Thursday, January 23, 2025

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టు
ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద బలవంతంగా అదుపులోకి తీసుకున్న పాక్ రేంజరు
అరెస్టును అడ్డుకునేందుకు యత్నించిన లాయర్లు, గాయాలు
రహస్య ప్రదేశానికి తరలింపు

ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. ఓ కేసు విచారణ నిమిత్త మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను పాక్ రేంజర్లు అరెస్టు చేశారు.అవినీతికి సంబంధించిన కేసుల్లో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పాక్ గూఢచార సంస్థకు చెందిన ఉన్నతాధికారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దేశంలో శక్తివంతమైన ఆర్మీ ఆరోపించిన 24 గంటలకే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడం గమనార్హం. ఇమ్రాన్‌ను అరెస్టు చేసే క్రమంలో హైకోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టును అడ్డుకునేందుకు ఇమ్రాన్ లాయర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణలు చోటు చేసుకుని లాయర్లు సహా పలువురు గాయపడ్డారు.దీనిపై పిటిఐ పార్టీ ఉపాధ్యక్షుడు ఫవాద్ చౌధరీ వరస ట్వీట్లు చేశారు.‘ కోర్టు ప్రాంగణంలోకి చొరబడిన రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను చుట్టుముట్టారు.. బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.

పాక్ రేంజర్లు ఇమ్రాన్‌ను హింసిస్తున్నట్లు కూడా పిటిఐ ఆరోపించింది. మరో వైపు ఇమ్రాన్ అరెస్టుకు సంబంధించిన వీడియోలను పిటిఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. పాక్ ప్రభుత్వం ఇమ్రాన్‌ను వేధిస్తోందని ఆరోపించింది. అరెస్టు సమయంలో ఇమ్రాన్ గాయపడినట్లు కూడా పేర్కొంది. అయితే ఇమ్రాన్ ఖాన్‌ను అల్ ట్రస్టు కేసుకు సంబంధించి అరెస్టు చేసినట్లు నేషనల్ అకౌంటబుల్ బ్యూరో( ఎన్‌ఎబి)కి చెందిన అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఇమ్రాన్ అరెస్టు వారంట్లు ఈ రోజు జారీ చేయడం జరిగిందని, దరిమిలా ఆయనను అరెస్టు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. అయితే అరెస్టు వారంట్లు మే 1న జారీ చేసినట్లుగా వాటిలో ఉంది. కాగా అనేక నోటీసులు ఇచ్చినప్పటికీ ఇమ్రాన్ కోర్టు ఎదుట హాజరు కాలేదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రానా సనావుల్లా చెప్పారు. అంతేకాదు ఇమ్రాన్ ను హింసించినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

అరెస్టుకు ముందు ఇమ్రాన్ వీడియో
అటు అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ కూడా ఓ వీడియోను విడుదల చేశారు. తనను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అందులో ఆరోపించారు. పాక్ మిలిటరీపై ఇమ్రాన్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. వజీరాబాద్‌లో తనపై జరిగిన హత్యాయత్నంలో ఓ సీనియర్ ఇంటెలిజన్స్ అధికారి హస్తం ఉందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పాక్ మిలిటరీ ఖండించింది. దీనిపై ఇమ్రాన్ మంగళవారం మరోసారి స్పందిస్తూ.. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో విడుదల చేసిన కొద్ది గంటలకే ఆయనను అరెస్టు చేయడం గమనార్హం.

గత ఏడాది ఏప్రిల్‌లో అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి ప్రధాని పదవినుంచి వైదొలగిన ఇమ్రాన్ ఖాన్ 120కి పైగా కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఇందులో దేశద్రోహానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఆయనను అరెస్టు చేసేందుకు పాక్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉంది.ఈ క్రమంలోనే పాక్ రేంజర్లు ఆయనను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అరెస్టు చేసిన తర్వాత రేంజర్లు ఇమ్రాన్‌ను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం

మరో వైపు తాజా ఘటనపై ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆమిర్ ఫారుక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు డాన్ మీడియా కథనం వెల్లడించింది. 15 నిమిషాల్లో కోర్టు ముందు హాజరు కావాలని ఇస్లామాబాద్ పోలీసు చీఫ్ హోం శాఖ కార్యదర్శి, అదనపు అటార్నీ జనరల్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. లేదంటే ప్రధానికి సమన్లు పంపాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది. ఇమ్రాన్‌నే ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలంటూ చీఫ్ జస్టిస్ ఆదేశించినట్లు ఆ కథనం తెలిపింది.

ఏడు కేసుల్లో బెయిల్
ఇదిలా ఉండగా అరెస్టు కావడానికి కొద్ది గంటల ముందు గత మార్చి 18న ఫెడరల్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ వెలుపల జరిగిన హింసకు సంబంధించి యాంటీ టెర్రరిస్టు కోర్టు ఇమ్రాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడు కేసుల్లోను ఇమ్రాన్‌కు 50 వేల రూపాయల( పాక్ కరెన్సీ) వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఎటిసి జడ్జి రజా జవాద్ అబ్బాస్ ప్రకటించారని డాన్ దినపత్రిక తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News