పాకిస్థాన్‌లో పెట్రోలు , హైస్పీడ్ డీజిల్ ధరలను తగ్గించారు. పెట్రోలు ధర లీటరుకు పదిరూపాయల ఇరవై పైసలు చొప్పున తగ్గించగా , ఈ హైస్పీడ్ డీజిల్ ధరలను లీటర్ రూ 2.33 వంతున కుదించారు. ద్రవ్యోల్భణం, విపరీత ధరలు, అందని సరుకుల నడుమ అల్లాడుతున్న పాకిస్థానీయులకు ఈ ఇంధన ధరల తగ్గింపు ఈద్ ఉల్ అధా (బక్రీద్) పండుగ నేపథ్యపుఏ కానుక అయింది. శనివారం నుంచే ఈ ధరల తగ్గింపు అమలులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి పదిహేను రోజులకోసారి దేశంలో ఇంధన ధరల సమీక్ష జరుగుతుంది. దీని తరువాత ఇప్పుడు ధరల తగ్గింపు ప్రకటన వెలువరించారు. ఈ నిర్ణయం వచ్చే పదిహేనురోజుల వరకూ అమలులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు, వినియోగదారుల ధరల సూచీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
2022 మే నెల నుంచి పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి ఎగబాకుతూ వెళ్లింది. చివరికి పిండి, తిండిగింజల కొరత కూడా ఏర్పడింది. ధరలు విపరీత స్థాయిక చేరాయి. మరో వైపు ఆహారధాన్యాల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ దేశ ప్రజలకు తొలిసారిగా దక్కిన భారీ ఉపశమనం ఇదే అయింది. ఇంధన ధరల తగ్గుముఖంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా కొంచెం తగ్గుముఖంపడుతాయని భావిస్తున్నారు. బక్రీద్ పండుగ సోమవారం జరుగుంది. దేశంలో పరిస్థితి చక్కబడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతిపాదిత బెయిలౌట్ కార్యక్రమానికి అనుగుణంగా పాకిస్థాన్ ప్రభుత్వం తగు విధంగా సంస్కరణలు అమలుచేస్తోంది. ఇప్పటి ఇంధన ధరల తగ్గింపు నిర్ణయానికి ముందు దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ ప్రకటనలో పరిశ్రమలకు విద్యుత్ బిల్లులను భారీ స్థాయిలో తగ్గిస్తున్నట్లు తెలిపారు. యూనిట్‌కు రూ 10.69 పైసలు చొప్పున ఈ తగ్గింపు అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు.