ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఆ తేదీని ఫిబ్రవరి 8 కి మార్పు చేసినట్టు ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అలీ ప్రకటించారు. తొలుత గురువారం ఉదయం పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. పాక్ ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ)ఈ విషయంపై అధ్యక్షుడు అల్వీతో చర్చించాలని ఈసీపీని ఆదేశించారు. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ సికిందర్ సుల్తాన్
రజా సారథ్యం లోని ప్రతినిధి బృందం అల్వీతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తేదీ, నియోజకవర్గాల ఏర్పాటు అంశంపై అధ్యక్షుడు ఆరా తీశారు. అనంతరం పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న ఎన్నికలను నిర్వహించడానికి ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం కుదిరింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి నియోజకవర్గాల ఏర్పాటు అంశం ఓ కొలిక్కి వస్తుందని , ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుందని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సజీల్ స్వాతి తెలిపారు.