడుతున్నారో పాకిస్తాన్‌లో కూడా మన కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణ పెరుగుదల ఉన్నందున అక్కడి పేదలు కూడా ఒకింత ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే పెట్రోలు, డీజిలు ధరలకు పన్నులు వడ్డిస్తే భారం మరింతగా పెరుగుతుంది కనుక మన మాదిరి పన్నులు లేనందున, దాని కరెన్సీ విలువ ఎంత తగ్గినా మనతో పోలిస్తే తక్కువ ధరలకు పెట్రోలు, డీజిలు అందుబాటులో ఉంటున్నది. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రుణ భారంతో శ్రీలంక తీవ్ర పరిస్థితి ఎదుర్కొన్నట్లుగానే పాకిస్తాన్ కూడా అదే బాటలో ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. దివాలా కోరు విధానాలను అనుసరిస్తే ఏ దేశమైనా అదే విధంగా మారుతుంది. పాకిస్తాన్ నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక “డాన్‌” డిసెంబరు 18వ తేదీన ప్రచురించిన ఒక (ఇద్దరుఆర్థిక నిపుణుల) విశ్లేషణలో కొన్ని అంశాలు దిగువ విధంగా ఉన్నాయి. దేశ విభజన నాటి నుంచే పాకిస్తాన్‌కు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని శక్తులు తమ స్వప్రయోజనాల కోసం దేశాన్ని రుణగ్రస్తం గావించాయి.

విభజనతో నాడు వలస పాలనలో ఉన్న రాబడిలో 17 శాతం పాకిస్తాన్‌కు రాగా మిలిటరీలో 33శాతాన్ని భరించాల్సి వచ్చింది. దీని వలన అనేక ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ 22 సార్లు ఐఎంఎఫ్ రుణాలు తీసుకోగా భారత్ ఏడు, బంగ్లాదేశ్ పదిసార్లు మాత్రమే తీసుకుంది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అనేక సార్లు సంక్షోభాలు దగ్గరకు వచ్చిన అనుభవాలను చూసింది. చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ప్రతిసారీ మరింత నష్టం జరగకుండా ఐఎంఎఫ్ ఆదుకున్నది. ఆ సాయాన్ని సాంప్రదాయ పద్ధతుల్లో ఆర్థిక రంగం స్వల్పకాలిక స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగించారు. తరచుగా సంక్షోభాలు రావటం, వాటి ప్రభావాలు పేరుకు పోవటంతో దీర్ఘకాలిక సవాళ్లు అలాగే ఉండి మొత్తం వృద్ధి మీద ప్రభావం చూపుతున్నది. ప్రారంభంలో పాకిస్తాన్ కంటే భారత్ వెనుకబడి ఉంది, 1980 దశకంలో ఒక దశలో పాక్ ఆర్థిక వృద్ధి రేటు భారత్‌ను దాటింది.

1990ల్లో భారత ఆర్థిక సంస్కరణలు నిరంతర వృద్ధి బాటలో దేశాన్ని నిలిపాయి. పాకిస్తాన్ ఆర్థిక పురోగమనంలో దిగజారుడు అలాగే ఉంది. ప్రస్తుతం అస్థిరమైన జిడిపి వృద్ధిరేటు, కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పతనం, దానితో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విస్తృతం అవుతున్న కరంట్ ఖాతా లోటు ఉంది. ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతున్నది. వ్యవస్థాగతమైన ఆర్థిక సమస్యలేమిటో నిర్ధారించకుండా రాజ్యం రెంటియర్ ఆర్థిక వ్యవస్థను తయారు చేసింది. (దీని అర్ధం ఏమంటే కొత్త నిర్మాణాలేమీ లేకుండానే ఉన్న ఇండ్లకు అద్దె వసూలు చేసుకోవటం, బతకటం) సమాజంలో ఆర్థికంగా ఉన్నతులైన వారందరూ అనేక సబ్సిడీలు పొందటంలో నిమగ్నమయ్యారు. దీంతో ఉన్న అప్పులకు తోడు మరింతగా పెరిగాయి. అప్పులు పెరిగినపుడు పెట్టుబడులను ఆకర్షించటం, నవీకరణలు ప్రోత్సహించటం పాకిస్తాన్‌కు పెద్ద సవాలుగా ఉంది. చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఒక కారణం నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం. 1993 2020 సంవత్సరాలలో పాకిస్తాన్ కేవలం రెండు సార్లు ఆరు శాతం కంటే ఎక్కువగా వృద్ధి రేటును సాధించగా భారత్‌లో పద్దెనిమిది సార్లు ఉంది. ఇదీ డాన్ విశ్లేషణ సారం.

