దుబాయి: టి20 వరల్డ్‌కప్‌లో అసాధారణ ఆటతో అలరిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ పాకిస్థాన్ విజయం సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విశ్వ కప్ బరిలోకి దిగిన పాకిస్థాన్ సంచలన విజయాలతో గ్రూప్2లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై సంచలన విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో భారత్‌పై ఉన్న వరుస ఓటముల రికార్డును పాకిస్థాన్ చెరిపేసుకుంది. ఈ మ్యాచ్‌లో చారిత్రక విజయాన్ని పాక్ అందుకుంది. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ తదితరులు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోతున్నారు. షాహిన్ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జట్టుకు పైచేయి అందిస్తున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లు అజేయ సెంచరీలతో కదం తొక్కారు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీలు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు.
బౌలింగ్‌లో హారిస్ రవూఫ్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ జయభేరి మోగించింది. బౌలర్లు సమష్టిగా రాణించి అఫ్గాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది తదితరులు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఇక బ్యాటింగ్‌లో మరోసారి బాబర్ ఆజమ్ మెరిశాడు. షోయబ్ మాలిక్ కూడా తనవంతు పాత్ర పోషించాడు. ఇక చివర్లో ఆసిఫ్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. తీవ్ర ఒత్తిడిలోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. జన్నత్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏకంగా నాలుగు భారీ సిక్సర్లతో 24 పరుగులు సాధించాడు. దీంతో పాక్ మరో ఓవర్ మిగిలివుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక గ్రూప్2లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచిన పాకిస్థాన్ సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు సొంతం చేసుకుందనే చెప్పాలి. పాక్ ఇప్పటికే కీలకమైన మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక చిన్న జట్లు నమీబియా, స్కాట్లాండ్‌లతో మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆటను చూస్తుంటే ఈ జట్లను చిత్తుగా ఓడించడం ఖాయం.