లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ అత్యున్నత ఎన్నికల కమిషన్ నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు జాతీయ అసెంబ్లీ సీట్లకు ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కమిషన్ శనివారం తిరస్కరించింది. ‘పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పిటిఎఫ్) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ లాహోర్ (ఎన్‌ఎ 122), మియాన్‌వలీ (ఎన్‌ఎ89) సీట్ల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఇసిపి) రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు’ అని లాహోర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వెల్లడించింది.
తోషఖానా కేసుల ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారణ కావడం ప్రధాన కారణం కాగా, పిటిఎఫ్ వ్యవస్థాపకుకి సంబంధిచిన ప్రతిపాదకుడు, సమర్థకుడు ఆయా నియోజకవర్గాలకు చెందిన వారు కారంటూ అభ్యంతరాలు లేవదీశారు. ఇమ్రాన్ ఖాన్ శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేయకపోయినా ఆయన అనర్హత ఇప్పటికీ చెల్లుతుందని ఆర్‌ఒలు తెలిపారు. 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ సీనియర్ సహచరుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మసూద్ ఖురేషి మే 9 నాటి అల్లర్ల నుంచి పలు కేసులు, అరెస్టులను ఎదుర్కొంటున్నారు. వారు ఇద్దరు రావల్పిండిలోని అడియాలా జైలుతో నిర్బంధంలో ఉన్నారు.