పాకిస్తాన్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. దీంతో వెంటనే దీనికి కారణం చైనా నుంచి తీసుకున్న అప్పులే అనే ప్రచారం మొదలైంది. డాన్ పత్రికలో రాసిన విశ్లేషణ ప్రకారం పాక్ పాలకులు అనుసరించిన విధానాలే ప్రస్తుత స్థితికి కారణం. గతంలో 22 సార్లు ఐఎంఎఫ్ ఎందుకు రుణాలిచ్చి ఆదుకున్నట్లు? అప్పుడేమీ చైనా నుంచి ప్రాజెక్టు రుణాలు లేదా ఇతర రుణాలేమీ లేవు కదా? పాక్ అవసరాలకు లేదా అభివృద్ధికి పశ్చిమ దేశాలు తగినన్ని అప్పులిచ్చి పరిస్థితిని మెరుగుపరచి ఉంటే చైనా ప్రవేశానికి అవకాశం ఉండేది కాదు కదా! అవెందుకు ఇవ్వలేదు అంటే పాకిస్తాన్ లేదా మరొక దేశం అభివృద్ధి చెందితే వాటి మీద ఆధారపడటం లేదా దిగుమతులను తగ్గించుకుంటే వాటికి ఒరిగేదేమీ ఉండదన్న ఆలోచన తప్ప మరొకటి కాదు. మరి చైనా ఎందుకు పెట్టుబడులు పెడుతోంది, అప్పులు ఇస్తోంది అంటే పరస్పరం లబ్ధి చేకూరుతుంది గనుక. ఇప్పుడు పాకిస్తాన్ విదేశీ చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటోంది.

పారిస్ క్లబ్, ఇతర సంస్థలు ఇచ్చిన రుణాల చెల్లింపు గడువు దగ్గరపడింది తప్ప చైనా రుణాలు కాదు. పారిస్ క్లబ్ పేరుతో ఉన్న 22 ధనిక దేశాలు వంద దేశాలకు 610 బి.డాలర్లు రుణాలిచ్చాయి. పాకిస్తాన్‌కు పది బి.డాలర్లు వాటిలో ఉంది. ఇప్పటి వరకు రెండు సార్లు పారిస్ క్లబ్ రుణాల చెల్లింపు గడువును పెంచి వెసులు బాటు కల్పించింది. ఉగ్రవాదం మీద పోరులో అమెరికాతో కలసి పాకిస్తాన్ పోరాడింది కనుక రుణాలు చెల్లించలేనందున 15 సంవత్సరాల పాటు కిస్తీ గడువు పెంచింది. తరువాత కరోనా కారణంగా మరో ఐదేండ్లు పెంచింది. ఇప్పుడు మరోసారి ఆ పని చేసి ఆదుకోవాలని పాక్ కోరుతోంది.డిసెంబరు నాటికి కిస్తీ సొమ్ము 110 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి రుణాలను తీర్చేందుకు, దిగుమతుల అవసరాల కోసం ఐఎంఎఫ్‌తో మరింత అప్పు కోసం పాక్ సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది.

ఎం కోటేశ్వరరావు, 8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News